AP Politics : నాయకులు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు? పదవుల కోసమే కదా? ఆ పదవుల కోసం ఏమైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు. ఆ పదవులు దక్కే సమయంలో సొంత కుటుంబ సభ్యులు అడ్డువచ్చినప్పటికీ లెక్కచేయరు. లెక్కపెట్టరు. గతంలో ఇలాంటి తరహా సంఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా ఏపీలో ఇటువంటి సంఘటనే కుటుంబానికి ఎదురైంది. మరి ఈ ఎన్నికల్లో ఆ కుటుంబం లో ఆ బాబాయ్, అబ్బాయ్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఏపీలో మిగతా జిల్లాల్లోని ప్రాంతాలు ఒకెత్తు. కడప జిల్లా జమ్మలమడుగు మరొకెత్తు. అందుకే ఈ ప్రాంతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏదో ఒక సంచలనం నమోదవుతూనే ఉంటుంది. ఈసారి కూడా అలాంటిదే జరుగుతుందేమోనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నోటిఫికేషన్ విడుదల కాకపోయినప్పటికీ జమ్మలమడుగులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి టిడిపి ఇన్చార్జిగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుడి కుమారుడు భూపేష్ రెడ్డి కొనసాగుతున్నారు. టికెట్ తనకే వస్తుందని ఆశతో ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆయన కోట్ల రూపాయలు వెచ్చించి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి జాబితాలో భూపేష్ రెడ్డి పేరు లేదు. దీంతో ఆయన అనుచరులు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. అయితే బిజెపితో పొత్తు కుదరడంతో జమ్మలమడుగు టికెట్ ఆదినారాయణ రెడ్డి కి వెళ్తుందని అంటున్నారు. తన టికెట్ కోసమైనా టిడిపి బిజెపితో పొత్తు పెట్టుకోవాలని ఆయన అంతర్గతంగా వ్యాఖ్యానిచ్చినట్టు సమాచారం. ఆయన వ్యాఖ్యలకు తగ్గట్టుగానే టిడిపి బిజెపితో పొత్తు పెట్టుకుంది.
పొత్తులో భాగంగా జమ్మలమడుగు టికెట్ తనకు కేటాయించాలని ఆదినారాయణ రెడ్డి కోరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆదినారాయణ రెడ్డికి టికెట్ ఇస్తే.. భూపేష్ రెడ్డి పరిస్థితి ఏమిటో అంతుపట్టకుండా ఉంది. టికెట్ కు సంబంధించి చర్చ వస్తే ఒకే కుటుంబం అయినందున.. టికెట్ ఎవరికి కావాలో తేల్చుకోవాలని చంద్రబాబు అంటారు. అప్పుడు ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటున్నారు. భార్యాభర్తలయినప్పటికీ వేరువేరు పార్టీల్లో కొనసాగుతున్నారు. అలాంటప్పుడు బాబాయ్ కోసం అబ్బాయి సీటు త్యాగం చేస్తాడా?. లేక అబ్బాయి కోసం బాబాయ్ సీటు వదులుకుంటాడా? అనేది తేలాల్సి ఉంది. భూపేష్ రెడ్డికి ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉంది కాబట్టి.. నచ్చజెప్పి ఈ ఎన్నికల్లో పోటీ నుంచి విరమింప చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దానికి భూపేష్ రెడ్డి ఒప్పుకుంటాడా? ఇన్ని సంవత్సరాలు పాటు కోట్లలో ఖర్చుపెడితే.. ఆ నష్టాన్ని ఎవరు పూడ్చుతారు? అని నిలదీస్తాడా.. ఒకవేళ అదే ప్రశ్న కనుక ఎదురైతే సమాధానం చెప్పేంత సాహసం టిడిపి అధిష్టానం చేయకపోవచ్చు. మొత్తానికి జమ్మలమడుగులో టిడిపి, బిజెపి పొత్తు వల్ల సొంత కుటుంబంలో కొంపటి రగిలిందనేది మాత్రం వాస్తవం.