Hathras Stampede: బిడ్డ కోసం ఆసుపత్రికి వెళ్తే.. గుండెలు పగిలే దారుణం.. హత్రాస్ ఘటనలో కనీవినీ ఘోరం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ ఘటనలో కమల అనే ఓ మహిళ తన 16 సంవత్సరాల కుమార్తెను కోల్పోయింది. ఆమె తన కుటుంబంతో కలిసి గత 20 ఏళ్లుగా సత్సంగానికి హాజరవుతోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 3, 2024 4:39 pm

Hathras Stampede

Follow us on

Hathras Stampede: ఎటు చూసినా మృతదేహాలు. కనుచూపుమేరలోనూ శవాలు.. తమ వాళ్లకోసం అయినవాళ్ళు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు.. ఆస్పత్రిలో హాహాకారాలకైతే ఇక అంతూపొంతూ లేదు. ఇందులో ఒక్కొక్కరిది ఒక్క బాధ. కుటుంబాన్ని కోల్పోయి ఓ వ్యక్తి దీనంగా కూర్చుంటే.. కన్నతల్లిని కోల్పోయి గుండెలు పగిలేలా ఏడుస్తున్న దారుణం ఓ అబ్బాయిది. ఇలా ఎవర్ని కదిలించినా ఈ తరహా దీనగాధలే. అయితే ఇందులో తన 16 సంవత్సరాల కుమార్తెను కోల్పోయి.. ఓ తల్లి పడుతున్న ఆవేదన.. హృదయాలను ద్రవింపజేస్తోంది. ఆమె తన దీనగాధను మీడియా ఎదుట వ్యక్తం చేసిన తీరు గుండెలను చెరువులను చేస్తోంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ ఘటనలో కమల అనే ఓ మహిళ తన 16 సంవత్సరాల కుమార్తెను కోల్పోయింది. ఆమె తన కుటుంబంతో కలిసి గత 20 ఏళ్లుగా సత్సంగానికి హాజరవుతోంది. ఈ ఏడాది జరిగిన సత్సంగంలో తన కుటుంబంతో కలిసి పాల్గొన్నది. ” నేను గత 20 సంవత్సరాలుగా నా కుటుంబంతో కలిసి సత్సంగంలో పాల్గొంటున్నాను. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. ఈ దుర్ఘటన వల్ల 16 సంవత్సరాల నా కుమార్తె కన్నుమూసింది. నా కుమార్తె ఆచూకీ కోసం నేను వెతుకుతుంటే ఎవరో ఫోన్ చేశారు. నీ కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది అని చెబితే హుటాహుటిన అక్కడికి వెళ్లాను. నేను ఆసుపత్రి వెళ్లే లోపే నా కుమార్తె నాకు కాకుండా పోయింది. ఈ విషయాన్ని స్వయంగా వైద్యులే చెప్పారు” అంటూ కమల కన్నీటి పర్యంతమవుతూ చెప్పింది..”నాది పేద కుటుంబం. నా భర్త, నేను రెక్కలు ముక్కలు చేసుకొని నా పిల్లలను సాకుతున్నాం. నా 16 సంవత్సరాల కుమార్తె ఇలాంటి పరిస్థితుల్లో కన్నుమూస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇంతటి దారుణం నేను కలలో కూడా అనుకోలేదు. కుమార్తెను కోల్పోయిన నేను ఎవరి కోసం బతకాలని” కమల వాపోయింది.

మరోవైపు భోలే బాబా సత్సంగం సికింద్రరావు కొత్వాది ప్రాంతంలోని బీటీ రోడ్డులో పుల్రాయ్ గ్రామ సమీపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 40 వేల మంది హాజరయ్యారు. ఇంత స్థాయిలో జనం హాజరైనప్పటికీ నిర్వాహకులు సరైన స్థాయిలో ఏర్పాటు చేయకపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఫలితంగా కనీవినీ ఎరగని స్థాయిలో విషాదం చోటుచేసుకుంది. దాదాపు 116 మంది దుర్మరణం పాలయ్యారు. శవాలతో, అయిన వాళ్ళ ఆర్త నాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులకు అండగా ఉంటామని ప్రకటించాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టింది. కేంద్ర బలగాలు కూడా సహాయక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారు.