Homeఆంధ్రప్రదేశ్‌Professor Nageshwar: పొత్తులకు సైద్ధాంతికతతో పనిలేదు.. రాజకీయ వ్యూహల్లో భాగమేనంటున్న ప్రొఫెసర్ నాగేశ్వర్

Professor Nageshwar: పొత్తులకు సైద్ధాంతికతతో పనిలేదు.. రాజకీయ వ్యూహల్లో భాగమేనంటున్న ప్రొఫెసర్ నాగేశ్వర్

Professor Nageshwar: ఏపీలో పొత్తు రాజకీయాలపై సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తు సంకేతాలు వెలువడిన నేపథ్యంలో అధికార పార్టీ ఆరోపణలు ముమ్మరం చేసింది. వారి పొత్తు అనైతికమని.. అసహజమని వైసీపీ మంత్రులు ఫైర్ అవుతున్నారు. మరో అడుగు ముందుకు వేసి పొత్తులు చిత్తవుతాయంటున్నారు. అయితే దీనిపై జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ధీటుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. రాజకీయాల్లో వ్యూహాలు, పొత్తులు సహజమని.. పౌరుషాలకు తావులేదని చెబుతున్నారు. ఎన్నికల నాటికి ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఆయా పార్టీలు ముందుకు సాగుతాయని భావిస్తున్నారు. ఎమెర్జన్సీ తరువాత ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు తమ సైద్దాంతిక విభేదాలను పక్కన పెట్టి ఒకే తాటిపైకి రావడాన్ని గుర్తుచేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు సైతం పవన్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. ప్రముఖ విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయితే పవన్ కళ్యాణ్ చెప్పిన మాట నూరు శాతం కరెక్ట్ అని భావిస్తున్నారు. ఎమర్జన్సీ నాటి నుంచి నేటి వరకూ సాగిన విరుద్ధ రాజకీయ పక్షాల కలయిక గురించి ప్రస్తావిస్తూ రాజకీయాలు, ఎన్నికల్లో సైద్ధాంతికతకు చోటు ఉండదని.. కేవలం రాజకీయ ధ్రుక్పధం మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అప్పటివరకూ బద్ధ వ్యతిరేకులుగా ఉన్న భారతీయ జన్ సంఘ్, సోషలిస్టులు కలిసి జనతా పార్టీగా ఆవిర్భవించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. వీపీ సింగ్ ప్రభుత్వానికి ఒక వైపు లెఫ్ట్, మరోవైపు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన ఉదాంతాన్ని మరచిపోకూడదన్నారు. 2004లో దేశ వ్యాప్తంగా లెఫ్ట్ పార్టీలకు 60కుపైగా లోక్ సభ సీట్లు వచ్చినా.. చివరకు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి కాంగ్రెస్ పార్టీ నేత్రుత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన విషయాన్ని ఉటంకించారు. ఆ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీచేసిన వామపక్షాలు.. కేరళకు వచ్చేసరికి మాత్రం అదే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోటీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణా పోరాటంలో సైద్ధాంతిక విభేదాలున్న ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఏ, సీపీఐ వంటి పార్టీలు, సంస్థలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి పోరాడాయన్న విషయాన్ని గుర్తుచేశారు. 2009 ఎన్నికల్లో తెలంగాణా వ్యతిరేక ముద్రను మూట గట్టుకున్న టీడీపీ, టీఆర్ఎస్, సమైక్యాంధ్ర స్టాంట్ ను తీసుకున్న సీపీఎం, తెలంగాణా స్టాండ్ తీసుకున్న సీపీఐ కలిసి మహా కూటమిగా పోరాడిన విషయాన్ని ప్రస్తావించారు. 2014 ఎన్నికల్లో అసలు పొత్తే లేకుండా తెలంగాణాలోని ఖమ్మం జిల్లాలో సీపీఎం మద్దతును వైసీపీ తీసుకోవడాన్ని మరిచిపోకూడదన్నారు. ఆ ఎన్నికల్లో ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేల గెలుపు వెనుక సీపీఎం ఉందన్న విషయాన్ని గ్రహించాలన్నారు. దశాబ్దాల కాలం ఒకే సైద్దాంతిక విధానాలతో నడిచిన బీజేపీ నుంచి శివసేన వేరుపడి ప్రస్తుతం కాంగ్రెస్ తో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన విషయాన్ని మరిచిపోకూడదన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పురుడుపోసుకున్న తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో అదే పార్టీతో కలిసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ విషయాల్లో పవన్ కళ్యాణ్ కామెంట్లు నూటికి నూరు పాళ్లు మద్దతిస్తానని కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలిపారు.

Professor Nageshwar
Professor Nageshwar

Also Read: Venkaiah Naidu: రాష్ట్రపతిగా వెంకయ్యకు పదోన్నతి సాధ్యమేనా?

వైసీపీది మైండ్ గేమ్

ఏపీ రాజకీయాల గురించి కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషించారు. టీడీపీ, జనసేన పొత్తు అనైతికమా? అసహజమా? అన్నది వైసీపీ లేవనెత్తడాన్ని తప్పుపట్టారు. అది వ్యూహంలో భాగమేనన్నారు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు వారిష్టమన్నారు. కానీ వారు కలవడం వైసీపీకి ఇష్టం లేదన్నారు. వారు కలిస్తే తమకు నష్టమని వైసీపీ నేతల్లో భయం ఉందన్నారు. అందుకే వారు కలవకుండా చేయడంలో భాగంగా వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుందన్నారు. ఒంటరిగా వస్తావా, దమ్ము లేదా అంటూ సవాల్ విసరడం వెనుక వైసీపీ నేతల వ్యూహం దాగి ఉందన్నారు. ఎలాగైనా ఆ రెండు పార్టీలను కలవకుండా చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు ఉందన్నారు. టీడీపీ, జపసేనలతో బీజేపీ కలుస్తాందా లేదా అన్నది ఎన్నికల వ్యూహంలో తేలిపోతుందన్నారు. పవన్ కళ్యాణ్ అద్భుతం మాట వెనుక కూడా వ్యూహం దాగి ఉందన్నారు. పొత్తు ఉండాలా? ఉండక పోవడం వెనుక రాజకీయ ద్రుక్ఫధం, వ్యూహాలు తప్పించి సైద్ధాంతికతకు చోటులేదని ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Also Read: Minister Venugopalakrishna: మంత్రి వేణుగోపాలక్రిష్ణకు శెట్టిబలిజ వర్గీయుల సెగ

Recommended Videos:

Pawan Kalyan Key Comments on Political Alliance || Janasena TDP Alliance || AP Politics

TDP Leader Ayyanna Patrudu Satirical Comments on CM Jagan || AP Panchayathi Funds || Ok Telugu

పవన్ పవర్ పంచ్ లు.. || Pawan Kalyan Powerful Words || Janasena vs YCP || Ok Telugu

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version