KCR And Revanth Reddy: ఒడ్డున ఉన్నవాడు నీతులు చెప్తాడు. నీట మునుగుతున్న వాడు వాటిని వింటాడు అని ఒక సామెత ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఎన్నికల్లో ఓటమి వల్ల ఇబ్బంది పడే రాజకీయ నాయకులకు తెలుగు నాట కొంతమంది మీడియా అధిపతులు ఇప్పుడు పై సామెత తీరుగా నీతులు చెబుతున్నారు. అయితే అలా ఓడిపోయిన రాజకీయ నాయకులకు చాణక్యం లేక కాదు. నేర్పరితనం లేక అంతకన్నా కాదు. కాకపోతే టైం బ్యాడ్ అంతే. ఈ టైం బ్యాడ్ నే మరింత నొక్కి నొక్కి చూపుతుంటారు మీడియాలో పనిచేసే వ్యక్తులు. అఫ్ కోర్స్ వాటి మేనేజ్మెంట్ స్టైల్ అలాంటిది కాబట్టి. తెలుగు నాట అట్లాంటి విషయాలను గెలికి మరీ వాసన చూసే రకం ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ. మొదట్లో ఈయనకు, కెసిఆర్ కు టర్మ్స్ బాగానే ఉన్నాయి. పైగా ఏరా, ఏరా అని పిలుచుకునే సాన్నిహిత్యం ఇద్దరి మధ్య ఉండేది. కానీ ఎక్కడ తేడా కొట్టిందో.. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. గత ఐదు సంవత్సరాలు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఫలితంగా కెసిఆర్ రాధాకృష్ణ పత్రికకు యాడ్స్ ఇవ్వడం మానేశాడు కేసీఆర్. ఫలితంగా ఆంధ్రజ్యోతి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. పైగా భారత రాష్ట్ర సమితి కి సంబంధించిన కార్యక్రమాలకు ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై కేసీఆర్ నిషేధం విధించారు. సో మొత్తానికి రాధాకృష్ణకు అధికారంలో ఉన్నప్పుడు అడుగడుగునా చుక్కలు చూపించారు. అంతకుముందు రాధాకృష్ణ ఆఫీస్ కాలిపోతే కేసీఆర్ పరామర్శించారు అది వేరే విషయం.
ఇక ఇప్పుడు ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయాడు కాబట్టి.. తనకు ఎంతో ఇష్టమైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి.. రాధాకృష్ణ ఇప్పుడు ఫుల్ హ్యాపీ. అందులో భాగంగానే రేవంత్ రెడ్డితో నిన్న ఇంటర్వ్యూ కూడా చేశాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత.. అంత బిజీగా ఉండి కూడా.. రేవంత్ రెడ్డి రాధాకృష్ణకు ఇంటర్వ్యూ ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏమిటో ఇట్టే తెలిసిపోయింది. సరే ఆ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పరిస్థితి తెలంగాణలో ఎలా ఉంది? పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలా ఉండబోతోంది? కేటీఆర్ బిజెపితో దోస్తీ పెట్టుకోవాలని భావిస్తున్నారా? కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తారని ఆయన భావిస్తున్నారా? గతంలో బిజెపికి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాలకు వెళ్తున్నానని కేసీఆర్ అన్న మాటల సంగతేమిటి? భారత రాష్ట్ర సమితిగా మార్పు చేస్తున్నప్పుడు కేసీఆర్ ను హరీష్ రావు, కేటీఆర్ ఎందుకు వారించలేకపోయారు? కెసిఆర్ చూడలేని పదవులు లేవు కాబట్టి.. ఇప్పుడు పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కేటీఆర్ పై ఎంత ఉంది? ఇలాంటి ప్రశ్నలను సంధించుకుంటూ.. వాటికి సమాధానం చెప్పుకుంటూ ఆంధ్రజ్యోతి ఎండి వేముల రాధాకృష్ణ ఈవారం కొత్త పలుకు రాశారు. సహజంగానే ఎత్తిపొడుపు రాతలు రాసే రాధాకృష్ణ.. ఈ వారం మరింత రెచ్చిపోయారు. ఎలాగూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి.. ఇక ఇప్పట్లో తన పత్రికకు ఇబ్బంది ఉండదు అనుకున్నారేమో.. కెసిఆర్ మీద స్వేచ్ఛగా రాసుకుంటూ పోయారు.. కానీ ఇక్కడే రాధాకృష్ణ మరిచిపోయిన సంగతి ఒకటి ఉంది.
2019 ఎన్నికల్లో టిడిపికి ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత తక్కువ సీట్లు వచ్చాయి. దాదాపు 23 సీట్లకే ఆ పార్టీ పరిమితం అయిపోయింది. అంటే ఒక రకంగా జనాలు ఏకపక్షంగా వైసిపికి ఓటు వేసినట్టు లెక్క. మరి అలాంటప్పుడు ఆ పార్టీ బతికి బట్ట కట్ట లేదా. ఇప్పుడు ఏపీలో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడం లేదా.. అంతేకాదు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మోడీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి.. ఇష్టానుసారంగా మాట్లాడి.. తర్వాత మోడీ పంచన చేరడానికి సిద్ధపడలేదా. అంటే అది వేమూరి రాధాకృష్ణకు తప్పుగా అనిపించలేదా.. స్థూలంగా రాజకీయాల్లో పరస్పర ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. శత్రుత్వాలు అస్సలు ఉండవు. అక్కడిదాకా ఎందుకు జైల్లో కేసీఆర్ పెట్టిస్తే.. ఆయన అనారోగ్యానికి గురైతే.. రేవంత్ రెడ్డి నేరుగా యశోద ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. సరే దీని వెనక ఎన్ని రాజకీయ కోణాలు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి కేసీఆర్ ను కలవడం మాత్రం ఒక సంచలనం. ఇక ప్రస్తుతం తెలంగాణ విషయానికొస్తే భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వనుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఊహగానమా.. లేకుంటే ఎవరైనా కావాలనే వ్యాప్తి చేస్తున్నారా.. అనేవి పక్కన పెడితే ఇదే విషయాలను ప్రముఖంగా వేమూరి రాధాకృష్ణ ప్రస్తావించారు.. అయితే రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోకుండా ఉండకూడదని లేదు. పరస్పర విరుద్ధ భావజాలాలు ఉన్న పార్టీలు కలిసి పని చేయకుండా ఉండాలని కూడా లేదు. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు గతంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోలేదా. ఇప్పుడు స్నేహరాగం ఆలపిస్తుండడం లేదా.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి, బీఆర్ఎస్ దోస్తీని ఆ విధంగా ఎందుకు చూడకూడదు? సరే ఈ దోస్తీ తర్వాత భారత రాష్ట్ర సమితికి ఆత్మహత్యాసాదృశ్యం అవుతుందా? మరొకటి అవుతుందా పక్కన పెడితే.. దీనిని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం ఏముంది.. అంతేలే తనకు నచ్చితే నెత్తిన పెట్టుకుంటాడు. లేకుంటే అందులో తప్పులు వెతుకుతాడు.. రాధాకృష్ణ రాతల తీరు అంతే కదా..