Tirumala: తిరుమల కాలినడక మార్గంలో భక్తులు వెళుతుండగా దండకారణ్యం నుంచి బయటకు వచ్చిన ఓ చిరుత ఓ బాలుడిని అమాంతం నోట కరుచుకుంది. దీంతో భక్తులు దూరంగా పారిపోయారు. అలా నోట కరుచుకున్న ఆ బాలుడు ని చిరుత అమాంతం అడవిలోకి లాక్కెళ్ళిపోయింది. సుమారు 200 మీటర్ల దూరం వెళ్లిపోగానే ఆ బాలుడి పాలిట ఆపద్బాంధవుల్లా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యక్షమయ్యారు. దాని వెంట పరిగెత్తి ఆ బాలుడిని రక్షించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కొంతమంది భక్తులు కాలినడకన మెట్ల మార్గం ద్వారా వెళ్తారు. అలా కర్నూలు జిల్లా ఆదోని లోని హనుమాన్ నగర్ కు చెందిన ఓ భక్త బృందం శ్రీవారిని దర్శించుకునేందుకు మెట్ల మార్గం ద్వారా బయలుదేరింది.. ఇలా బయలుదేరిన తర్వాత గురువారం రాత్రి సమయంలో ఏడో మైలు వద్ద ఓ చిరుత పులి అమాంతం జనావాసంలోకి వచ్చింది. హనుమాన్ నగర్ కు చెందిన భక్త బృందం లోని ఐదు సంవత్సరాల బాలుడిని అమాంతం నోట కరుచుకుంది. ఆకస్మాత్తుగా పులిరావడంతో ఆ భక్త బృందం ఒక్కసారిగా హడలిపోయింది. ప్రాణ భయంతో అందరూ పరుగులు పెట్టారు. ఆ బాలుడి తల్లిదండ్రులు కేకలు వేశారు. అక్కడే భద్రత పర్యవేక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేతిలో కర్రలు పట్టుకొని మరో క్షణం ఆలోచించకుండా కొంతమంది భక్తుల సహాయంతో ఆ పులి వెనకాలే పరుగులు తీశారు. వారు కర్రలు పట్టుకోవడం, చేతుల్లో సెల్ ఫోన్ టార్చ్ లు ఉండటంతో ఆ పులి భయపడింది. వెంటనే ఆ బాలుడిని అక్కడే వదిలేసి పారిపోయింది.
పులి పారిపోవడంతో ఊపిరి పీల్చుకున్న ఏపీ పోలీసులు, వారి వెంటే పరుగులు తీసిన భక్తులు ఆ బాలుని పరీక్షించారు. మెడ వెనకాల గాయం కావడం, పొట్ట భాగంలో పులి గోర్లు రాపిడి కావడంతో రక్తపు చారికలు ఏర్పడ్డాయి. దీంతో ఏపీ పోలీసులు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో కి సమాచారం అందించారు. ఆయన వెంటనే సంబంధిత అధికారులను సంఘటన స్థలానికి పంపించారు. అంబులెన్స్ సహాయంతో ఆ బాలుడిని తిరుపతిలోని బాలాజీ ఆసుపత్రికి తరలించారు.
కాగా తమ కుమారుడిని ప్రాణాలకు తెగించి రక్షించిన ఏపీ పోలీసులకు, ఇతర భక్తులకు హనుమాన్ నగర్ కు చెందిన తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ సంఘటనతో ఒకసారిగా మెట్ల మార్గంలో ఆందోళన నెలకొంది. చాలామంది భక్తులు భయంతో అక్కడే ఉండిపోయారు. అయితే రంగంలోకి దిగిన తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా అధికారులు భక్తులకు నచ్చజెప్పడంతో తిరిగి వారు ప్రయాణం కొనసాగించారు. మెట్ల మార్గంలో గతంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోలేదని తిరుమల తిరుపతి దేవస్థానం భద్రత అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని రక్షణ చర్యలు చేపడతామని వారు వివరిస్తున్నారు. కాగా బాలుడిని చిరుత పులి నోట కరుచుకొని అడవిలోకి లాక్కెళ్ళిన ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని దండకారణ్యం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం లేదని అక్కడి వైద్యులు స్పష్టం చేశారు.