Homeజాతీయ వార్తలువెస్ట్‌ బెంగాల్‌లోకి ఎంఐఎం ఎంట్రీ

వెస్ట్‌ బెంగాల్‌లోకి ఎంఐఎం ఎంట్రీ

asaduddin owaisi
ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. పదేళ్ల మత పాలనకు ప్రజలు చరమగీతం పాడతారా, లేక మళ్లీ మమతకే పట్టం కడతారా అన్న చర్చ ఒకవైపు జరుగుతోంది. నాలుగేళ్లలో వెస్ట్ బెంగాల్‌లో భారీగా పుంజుకున్న బీజేపీ మమతకు చెక్ పెట్టగలుగుతుందా, లేక మైనారిటీల అండతో మళ్లీ మమత అధికారం చేపడుతుందా అన్న చర్చ కొనసాగుతోంది. అయితే.. ఈ మొత్తం రాజకీయ సమీకరణాలను ఎంఐఎం మార్చి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీహార్, హైదరాబాద్ ఎన్నికలలో సాధించిన విజయాల ఊపుతో ఉన్న ఎంఐఎం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

Also Read: మాయమాటలు చెప్పి 72 వృద్ధురాలిపై అత్యాచారం

2011లో కమ్యూనిస్టుల దశాబ్దాల కంచు కోటని బద్దలుకొట్టి మమతా బెనర్జీ అధికారాన్ని స్థాపించింది. దాదాపు దశాబ్ద కాలంగా పశ్చిమబెంగాల్లో అప్రతిహతంగా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. అంతేకాకుండా తాను పార్టీ పెట్టే నాటికి ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు మమతా బెనర్జీ పాలనలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. అవి ఎంతగా నిర్వీర్యమై పోయాయంటే ,రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన సందర్భాలలో కూడా మమత విజయాన్ని నిలువరించలేక పోయేంతగా బలహీనం అయిపోయాయి. మరో మూడు నెలల్లో జరగనున్న ఎన్నికలలో, మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ నుండి గట్టిపోటీని ఎదుర్కొంటోంది. అయితే 2011 మమతా బెనర్జీ కమ్యూనిస్టులను భూస్థాపితం చేయడంలో కీలక పాత్ర పోషించిన ముస్లింలు ఇప్పటికీ మమతా బెనర్జీ వెన్నంటి ఉండటం మమతాకి అనుకూలాంశం.

పదేళ్ల పాలన కారణంగా నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత మమతా బెనర్జీకి ప్రతికూల అంశం. ప్రస్తుత పరిస్థితుల్లో మైనార్టీలు తనతో ఉన్నారన్న భరోసాను మినహాయిస్తే మిగతా అనేక విషయాల్లో మమతా బెనర్జీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. కమ్యూనిస్టుల కంచుకోట అయిన పశ్చిమబెంగాల్లో బీజేపీకి అవకాశాలు ఉంటాయన్న ఊహ కూడా పదేళ్లక్రితం అసాధ్యం. కానీ గత నాలుగేళ్లలో పరిస్థితులు మారాయి. 2016 అసెంబ్లీ ఎన్నికలలో 10 శాతం ఓట్లు సాధించిన బీజేపీ, 2019 ఎన్నికల నాటికి 40% ఓట్లతో 18 లోక్ సభ స్థానాలు సాధించడం మమతా బెనర్జీని కలవరపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అదే స్థాయిలో బీజేపీ గనక ఓట్ల శాతం సాధిస్తే, మమతా బెనర్జీ అవకాశాలకు భారీగా గండి పడే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో దాదాపు పది మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారంలో ఉన్న తమ పార్టీని కాదని బీజేపీ లోకి చేరడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Also Read: ఆలూ లేదు చూలూ లేదు.. అప్పుడే మంత్రి పదవులు పంచుకుంటున్నారు

అయితే బీజేపీకి సైతం అనేక ప్రతికూల అంశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి లోక్ సభ ఎన్నికల్లో పడ్డ ఓట్ల శాతం అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి పడడం అనుమానమే. దానికి తోడు, సీఏఏ ఎన్ఆర్సీ వంటి అంశాలు ఈశాన్య రాష్ట్రాలతోపాటు, పశ్చిమ బెంగాల్‌లో కూడా ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి.‌ ఈ నేపథ్యంలో దాదాపు వంద అసెంబ్లీ స్థానాలలో 30 శాతానికి పైగా ఉన్న ముస్లింలు ఏకపక్షంగా మమతా బెనర్జీ వైపు నడిస్తే ఆ వంద స్థానాలు బీజేపీ చేతి నుండి జారి పోయినట్టే. అంతేకాకుండా ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా రైతు వర్గాల నుండి బీజేపీపై పెల్లుబికిన వ్యతిరేకత కూడా బీజేపీ కి ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. అనూహ్యంగా ఎంఐఎం పార్టీ పశ్చిమబెంగాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకోవడం మమతా బెనర్జీని కలవరపెడుతోంది. ఆ మధ్య బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఐదు అసెంబ్లీ స్థానాలు అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం గెలుచుకోవడం సంచలనం సృష్టించింది. ఆ 5 స్థానాలతో ఓవైసీకి ఒరిగేదేమీ లేకపోయినప్పటికీ, మిగిలిన అనేక స్థానాలలో ఆర్జేడీ అవకాశాలను ఎంఐఎం భారీగా గండి కొట్టినట్లు బీహార్‌‌లో ప్రచారం జరిగింది. ఇటీవలి హైదరాబాద్ ఎన్నికలలో కూడా ఎంఐఎం సత్తా చాటింది. ఇలా విజయాల ఊపుతో ఉన్న ఎంఐఎం పశ్చిమబెంగాల్లో కూడా ముస్లింలు గణనీయంగా ఉన్న ఆ 100 స్థానాల్లో ప్రభావం చూపిస్తే, మమతా బెనర్జీకి ఆర్జేడీకి ఎదురైన అనుభవమే ఎదురైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. పైగా ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ ప్రయోగం చేస్తున్న ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ వంటి ఇతర మైనారిటీల పార్టీలతో ఎంఐఎం జతకట్టడం చూస్తే, మైనారిటీల ఓట్లను తమవైపు తిప్పుకోవడం లో ఎంఐఎం చేరబోయే కూటమి సఫలీకృతం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular