జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీల నేతల కప్పల తక్కెడలా అటు ఇటూ మారిపోతున్నారు. తెల్లవారితే ఏ పార్టీలో ఏ నాయకుడు ఉంటాడో తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఎన్నికలకు మరో పది రోజుల గడువు ఉండడంతో ఇంకా ఎంత మంది నాయకులు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి జంప్ చేస్తారోనని స్థానికులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా వారిని పార్టీ మారకుండా ఉండేలా ఎలా అని అభ్యర్థులు ఆలోచిస్తున్నారు.
Also Read: పవన్ మిత్రుడి వరకేనా.. పొత్తుకు పనికిరాడా..?
ఒకవైపు ఎన్నికలు సమీపిస్తుంటే ప్రచారం ఎలా చేయాలి, ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలి, విజయం ఎలా సొంతం చేసుకోవాలని వారు ఆలోచిస్తుంటే అసంతృప్తులు మాత్రం వారిని నిద్ర పోనివ్వడం లేదు. ఎన్నికల బరిలో ఉన్న అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థుల పరిస్థితి. నామినేషన్ల ఉపసంహరణ వరకు రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన వారిని ఉపసంహరించుకునేలా చేయడంతోనే తల బొప్పి కట్టగా తాజాగా పార్టీలు మారుతున్న అసంతృప్తులను ఎలా ఆపాలో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
గురువారం ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీఆర్ఎస్‌పై అసహనంతో గురువారం ఉదయం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్న ఓ నాయకుడు రాత్రయ్యే సరికి సొంత గూటికి చేరారు. మంత్రి హరీశ్ రావు ఆయన్ను వెనక్కు పిలిపించినట్లుగా ప్రకటించారు. గురువారం ఉదయం వెంగళ్ రావు నగర్ సిట్టింగ్ టీఆర్‌ఎస్ కార్పొరేటర్ కిలారి మనోహర్, రామచంద్రాపురం కార్పొరేటర్ అంజయ్య యాదవ్‌లు బీజేపీలో చేరారు. టీఆర్‌ఎస్‌నుంచి టికెట్ ఇవ్వకపోవటంతో గురువారం బీజేపీలోకి జంప్ అయ్యారు. దీంతో వెంటనే మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగారు. అంజయ్య యాదవ్‌కు నచ్చ జెప్పి మళ్లీ సొంత గూటికి లాక్కొచ్చారు.
Also Read: కేసీఆర్ తో గేమ్స్ ఆడకు.. ఫ్యామిలీ మొత్తాన్ని దించేశాడు!
పలు పార్టీలకు చెందిన నాయకుల కప్పదాట్లు మొదలయ్యాయి.నాయకులు పార్టీ, అభిమానం పక్కనపెట్టి టికెట్ కోసం ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి రాత్రికి రాత్రే జంప్ జిలానీలుగా మారుతున్నారు. గ్రేటర్ ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీలో తమకు సరైన గుర్తింపు దక్కడం లేదని, తమను పట్టించుకోవడం లేదని, ప్రచారంలో బాధ్యతలు అప్పగించడం లేదని ఇలా పలు రకాల కారణాలతో వారు పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలోనే బలమైన హరీష్ రావు లాంటి నేతలు గులాబీ పార్టీలోని బలమైన నేతలు జారిపోకుండా కాపు కాస్తున్నారు. తమ రాజకీయ చాణిక్యంతో బీజేపీకి చెక్ పెడుతున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్