E.D Raids- Telangana: ఏమోయ్ మోదీ.. నువ్వు మా తెలంగాణకు ఏమిచ్చావ్. నీవల్ల దేశం అన్ని రంగాల్లో భ్రష్టు పట్టిపోతుంది. నీకు పాలించడం చేతకాదు. అంటూ గత కొద్ది రోజులుగా కేసీఆర్ గుడ్లు ఉరుముతున్నాడు. టిఆర్ఎస్ ను కాస్తా జాతీయ పార్టీ చేసే పనిలో పడ్డాడు.. అంతేకాదు అప్పట్లో మోడీ రాజకీయ గురువు శంకర్ సింగ్ వాగేలాను కూడా తన వద్దకు రప్పించుకున్నాడు. ఏదేదో మాట్లాడాడు. అంతకుముందు మూడుసార్లు మోడీ హైదరాబాద్ వస్తే పట్టించుకోలేదు. పైగా తన దారిన తను వెళ్ళాడు.. దీనికి తోడు సొంత మీడియాలో మోడీపై యుద్ధం ప్రకటించాడు. అచ్చం ఇది చదువుతుంటే 2018లో చంద్రబాబు చేసిన విన్యాసమే గుర్తొస్తోంది కదూ. అవును ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతోంది.

ఐటీ దూకుడు
గత కొద్ది రోజులుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలంగాణలో దూకుడు పెంచారు. టిఆర్ఎస్ ఆర్ధిక మూలాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ఇటీవల కెసిఆర్ తన జాతీయ పార్టీ అయిన భారత రాష్ట్రీయ సమితికి ఒక ప్రత్యేక విమానం కొనుగోలు చేశాడు. దీనికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జిల్లాకు చెందిన టిఆర్ఎస్ కీలక నాయకులు ఆర్థిక సహాయం చేశారని వినికిడి. క్రమంలో విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు రంగంలోకి దిగారు. వెంటనే దాడులు ప్రారంభించారు. అయితే ఇందులో ఆదాయానికి సంబంధించి సరైన వివరాలు సమర్పించలేదని, అందుకే తనిఖీ నిర్వహిస్తున్నామని ఆదాయపు పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు.
మై హోమ్ దూరంతో వీరితో పెరిగిన మైత్రి
ముచింతల్ సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే విగ్రహ ఆవిష్కరణ శిలాఫలకం మీద కెసిఆర్ పేరు లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఈగో హర్ట్ అయ్యి మై హోమ్ జూపల్లి రామేశ్వర రావును, చిన జీయర్ స్వామిని దూరం పెట్టారు. అంతకుముందే కేంద్ర ప్రభుత్వ పెద్దలు మెయిల్ కంపెనీని మచ్చిక చేసుకున్నారు. దీనివల్ల టిఆర్ఎస్ ఆర్థిక మూలలు ఒక్కసారిగా దెబ్బతిన్నాయి. దీంతో కెసిఆర్ మరో ఆలోచన లేకుండా ఉత్తర తెలంగాణకు చెందిన ఓ గ్రానైట్ వ్యాపారికి రాజ్యసభ సీటు ఇచ్చాడు. దీనికి తోడు అతడికి సమీప బంధువు, రాష్ట్ర మంత్రి అయిన ఓ గ్రానైట్ వ్యాపారి కూడా కెసిఆర్ కనుసన్నల్లోకి వెళ్ళాడు.

ఇక అప్పటినుంచి వారి మైత్రి బాగా పెరిగిపోయింది. ఇదే సమయంలో భారత రాష్ట్రీయ సమితికి ప్రత్యేక విమానం కొనుగోలు చేసేందుకు ఈ ఇద్దరు నేతలు భారీగా విరాళాలు ఇచ్చినట్టు సమాచారం. అయితే అంతకుముందే ఈ ఇద్దరు నేతలు నిర్వహిస్తున్న గ్రానైట్ కంపెనీలు అవకతవకలకు పాల్పడ్డాయని జాతీయ దర్యాప్తు సంస్థలకు ఉప్పందింది. దీనికి తోడు కేసీఆర్ మోడీకి వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తుండడంతో వెంటనే అవి రంగంలోకి దిగాయి. నిన్న ఏకకాలంలో కరీంనగర్ శ్వేతా గ్రానైట్స్ కంపెనీ, వ్యాస్ అనే వ్యాపారి ఇంట్లో, ఖమ్మం లోని కొన్ని ఆసుపత్రులు, గ్రానైట్ కంపెనీల మీద దాడులు నిర్వహించాయి. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈరోజు కూడా పలుచోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ తనిఖీల్లో ఏ ఏ ఆధారాలు లభ్యం అయ్యాయో అధికారులు చెప్పడం లేదు. అయితే ఈ దాడులను టిఆర్ఎస్ నాయకులు ఖండిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీని భయభ్రాంతులకు గురి చేసేందుకే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలని ఉసిగొల్పుతోందని ధ్వజమెత్తుతున్నారు. అయితే నిన్న ఖమ్మంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహిస్తుండగా, ఆసుపత్రి నిర్వహకులు వెనుక నుంచి పారిపోయారని సమాచారం. ఇక ఇదే దశలో టిఆర్ఎస్ లోని మంత్రి నిర్వహిస్తున్న ఆసుపత్రి పై కూడా దాడులు నిర్వహించేందుకు ఆదాయక పన్ను శాఖ అధికారులు సమాయత్తం అవుతున్నారని తెలుస్తోంది.