https://oktelugu.com/

Coffee Day 2024: కాఫీ డే చరిత్ర ఏంటి? అసలు కాఫీ ఎలా పుట్టిందో మీకు తెలుసా?

కొందరు ఇష్టంతో లేదా ఒత్తిడిని తగ్గించుకోవడానికి కాఫీ తాగుతారు. కానీ కాఫీ అనేది చాలామందికి జీవనాధారం. కాఫీ పంటను పండించడానికి ఎంతో కష్టపడుతుంటారు. ఆల్ జపాన్ కాఫీ అసోసియేషన్ మొదటిసారిగా 1983లో కాఫీ కార్యక్రమాన్ని నిర్వహించింది.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 1, 2024 / 09:33 AM IST

    Coffee

    Follow us on

    Coffee Day 2024: ఉదయం లేచిన వెంటనే కాఫీ తాగకపోతే కొందరికి రోజు గడవదు. కొందరు అయితే కాఫీ తాగిన తర్వాతే బ్రష్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా కాఫీకి చాలా మంది ప్రేమికులు ఉన్నారు. సమయం సందర్భం లేకుండా ఎప్పుడైనా కూడా ఈ కాఫీ తాగుతారు. ఆఖరికి భోజనం మానేసి కూడా కాఫీ తాగడానికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే ప్రతి ఏడాది అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. కాఫీ ప్రాముఖ్యతను, దీని ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రేమించే కాఫీకి ఓ చరిత్ర ఉంది. అసలు కాఫీ ఎలా పుట్టింది? ఎవరు దీనిని మొదటిగా తయారు చేశారు? అనే విషయాలు పూర్తిగా తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం చదివేయండి.

    దీని చరిత్ర?
    కొందరు ఇష్టంతో లేదా ఒత్తిడిని తగ్గించుకోవడానికి కాఫీ తాగుతారు. కానీ కాఫీ అనేది చాలామందికి జీవనాధారం. కాఫీ పంటను పండించడానికి ఎంతో కష్టపడుతుంటారు. ఆల్ జపాన్ కాఫీ అసోసియేషన్ మొదటిసారిగా 1983లో కాఫీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ తర్వాత చైనా, తైవాన్, నేపాల్ దేశాలు కాఫీ డేను జరుపుకున్నాయి. ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్ 2015లో అక్టోబర్ 1వ తేదీని కాఫీ డేను ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతీ ఏడాది కాఫీ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. కాఫీ రైతులు కష్టాన్ని గుర్తిస్తూ, దాని ప్రాముఖ్యత గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలియాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

    కాఫీ ఎక్కడ పుట్టింది?
    అందరూ ఎంతగానో ఇష్టపడే కాఫీ ఇథియోపియాలో పుట్టింది. వేడి పానీయంగా కాఫీ బీన్‌లను తాగడం ప్రారంభించారు. అలా ప్రపంచ వ్యాప్తంగా కాఫీ ప్రాముఖ్యత సంతరించుకుంది. భారతదేశంలో మొదటిగా కర్ణాటకలోని చంద్రగిరి కొండల్లో పుట్టింది. ఓ భారతీయ యాత్రికుడు మక్కాకు వెళ్లాడు. ఆ దేశాల నుంచి కాఫీ గింజలను తీసుకురావడం చట్టవిరుద్ధం. దీంతో వాటిని స్మగ్లింగ్ చేసి తీసుకొచ్చాడు. అలా వచ్చిన కాఫీ భారతదేశంలో ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ ఇష్టంగా కాఫీని తాగుతారు. కాస్త ఒత్తిడిగా అనిపించిన మైండ్ రిలీఫ్‌ కోసం వెంటనే కాఫీ బాట పడతారు.

    దీని ప్రాముఖ్యత
    ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే కాఫీ రైతుల కష్టాలు, పంట పండిన చేతికి రాని లాభం, అన్నింటి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ కాఫీ దినోత్సవానికి గుర్తింపు ఇచ్చారు. ఈరోజు కార్యక్రమాలు నిర్వహించి కాఫీ ప్రాముఖ్యతను, ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ ప్రత్యేకంగా జరుపుకుంటారు. అలాగే ప్రత్యేకమైన జూమ్ మీటింగ్‌లు, కొత్త కాఫీ రకాన్ని టేస్ట్ చేయడం, సోషల్ మీడియాలో కాఫీ గురించి అవగాహన కల్పిస్తూ పోస్ట్‌లు చేస్తూ కొందరు కాఫీ డేను జరుపుకుంటారు. మరి మీకు కాఫీ అంటే ఇష్టమేనా? ఈ కాఫీ డేను ఎలా జరుపుకుంటున్నారో కామెంట్ చేయండి.