ABN RK : కేసీఆర్ సర్కారు కేసులు ఎందుకు ఓడుతోందంటే: అసలు గుట్టు విప్పిన వేమూరి రాధాకృష్ణ

ఏ మాటకు ఆ మాట ఈరోజు కొత్త పలుకులో రాధాకృష్ణ చెలరేగిపోయారు. కెసిఆర్ తో నేరుగా వైరానికి సిద్ధం అనే సంకేతాలు ఇచ్చారు. నమస్తే తెలంగాణ ఏ విధమైన కౌంటర్ ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Written By: Rocky, Updated On : May 7, 2023 2:09 pm
Follow us on

ABN RK : “న్యాయస్థానాల్లో ఉన్న కేసుల్లో ప్రభుత్వ ఆస్తులు, భూముల విషయంలో ప్రైవేటు వ్యక్తులతో ఏర్పడిన వివాదాలకు సంబంధించినవే ప్రధానంగా ఉంటాయి. ఆ కేసుల్లో ప్రభుత్వానికి అనుకూల తీర్పులు వచ్చేలా చేయాలని అడ్వకేట్ జనరల్, అదనపు ఏజీని ఏ సీఎం అయినా కోరతాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. ఎనిమిది వేల కోట్ల విలువ చేసే భూ వివాదంలో ప్రభుత్వ వాదన వీగిపోయేలా చూడాల్సిందిగా కెసిఆర్ కోరుతున్నాడు.. ఇటు హైకోర్టులోనూ, అటు సుప్రీంకోర్టులోనూ వేల కోట్ల విలువచేసే భూముల వివాదాలు కొనసాగుతున్నాయి. భూముల విషయంలో ప్రభుత్వం తన హక్కులు కోల్పోవలసి వస్తే ప్రజల సంపద ప్రైవేట్ వ్యక్తుల పరమవుతుంది. న్యాయస్థానాల నుంచి అనుకూల ఉత్తర్వులు తెచ్చుకోండి. భూములు సొంతం చేసుకోండి అనే నినాదం ఇప్పుడు తెలంగాణలో హాల్ చల్ చేస్తోంది. తెలంగాణలో కొంతమంది అధికారులు కూడా నియమ నిబంధనలు గాలికి వదిలేసి ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేసేందుకే తాము ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారిలో అరవింద్ కుమార్, జయేష్ రంజన్ ముందు వరుసలో ఉన్నారు. పాలకులకు ఊడిగం చేయడంలో ఏమాత్రం సంకోచం లేకుండా వ్యవహరిస్తున్న అధికారులు ఈ 8 సంవత్సరాలుగా కీలక శాఖలోనే పాతుకపోయారు” ఇలా తన కొత్త పలుకులో ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ తూర్పారబట్టారు.
కీలక విషయాలు
 వాస్తవానికి ఈ వ్యాసంలో కెసిఆర్ ప్రభుత్వం ఎలాంటి ” భూ” మంతర్ చేస్తున్నాడో వివరాలతో సహా వివరించాడు. సాధారణంగా తన వ్యాసంలో చంద్రబాబు ప్రస్తావన లేకుంటే రాధాకృష్ణ చెలరేగిపోతాడు. “2014లో మొదటి దశ అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నిక్కచ్చిగా వ్యవహరించేవారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడే విధంగా గాని, భూముల వివాదాల్లో గాని ఎవరు జోక్యం చేసుకున్నప్పటికీ, చివరకు తన కుటుంబ సభ్యులు అడిగినప్పటికీ వహించవద్దని, పట్టించుకోవద్దని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఆయనే కేసులు ఓడిపోండి అని అంటుండడంతో ఎవరికివారు అందినంత దోపిడీకి పాల్పడుతున్నారు” అని రాధాకృష్ణ రాసుకొచ్చాడు. “ఢిల్లీలో చక్రం తిప్పాలని ఆలోచన వచ్చినప్పటి నుంచే కేసీఆర్ వ్యవహర శైలిలో మార్పు వచ్చిందని కొందరు అధికారులు చెబుతున్నారు. ప్రజల సంపదను ప్రైవేట్ వ్యక్తుల పరం చేయాలనే భావన ఇందులో భాగమని అంటున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఐదారేళ్లపాటు ప్రభుత్వ పేదల నుంచి పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఒత్తిళ్లు ఉండేవి కావు  కిందిస్థాయి అధికార పార్టీ నాయకులను కూడా వారి జోలికి పోకుండా కట్టడి చేశారు. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ ఇవ్వాలని పైనుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయి. ఇప్పటివరకు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ₹పది కోట్ల వరకు సహాయం చేసే కంపెనీలకు కూడా ఇప్పుడు టార్గెట్ విధిస్తున్నారు. ఈ హిట్ లిస్టులో ఫార్మా రంగం ముందుంది. ఫార్మా రంగం లో రెండు పెద్ద కంపెనీలను ₹200 కోట్ల రూపాయల వరకు బాండ్లు ఇవ్వాలని భారత రాష్ట్ర సమితి నాయకులు ఆదేశించారు. అందులో ఓ కంపెనీ ప్రభుత్వం నుంచి మేము ఏది ఆశించలేదు ఆయన అంత మొత్తం ఎందుకు ఇవ్వాలి? ఎలా ఇవ్వగలమని? ప్రశ్నించగా మీరు ఇక్కడే వ్యాపారం చేస్తున్నారుగా అని బదులిచ్చారట. మరో కంపెనీ వారు మాత్రం ప్రస్తుతానికి 100 కోట్ల మేరకు బాండ్లు ఇచ్చుకున్నారట” ఇలా చాలా విషయాలను రాధాకృష్ణ కుండబద్దలు కొట్టారు.
ఆస్తులు ప్రైవేటు పరం
“అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల వ్యవధి ఉంది. అప్పటివరకు ఎన్ని ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తారో చూద్దాం. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ వ్యవహారం ప్రభుత్వానికి చుట్టుకుంది. ఇందులో నుంచి కేసీఆర్ ఎలా బయటపడతారో చూడాలి. జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించిన ప్రాంతీయ పార్ట్నర్ నాయకుడు ఎవరు కూడా కెసిఆర్ మాదిరి డబ్బుతో చక్రం తిప్పలేదు. కెసిఆర్ మాత్రమే ఎంచుకున్న విధానం అని” కెసిఆర్ విధానాలను రాధాకృష్ణ తూర్పారబట్టారు. “తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడం కంటే ముందు నుంచి అధికారంలో ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలకు కూడా ఢిల్లీలో సొంత పార్టీ కార్యాలయాలు లేవు. దశాబ్దాలుగా తమిళనాడు ప్రాంతాన్ని ఏలుతున్న డిఎంకె, అన్నా డీఎంకే కూడా ఢిల్లీలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకోలేదు. కేసీఆర్ మాత్రమే ఢిల్లీలో భారత రాష్ట్ర సమితికి సొంత భవనాన్ని సమకూర్చుకున్నారు” అంటూ ఆర్కే కెసిఆర్ డబ్బు రాజకీయాల్ని తెరపైకి తీసుకొచ్చారు. ఏ మాటకు ఆ మాట ఈరోజు కొత్త పలుకులో రాధాకృష్ణ చెలరేగిపోయారు. కెసిఆర్ తో నేరుగా వైరానికి సిద్ధం అనే సంకేతాలు ఇచ్చారు. నమస్తే తెలంగాణ ఏ విధమైన కౌంటర్ ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది.