Chennai Rains: ఈశాన్య రుతుపవనాల ప్రభావం తమిళనాడులో ఎక్కుగా ఉంటుంది. ఏటా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు వర్షాలు కురుస్తుంటాయి. ఈశాన్య రుతుపువనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు, జలాశయాలు నిండుకుండలా మారతున్నాయి. ఇక పట్టణాల్లో రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. చెన్నై నగరాన్ని మూడు రోజులుగా వరణుడు వీడడం లేదు. దీంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులను అలర్ట్ చేసింది. ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చూడాలని సీఎం స్టాలిన్ అధికారులను ఆదేశించారు. మరోవైపు వర్షాలు తగ్గకపోవడంతో చెన్నైలో ప్రతీ రోడ్డు, వీధి జలమయమైంది. వర్షాలు ఇలాగే కొనసాగితే వరదలకు వాహనాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తమయ్యారు.
ఫ్లై ఓవర్ ఎక్కుతున్న కార్లు..
వర్షాలు, వరదల కారణంగా తమిళనాడులో గతంలో కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. 2015, 2018, 2020లో వచ్చిన వరదలకు చాలా వాహనాలు కొట్టుకుపోయాయి. వర్షాలు తగ్గాక వాహనాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో మరమ్మతులకు వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. దీంతో ప్రస్తుత వర్షాల నేపథ్యంలో వరదలు రాకముందే చెన్నై వాసులు అప్రమత్తమయ్యారు. ద్విచక్రవాహనాలను ఇళ్ల డాబాలపై పార్కింగ్ చేస్తున్నారు. గదుల్లో ఉంచి తాళం వేస్తున్నారు. ఇక కార్లను ఇళ్లపై నిలిపే అవకాశం లేనందున… చాలా మంది తమ కార్లను ఎత్తయిన వంతెనలు, ఫ్లై ఓవర్ బ్రిడ్డిలపై పార్కింగ్ చేస్తున్నారు. ఇలా కార్లు వరుసగా పార్కింగ్ చేసిన వీడియోలు వైరల్ అవుతుఆన్నయి.
స్పందిస్తున్న నెటిజన్లు..
చెన్నైలో కార్లను వంతెనలు, ఫ్లై ఓవర్లపై పార్కింగ్ చేసిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. దీనిని చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు. ముందు జాగ్రత్త అంటే ఇదే అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఐడియా అదిరింది అని మరికొందరు, వంతెనలపై ట్రాఫిక్ జామ్ కాకుండా చూడండి అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ కష్టం ఎవరికీ రావొద్దు అని ఇంకొందరు.. కామెంట్లు పెడుతున్నారు.