Homeజాతీయ వార్తలుNamasthe Telangana Vs Andhra Jyothi: ఔటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్టు పై "నమస్తే" "టోల్"...

Namasthe Telangana Vs Andhra Jyothi: ఔటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్టు పై “నమస్తే” “టోల్” తీసేసిన “ఆంధ్రజ్యోతి”

Namasthe Telangana Vs Andhra Jyothi: హైదరాబాద్‌కు మణిహారమైన అవుటర్‌ రింగ్‌ రోడ్డును ప్రైవేటు సంస్థకు 30 ఏళ్లపాటు కట్టబెట్టడం రాష్ట్రానికి ఎంతో లాభదాయకమంటూ ‘నమస్తే తెలంగాణ’ పత్రిక రాసిన కథనంపై ఆంధ్రజ్యోతి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆ కథనాన్ని ఊహాజనితమని తేల్చి పారేసింది. అంతకు ముందు రోజే ఓఆర్‌ఆర్‌ లీజు వ్యవహారంపై ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. హైదరాబాద్ పరిధిలోని ఓఆర్‌ఆర్‌పై ఏటా భారీగా పెరుగుతున్న రద్దీని, తద్వారా పెరిగే టోల్‌ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రస్తుత పద్ధతిలోనే వచ్చే ముప్పై ఏళ్లకు రూ.17,000 కోట్ల ఆదాయం వస్తుందని ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది. అయితే దీనికి కౌంటర్ గా నమస్తే తెలంగాణ వార్త కథనాన్ని ప్రచురించింది. అయితే మొదట వార్తను ప్రచురించిన ఆంధ్రజ్యోతి పూర్తి గణాంకాలను వెలువరించగా.. నమస్తే తెలంగాణ ఆ పని చేయలేకపోయింది. పైగా సర్కార్ చేసే పని గొప్పదంటూ కీర్తించింది. మరి ఈ లెక్కన రోజూ ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని కార్పొరేట్ కంపెనీలకు అమ్ముతున్నాడని ప్రచారం చేసే కేసిఆర్, కేటీఆర్ అండ్ కో ఇప్పుడు ఈ కాంట్రాక్టు సంబంధించి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తూర్పార పట్టింది

” ఖజానాలో కాసులు లేక రాష్ట్ర ప్రభుత్వం గిలగిలా కొట్టుకుంటున్నది. కుయ్యో మొర్రో అంటున్నది. ఔటర్‌ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్‌)ను లీజుకివ్వడం ద్వారా సమకూరే రూ.7,380 కోట్లను బ్యాంకులో డిపాజిట్‌ చేస్తే వచ్చే లాభంపై లెక్కలు వేస్తోంది. ఇది వినడానికే చోద్యంగా ఉంది. డిపాజిట్‌పై 9 శాతం చొప్పున వచ్చే వడ్డీని కలుపుకుంటే.. ఓఆర్‌ఆర్‌ను లీజుకివ్వడం సరైన చర్యేనంటూ బాకా ఊదుతోంది.” అంటూ ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణను తూర్పార బట్టింది. రింగు రోడ్డు నిర్వహణ, టోల్‌ వసూలు బాధ్యతలను ముంబై సంస్థ ‘ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌ లిమిటెడ్‌’కు ప్రభుత్వం కట్టబెట్టిన విధానాన్ని పూర్తిగా తప్పు పట్టింది. ‘టోల్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌(టీఓటీ)’ పద్ధతిన 30 ఏళ్ల పాటు లీజుకిస్తూ ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ఒకేసారి రూ.7,380 కోట్లు వస్తాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే.. ఈ విధానం వల్ల ప్రభుత్వానికి రాబడి తగ్గుతుందని, ‘ఆస్తుల నగదీకరణ(అస్సెట్స్‌ మానిటైజేషన్‌)’ కింద 30ఏళ్ల పాటు లీజుకిస్తే తదుపరి వచ్చే ప్రభుత్వాలకు ఆదాయ వనరులు మిగలవని ఆంధ్రజ్యోతి సోదాహరణంగా వివరించింది.

