AP Poverty: ఏపీలో సంక్షేమ పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రజలకు ఉచిత పథకాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ ఇవేవీ పట్టించుకోని జగన్ సర్కార్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ వస్తుంది. రాష్ట్రంలో ప్రజల ఆర్థిక జీవన ప్రమాణాలు పెంపొందితే.. తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని.. ఆర్థిక అసమానతలు తొలగుతాయని జగన్ సర్కార్ చెబుతోంది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో చెప్పలేము కానీ… సంక్షేమ పథకాల పుణ్యమా అని ఏపీలో పేదరికం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా నీతి ఆయోగ్ నివేదికలో సైతం ఇదే స్పష్టం కావడం విశేషం.
గత ఎన్నికల ముందు వైసీపీ మేనిఫెస్టో ప్రకటించింది.నవరత్నాలను అమలు చేయనున్నట్లు చెప్పుకొచ్చింది. అందుకు తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చిన మూడో నెల నుంచి సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల వారికి పథకాలను అందిస్తోంది. వైఎస్ఆర్ రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, పింఛన్ల పెంపు, పేదలందరికీ ఇళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆసరా, చేయూత వంటి పథకాలు కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. సీఎం జగన్ నేరుగా బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తున్నారు. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి నగదు జమ చేస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా చేపడుతున్న ఈ సంక్షేమ పథకాలు పేదలను ఆర్థికంగా నిలబెడుతున్నాయి.
ఏపీలో పేదరికం తగ్గిందని నీతి ఆయోగ్ స్పష్టం చేయడం విశేషం. 2016 లో ఏపీలో పేదరికం రేటు 11.7% ఉండగా.. 2021 నాటికి 6.06 శాతానికి తగ్గినట్లు నీతి ఆయో గణాంకాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 2016 నాటికి 14.72 శాతంగా ఉన్న పేదరికం రేటు.. 2021 నాటికి 7.71 శాతానికి తగ్గుముఖం పట్టడం విశేషం. అటు పట్టణ పేదరికం సైతం చాలా వరకు తగ్గుముఖం పట్టినట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ వెల్లడించింది. ఉచిత విద్య,వైద్యం, రైతులకు భరోసా, పిల్లలకు పౌష్టికాహారం, గర్భిణులకు ఇచ్చే ప్రత్యేక ఆహారం వంటివి ప్రజలకు ఎంతో మేలు చేసినట్లు తెలుస్తోంది. ఇక సామాజిక పింఛన్లు, ఉచిత ఆరోగ్య సేవలు వంటివి పేదరికం నిర్మూలనకు దోహదపడ్డాయని నీతి అయోగ్ స్పష్టం చేసింది. ఈ విషయంలో జగన్ సర్కార్ వైఖరి అందరి మన్ననలు అందుకోవడం విశేషం.