
Traffic Police Challans : అది హైదరాబాద్ లోని ఒక కాలనీ గల్లీ.. మెయిన్ రోడ్ కు చాలా దూరం. ఈ కాలనీలో ఎవరు ఉంటారని హెల్మెట్ తీసి స్వేచ్ఛగా ఒక కోడిగుడ్ల వ్యాపారి వెళుతున్నాడు. ఇంటకెళ్లాక ‘ట్రింగ్ ట్రింగ్’ అని ఒక మెసేజ్ వచ్చింది. చూస్తే ఆ గల్లీలో హెల్మెట్ లేదని చలాన్ వేశారు. అది చూసి అతడు భోరుమన్నాడు.అదేమీ హైదరాబాద్ మెయిన్ రోడ్డు కాదు. చిన్న గల్లీ.. పోలీసులు రోడ్డు మీద లేరు మరి ఈ చలాన్ ఎలా వచ్చిందని మీరు ఆశ్చర్యపోకండి.. ట్రాఫిక్ పోలీసులు సందుబొందుల్లో దాక్కుంటున్నారు. పేదలు, సామాన్యులు, ఉద్యోగులు రోడ్డుపై ఏమాత్రం తేడాగా నడిపిని ర్యాష్ డ్రైవింగ్ అని.. హెల్మెట్ సరిగా పెట్టుకోలేదని సవాలక్ష కారణాలతో చలాన్లు వేస్తున్నారు. రోజుకు ఐదారువందలు సంపాదించే పేదలు రోజు కూలీ మొత్తం చలాన్లకే పోతుండడంతో లబోదిబోమంటున్నారు.
ఇప్పుడు ఈ మేజర్ సమస్య కేవలం హైదరాబాద్ సందుబొందుల్లోనే కాదు.. తెలంగాణలోని ప్రతి నగరం, పట్టణం.. ఆఖరుకు మండలాలు, గ్రామాల్లో కూడా ఉంది. పోలీసులు సందుల్లో చెట్ల బొందుల్లో రహస్యంగా దాక్కొని కనపడకుండా వచ్చిపోయే వారందరినీ ఫొటోలు తీయడమే పనిగా పెట్టుకున్నారు. డ్యూటీని వదిలి రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా నింపడమే పనిగా పెట్టుకుంటున్నారు.
ట్రాఫిక్ పోలీసులు చేయాల్సిన పనిని వదిలేసి చేయరాని పనులు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఈ కార్ రేస్ పేరిట ట్రాఫిక్ జాం అయితే పట్టించుకున్న పాపాన పోని ట్రాఫిక్ పోలీసులు అదే కాలనీల్లో సందుల్లో దూరి వచ్చిపోయే వారిని ఫొటోలు తీసి వారి ఇళ్లకు చాలన్లు పంపిస్తున్నారు.
ఒకటో రెండో సార్లు కాదు.. ఇలా రోజు వారీ బతుకుదెరువు కోసం తిరిగే వారి పొట్టకొడుతూ చలాన్ల మీద చలాన్లు వారి ఇళ్లకు పంపుతున్నారు. దీంతో హైదరాబాద్ లో రోడ్డెక్కాలంటేనే ప్రజలు భయపడుతున్న పరిస్థితి నెలకొంది.
ఇదే విషయంలో అసెంబ్లీ వేదికగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కడిగిపారేశాడు. చలాన్లు బడాబాబులు కార్లు నడిపేవారికి వేయండి.. చిన్న మోపెడ్ లు, ద్విచక్రవాహనదారులు, ఆటోల వాళ్లకు వేయకండి. వారి రోజువారీ సంపాదన అంతా చలాన్లకే పోతోంది. ఏ సందులో ఏ పోలీసు ఉంటాడో తెలియని పరిస్తితి హైదరాబాద్ లో నెలకొంది. ట్రాఫిక్ పోలీసులు తమ పని వదిలేసి కెమెరాలు పట్టుకొని ఫొటోలు కొట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ తెలంగాణ ప్రభుత్వం తీరుపై అసెంబ్లీ వేదికగా కడిగిపారేశాడు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను నిజాయితీగా ప్రస్తావించి ప్రభుత్వం కళ్లు తెరిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
అక్బరుద్దీన్ ఫిర్యాదులపై స్పందించిన హోంమంత్రి మహమూద్ అలీ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