కాకి లెక్కగా తేల్చి పారేసింది

“ప్రభుత్వం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయి ఉంది. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించలేని దుస్థితిని ఎదుర్కొంటోంది. అభివృద్ధి పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన దాదాపు రూ.15 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులను చెల్లించలేక ఎక్కడికక్కడ కుప్పకుప్పలుగా ఫైళ్లు పేరుకుపోయాయి. ప్రతినెలా సగటున రూ.4000 కోట్ల మేర అప్పు తీసుకుంటే తప్ప పూట గడవని పరిస్థితి నెలకొంది. దళితబంధుకు నిధులు సర్దలేక చతికిల పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓఆర్‌ఆర్‌ లీజు ద్వారా సమకూరే సొమ్ము రూ.7,380 కోట్ల ను బ్యాంకులో డిపాజిట్‌ చేస్తుందట. దీనిపై 9 శాతం చొప్పున వార్షిక వడ్డీతో ఏటా రూ.664 కోట్లు వస్తాయట.” అని నమస్తే తెలంగాణ రాసిన కథనాన్ని ఆంధ్రజ్యోతి కాకి లెక్కగా తేల్చిపడేసింది.

డిపాజిట్ చేస్తుంది అనే మాట కల్ల

“ప్రభుత్వం డిపాజిట్‌ చేస్తుందన్న మాట కల్ల. లీజు సొమ్మును నెలలో ఖర్చు చేసినా ఆశ్చర్యపోనక్కర లేదని నిపుణులు దెప్పిపొడుస్తున్నారు.” అని ఆంధ్రజ్యోతి సంచలన విషయాలను బయటపెట్టింది. “ఒకవేళ నమస్తే చెప్పినట్టు రూ.7,380 కోట్లను పరిగణనలోకి తీసుకుంటే ఏటా రూ.246 కోట్లు సమకూరినట్లవుతుందని, డిపాజిట్‌ చేస్తే వడ్డీ రూపంలో రూ.664 కోట్లు వస్తాయని చెబుతోంది. ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌ నిర్వహణ బాధ్యతలు హెచ్‌ఎండీఏ చూస్తోంది. లీజుకివ్వడం ద్వారా మరో రూ.150 కోట్ల నిర్వహణ ఖర్చు ఆదా అవుతుందని వివరిస్తోంది. ఇలా ఏటా ప్రభుత్వానికి రూ.1,060 కోట్ల ప్రయోజనం ఉంటుందని చెబుతోంది. డిపాజిట్‌ చేయడమనేది ఎట్టి పరిస్థితుల్లో జరగని పని. ఫలితంగా రూ.664 కోట్ల వడ్డీ సొమ్ము ఫట్‌. ఇక నిర్వహణ ఖర్చు కింద రూ.150 కోట్లు ఆదా అవుతాయని చెబుతున్నప్పటికీ.. హెచ్‌ఎండీఏ ఏటా రూ.100 కోట్లను మాత్రమే నిర్వహణ కోసం ఖర్చు చేస్తోంది. ఇక్కడ మరో రూ.50 కోట్లు పొల్లే. లీజు ద్వారా ఏటా సగటున రూ.246 కోట్లు వస్తున్నాయని చెబుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం ఏటా రూ.414 కోట్లు వస్తున్నాయి. ఇదే విషయాన్ని మేము స్పష్టంగా చెప్పామని” ఆంధ్రజ్యోతి వాదిస్తోంది.

నమస్తే ఎలా విస్మరించింది

“ప్రస్తుత ఔటర్ రింగ్ రోడ్డుపై=
.ఏటా పెరుగుతోన్న వాహనాలు, టోల్‌ చార్జీలను పరిగణనలోకి తీసుకుంటే రూ.414 కోట్లపై 5% చొప్పున రాబడి పెరుగుతుంది. ఈ ప్రకారం చూసుకుంటే రూ.540 కోట్లు వస్తాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇలా ఏ లెక్కన చూసినా.. సర్కారు రాబడికి గండి పడుతోంది. మరి దీనిపై ప్రభుత్వానికి కలుగుతున్న ప్రయోజనం ఏమిటో నమస్తే తెలంగాణకే తెలియాలి” అంటూ ఆంధ్రజ్యోతి కీ పాయింట్ లాగే ప్రయత్నం చేసింది.

జిల్లా పేజీలో ఎందుకు వేసినట్టు?

