TSPSC Paper Leak Case: పేపర్ లీకేజీ కేసులో సరికొత్త ట్విస్ట్.. టీఎస్పీఎస్సీ నే కాపాడుతోందా?

ప్రభుత్వం నియమించిన సిట్‌కు కావాల్సిన సమాచారం ఇవ్వడానికి టీఎస్ పీఎస్సీ ఎందుకు వెనకంజ వేస్తోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో అనలటిక్‌ ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, అత్యంత కఠిన ప్రశ్నపత్రాన్ని రూపొందించిన టీఎస్ పీఎస్సీ ఖ్యాతి ఓ దశలో యూపీఎస్సీని మించిపోగా..

Written By: Bhaskar, Updated On : May 27, 2023 10:37 am

TSPSC Paper Leak Case

Follow us on

TSPSC Paper Leak Case: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీకి సంబంధించి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం వరుస అరెస్ట్ లు చేసుకుంటూ వెళ్తోంది. ఈ కేసులో కీలక నిందితురాలైన రేణుకకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ పరిణామం తర్వాత మరికొంతమందిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. ఇవీ ఇప్పటి వరకూ పేపర్ లీకేజీకి సంబంధించి మీడియా వెలువరించిన సమాచారం. అయితే వీటన్నిటికంటే తెలంగాణ స్టేట్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో సూత్రధారులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఈ కేసులో సాంకేతిక, ఇతర ఆధారాల మేరకు సిట్‌ అధికారులు ప్రధాన నిందితులైన ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి, రేణుక, ఢాక్యానాయక్‌, రాజేశ్వర్‌ నాయక్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిని రెండుసార్లు కస్టడీలోకి తీసుకుని విచారించగా.. న్యూజిలాండ్‌లో ఉన్న ప్రవీణ్‌తోపాటు టీఎ్‌సపీఎస్సీ ఉద్యోగులు, మాజీ సిబ్బంది పాత్ర వెలుగులోకి వచ్చింది. దాంతో.. అరెస్టుల సంఖ్య 18-21గానే ఉంది. అయితే.. అనూహ్యంగా ఇటీవల అరెస్టుల సంఖ్య పెరిగింది. మొత్తం 36 మందిని సిట్‌ అరెస్టు చేయగా.. న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌ ఇంకా అరెస్టు కావాల్సి ఉంది. ఇటీవల జరిగిన అరెస్టుల వెనక సిట్‌ భారీ కసరత్తే ఉన్నట్లు తెలుస్తోంది.

సహాయ నిరాకరణ..

