Pawan Kalyan -Alluri Sitaramaraju : అల్లూరి.. ఈ మాటలోనే ఓ వైబ్రేషన్ ఉంది. దేశ స్వాతంత్రోద్యమంలో అల్లూరి సీతారామరాజుది ప్రత్యేక స్థానం. బ్రిటీష్ సామ్రాజ్యవాదులను నిద్ర పట్టనివ్వని గెరిల్లా పోరాటం ఆయన సొంతం. ఎన్నో సంచలనాల ఘట్టం. దేశం కోసం అమరుడై వందేళ్లు కావస్తున్నా అల్లూరి రగలించిన స్ఫూర్తి ఇప్పటికీ సజీవంగా ఉందంటే ఆయన చరిత్ర ఎంత ఘనమైనదో అర్థం చేసుకోవచ్చు. బాల్యం నుంచి ఎన్నో ముళ్ల కిరిటాలను దాటుకుంటూ బ్రిటీష్ బానిస సంకెళ్ల నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు గెరిల్లా పోరాటమే శరణ్యమని నమ్మిన గొప్ప దేశభక్తుడు అల్లూరి సీతారామరాజు. పుట్టింది క్షత్రియ కుటుంబంలోనైనా మన్యంలో గిరిజనుల పక్షాన పోరాడిన ఒక మహోన్నత యోధుడు. అటువంటి మహన్నోతమైన యోథుడు నేలకొరిగి ఆదివారం నాటికి వందేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు ఘన నివాళి అర్పించారు. నాటి అల్లూరి పోరాట స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.
వీరులకు జననం మాత్రమే..
వీరులకు జననమే ఉంటుందని.. మరణం ఉండదన్నారు. అల్లూరి రగిల్చిన విప్లవాగ్ని నిత్యం జ్వలిస్తునే ఉంటుందన్నారు. కారణ జన్ములు తాము చేయాల్సిన పనిని ముగించుకొని అదృశ్యమవుతారని..వారి ఆశయాన్ని కొనసాగించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంటుందని చెప్పారు. ఎక్కడ పాలకులు గతి తప్పుతారో, ఎక్కడ పాలకులు దోపిడీదారులుగా మారతారో అక్కడ సీతారామరాజు స్ఫూర్తితో వీరులు పుడుతూనే ఉంటారని పవన్ కల్యాణ్ తెలిపారు. వీరుడు జన్మించిన పుణ్యభూమిపై జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నా పేర్కొన్నారు. ఏ లక్ష్యం కోసం అల్లూరి సీతారామరాజు అమరుడయ్యాడో ఆ లక్ష్యంతో జనసేన పార్టీ ముందుకు సాగుతుందని వెల్లడించారు. విప్లవ జ్యోతికి తన పక్షాన, జనసైనికుల పక్షాన నివాళులు అర్పిస్తున్నానని ఒక ప్రకటనలో తెలిపారు.
భారతరత్న ఇవ్వాలి
అల్లూరి సీతారామరాజుకు భారత రత్న ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. నేటి తరానికి స్ఫూర్తినివ్వడానికి ఇది ఆవశ్యకంగా అభివర్ణించారు. యావత్ భారతావనికి సంకల్పం, పోరాటం, ధీరత్వం, మృత్యువుకు వెరవని ధైర్యం, ఆధ్యాత్మిక సంపదల గురించి తెలియాలి. అందుకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. భారతరత్న ఇవ్వడంతో పాటు అల్లూరి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలి. జనసేన అధికారంలోకి వస్తే ఆ గురుతర బాధ్యత తీసుకుంటుందంటూ పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.