“ఓఆర్‌ఆర్‌ లీజు గురించి దేశంలోకెల్లా గొప్ప టీవోటీ డీల్‌ కుదుర్చుకున్నామని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఘనంగా ప్రకటించుకున్నారు. ఇది హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల పెట్టుబడుల్లో ప్రైవేటు రంగంలో భారీ పెట్టుబడులకు ఊతం ఇస్తుందని చెప్పుకున్నారు. ఇది రాష్ట్రమంతా తెలియాల్సిన వార్త. అంత ముఖ్యమైన వార్తను బీఆర్‌ఎస్‌ అధికార పత్రిక అత్యంత హీనమైన ప్రాధాన్యం ఇచ్చింది. అసలు మెయిన్‌ పేజీల్లో ప్రచురించనేలేదు. అసలు పెట్టలేదని అనుకోకుండా హైదరాబాద్‌ జిల్లా పత్రికలో లోపలి పేజీల్లో వేసింది. అంటే, రాజధాని దాటి పక్క జిల్లా వాడికి కూడా ఆ వార్త చేరదన్నమాట.” అని నమస్తే తెలంగాణ గాలి తీసేసింది.

ఊహాజనితాన్ని అందంగా అల్లింది

“ఒకేసారి వచ్చి పడిన రూ.7,380 కోట్లతో ఏదైనా అభివృద్ధి పనిని చేపట్టవచ్చని చెబుతోంది. ఒకవేళ ఆ పని ఏడాది ఆలస్యమైతే… దీనిపై 20 శాతం చొప్పున ఎస్కలేషన్‌ చార్జీల కింద రూ.1,476 కోట్లను అదనంగా చెల్లించాల్సి వస్తుందని, పదేళ్లకైతే… రూ.14 వేల కోట్లు అదనంగా పెరుగుతాయని అంటోంది. చెల్లించాల్సిన అంచనా సొమ్ము రూ.22 వేల కోట్లకు చేరుకుంటుందని చెబుతోంది. నిజానికి రూ.7,380 కోట్లను ఒకే ఒక అభివృద్ధి పనికి ఖర్చు చేస్తుందన్నది నమ్మలేం. ఇప్పటికే మూలధన వ్యయ లక్ష్యాన్ని చేరుకోలేక ప్రభుత్వం మూలుగుతోంది. ఈ మార్చి 31తో ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.29,728 కోట్లను వ్యయం చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించి రూ.15,404 కోట్లే. అంటే 51 శాతమే. సాగునీటి శాఖలోనే రూ.7 వేల కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. ఖరీఫ్‌లో రైతుబంధు నిధులను సర్దుబాటు చేయాలి. దళితబంధు ఇవ్వడం లేదన్న విమర్శలు వెలువడుతున్నాయి. ఓట్ల కోసం ఈ మొత్తాన్ని పప్పు బెల్లాల్లా పంచి పెట్టే అవకాశాలను తోసిపుచ్చలేం. నమస్తే మాత్రం అభివృద్ధి పనులకు మాత్రమే వినియోగిస్తారని రూ.22 వేల కోట్లు మిగులుతున్నాయని ‘ఫిక్షన్‌’ను పర్‌ఫెక్ట్‌గా అల్లింది.” అని ఆంధ్రజ్యోతి నిర్మహమాటంగా రాసుకొచ్చింది. వాస్తవానికి ఈ విషయంలో నమస్తే కౌంటర్ ఊహాజనితంగా ఉంది.

వాచ్ డాగ్ పాత్ర

ఏ మాటకు ఆ మాట ఈమధ్య తెలంగాణలో ఆంధ్రజ్యోతి పత్రిక వాచ్ డాగ్ పాత్ర పోషిస్తోంది.. మిగతా పత్రికలు వెలికి తీయని కోణాన్ని అది బయటపెడుతోంది. దాని పచ్చ రంగు దానికి ఉండవచ్చు గాక.. కానీ ప్రజలకు ఏం జరుగుతుందో తెలియాలి.. అలాంటి బాధ్యతను మిగతా పత్రికలు పక్కన పెట్టిన వేళ.. ఆ బాధ్యతను ఆంధ్రజ్యోతి భుజస్కందాలపై వేసుకోవడం నిజంగా అభినందనీయం.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular