
ఆంధప్రదేశ్లోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో శుక్రవారం పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకుండా ఈ మూడు జిల్లాలు పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. అందుచేత ఈ మూడు జిల్లాలు చెందిన రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు ఇంటికే పరిమితం కావాలని సూచించింది. ఎవరూ కూడా బహిరంగ ప్రదేశాల్లో తిరిగొద్దని, చెట్టల కింద ఉండొద్దని సూచించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కూడా సూచించింది. అత్యవసరం ఉండి బయటికి వెళ్లేవారు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహాణ శాఖ పేర్కొంది.
పిడుగుపాటుకు అవకాశం ఉన్న ప్రాంతాలు..
శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట, కొత్తూరు, పాలకొండ, బుర్జ, రేగిడి ఆమదాలవలస, సరుబుజ్జిలి, లక్ష్మీనర్సుపేట, హీరామండలం, వంగర, వీరఘట్టం ప్రాంతాలు పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలోని కురుపాం, గరుగుబిల్లి, బలిజిపేట, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, పాచిపెంట, వేపాడ, సీతానగరం, విశాఖపట్నం జిల్లాలోని హుకుంపేట,అనంతగిరి, అరకులోయ ప్రాంతాలు పిడుగుపాటు గురయ్యే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహాణ శాఖ ప్రకటించింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.