వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు ఏడాదికి పైగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. దాదాపు 440 రోజులుగా రైతులు ఏదో ఒక రూపంలో తమ నిరసన ప్రకటిస్తున్నారు. కానీ.. ప్రభుత్వం లైట్ తీసుకుంటోంది. అదే సమయంలో ఈ ఆందోళనకు సాధారణ ప్రజల మద్దతు కూడా లేకుండా పోయింది. దీంతో.. అమరావతి రైతులు తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: దేశంలో వాట్సాప్ బ్యాన్ అవుతుందా? కేంద్రం కఠిన నిబంధనలు
రాష్ట్ర రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ వీరు చేపట్టిన ఆందోళనకు.. ఇప్పటి వరకూ విపక్ష పార్టీల నుంచి మాత్రమే మద్దతు లభించింది. టీడీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు పూర్తిగా మద్దతు ప్రకటించాయి. ఇక, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం మూడు రాజధానుల ప్రతిపాదనను కరాఖండిగా వ్యతిరేకించట్లేదు. ఇక, ప్రజల నుంచి కూడా ఈ రైతుల ఆందోళనకు సహకారం లభించట్లేదు.
దీంతో.. తమ సమస్యను రాష్ట్రం మొత్తానికి అర్థం చేయించేందుకు బస్సు యాత్ర చేపట్టాలని కూడా నిర్ణయించుకున్నారు అమరావతి రైతులు. కానీ.. కరోనా విజృంభణతో ఆ ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో.. ఇక్కడి వారు సాగిస్తున్న ఆందోళన ఒక సాధారణ విషయంగా మారిపోయింది. అయితే.. ఎలాగైనా తమ సమస్యను ప్రముఖంగా మార్చాలని భావిస్తున్న రైతులు.. ఓ నిర్ణయం తీసుకున్నారట.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే.. ఈ కార్మికుల ఆందోళనకు తాము మద్దతు ఇస్తామని చెబుతున్నారు అమరావతి ఆందోళనకారులు. అంతేకాదు.. విడతల వారీగా విశాఖకు వెళ్లి సంఘీభావం ప్రకటించి వస్తున్నారు.
Also Read: నాడు ఎన్టీఆర్.. నేడు విష్ణువర్ధన్ రెడ్డి..
కాగా.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అమరావతి ప్రాంతంలోనూ వైసీపీకి ఎక్కువ స్థానాలు రావడంతో తమ ఆందోళనకు మద్దతు మరింతగా పడిపోతుందా? అనే సందేహం వారిలో మొదలైంది. అందుకే.. విశాఖ కార్మిక పోరాటానికి సపోర్టు ఇవ్వడం ద్వారా.. పరోక్షంగా వారి మద్దతు కోరుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విధంగానైనా రాష్ట్రంలోని ఇతర వర్గాల మద్దతు సాధించాలని ప్రయత్నిస్తున్నారు. మరి, ఆశించిన ఫలితం ఏ మేరకు వస్తుందో చూడాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్