ఈ కేసులో మొదటి నుంచి నిందితులు సిట్‌ విచారణకు సహకరించడం లేదు. సిట్‌ గుర్తించిన ఆధారాల విషయంలో మాత్రమే ‘అవును’ లేదా ‘కాదు’ అని సమాధానాలిచ్చారు. జగిత్యాల జిల్లా మల్యాలలో సిట్‌ విచారణ పూర్తయ్యాక.. అరెస్టయిన వారితోపాటు, న్యూజిలాండ్‌లోని ప్రశాంత్‌ నేరాలను రుజువుచేస్తూ కోర్టులో అభియోగపత్రాలను దాఖలు చేయాలని అధికారులు నిర్ణయించారు. చార్జ్‌షీట్‌ రూపకల్పన విషయంలో హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌, ఇతర అధికారులు ఆరా తీశారని, ఆ తర్వాతే మరింత లోతు దర్యాప్తునకు సిట్‌ సన్నద్ధమైందని తెలుస్తోంది. ఈ కేసు నమోదైన నాటికి టీఎస్ పీఎస్సీ అధికారులు గ్రూప్‌-1, ఏఈ, డీఏవో పరీక్షలను పూర్తిచేశారు. ఆ పరీక్షల్లో మెరిట్‌ లిస్టును సంపాదించి, దాని ఆధారంగా దర్యాప్తు చేయాలని సిట్‌ నిర్ణయించింది. ఆ వెంటనే టీఎస్ పీఎస్సీ అధికారులను సంప్రదించగా.. వారు ‘‘అలా మెరిట్‌ లిస్టు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. పైగా ఆ పరీక్షలు రద్దయిపోయాయి. ఇప్పుడు మెరిట్‌ లిస్టును బయటపెడితే ఇబ్బందులు వస్తాయి’’ అని సమాధానమిచ్చినట్లు సిట్‌ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ కేసులో అక్రమాలకు పాల్పడ్డ ఏ ఒక్కరినీ వదిలిపెట్టకూడదని నిర్ణయించిన సిట్‌.. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా ఆ మూడు పరీక్షల మెరిట్‌ లిస్టు ఇవ్వాలంటూ టీఎస్ పీఎస్సీకి దరఖాస్తు చేసింది. ఆ దరఖాస్తులో ఆర్టీఐ నిబంధనలు, ఎలాంటి సందర్భాల్లో సమాచారం ఇవ్వకూడదని చట్టం చెబుతుందో పేర్కొంటూ.. టీఎస్ పీఎస్సీ సమాచారం నిషేధిత జాబితాలో లేదని గుర్తు చేసింది. యూపీఎస్సీ విషయంలో పలు కోర్టు తీర్పులు, టీఎస్ పీఎస్సీ రాజ్యాంగంలోని అంశాలను ప్రస్తావించింది. దీంతో.. టీఎస్ పీఎస్సీకి సిట్‌ కోరిన సమాచారాన్ని ఇవ్వక తప్పలేదు.

ఎందుకు ఇవ్వడం లేదు

ప్రభుత్వం నియమించిన సిట్‌కు కావాల్సిన సమాచారం ఇవ్వడానికి టీఎస్ పీఎస్సీ ఎందుకు వెనకంజ వేస్తోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో అనలటిక్‌ ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, అత్యంత కఠిన ప్రశ్నపత్రాన్ని రూపొందించిన టీఎస్ పీఎస్సీ ఖ్యాతి ఓ దశలో యూపీఎస్సీని మించిపోగా.. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం ఆ కీర్తిని ఒక్కసారిగా కూలదోసింది. జరిగిన తప్పులను సరిదిద్దుకుని, సంస్కరణలకు పెద్దపీట వేయాల్సిన టీఎస్ పీఎస్సీ అధికారులు సిట్‌ కోరిన సమాచారం ఇవ్వకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

సిట్‌ చేతికి మెరిట్‌ లిస్టులు వచ్చాక.. ఉన్నతాధికారులు వేర్వేరు బృందాలను ఏర్పాటు చేశారు. ఆ బృందాలు మెరిట్‌లో ఉన్న అభ్యర్థుల బ్యాక్‌గ్రౌండ్‌ను తనిఖీ చేయడం మొదలు.. వారికి ఉన్న విషయ పరిజ్ఞానం, సాధించిన మార్కులను బేరీజు వేసుకుంది. అంతేకాదు.. అభ్యర్థుల ఫోన్‌ కాల్‌ డేటాను పరిశీలించి, టీఎస్ పీఎస్సీ ఉద్యోగులు, ఈ కేసులో నిందితులతో సంబంధాలున్నాయా? అనే అంశంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఖమ్మం నగరానికి చెందిన లౌకిక్‌, సుష్మిత దంపతుల ద్వారా మరికొందరికి డీఏవో ప్రశ్నపత్రం లీకైనట్లు సిట్‌ గుర్తించింది. బెంగళూరుకు చెందిన ఆడిటర్‌తోసహా.. మరో ఇద్దరికి బేడీలు వేసింది. సిట్‌ చేతికి మెరిట్‌ లిస్టు వచ్చాకే ఒక్కసారిగా అరెస్టులు పెరిగాయి. నిందితుల సంఖ్య 37కు, అరెస్టుల సంఖ్య 36కు పెరిగింది. మెరిట్‌ లిస్టులోని మరో 9-14 మంది రాడార్‌లో ఉన్నట్లు సిట్‌ వర్గాలు చెబుతున్నాయి.