
చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అజిత్ ప్రమోద్ కుమార్ జోగి కన్నుమూశారు. గుండెపోటు రావడంతో జోగిని రాయ్‌పూర్ లోని ప్రైవేటు హాస్పిటల్ లో చేర్పించారు. మే 9వ తేదీన ఆయనకు తొలిసారి గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత అప్పటి నుంచి ఆయన హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్నారు. చికిత్స తీసుకుంటూ.. ఈ రోజు ఆయన తుది శ్వాస విడిచారు.
అజిత్ జోగి వయసు 74 ఏళ్లు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు కలెక్టర్ గా కూడా పనిచేశారు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. భోపాల్ లోని మౌలానా ఆజాద్ టెక్నాలజీ కాలేజీలో జోగి మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. 1968లో ఆయన యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించారు. రాయ్‌పూర్ లోని నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కొన్నాళ్ల పాటు లెక్చరర్‌గా పనిచేశారు. ఐపీఎస్, ఐఏఎస్ గా కూడా ఈయన సెలక్ట్ అయ్యారు. భోపాల్ కలెక్టర్‌గా 1981 నుంచి 1985 వరకు పనిచేశారు.
2000 నవంబర్ లో చత్తీస్ ఘడ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు మూడేళ్లు 2003 నవంబర్ వరకు సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. 2016లో కాంగ్రెస్ పార్టీ నుంచి అజిత్ జోగి విడిపోయారు. ఓ ఉప ఎన్నిక విషయంలో ఆ పార్టీకి ఆయన గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. కాంగ్రెస్ ను వీడిన తర్వాత ఆయన జనతా కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.