BCCI Selection Committee: టీమిండియా చీఫ్ సెలెక్టర్ పోస్ట్ భర్తీపై బిసిసిఐ దృష్టి సారించింది. కొద్ది రోజుల కిందటి వరకు ఈ పోస్టులో కొనసాగిన చేతన్ శర్మ ఒక ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోవడంతో తన పదవికి రాజీనామా చేశాడు. దీంతో చీఫ్ సెలెక్టర్ పదవి ఖాళీ అయింది. ఈ పోస్ట్ ను భర్తీ చేసేందుకు కొద్ది రోజుల నుంచి బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ ఆశావహులను కోరింది. దీంతో ఈ పోస్టుకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చీఫ్ పదవిపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. ఈ పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉండడంతో దీనిని త్వరగా భర్తీ చేయడంపై బీసీసీఐ దృష్టి సారించింది. గతంలో ఈ పోస్ట్ కు సంబంధించి సీనియర్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ను దరఖాస్తు చేయమని బీసీసీఐ కోరింది. అయితే వేతనం తక్కువగా ఉండడంతో సెహ్వాగ్ ఆసక్తి చూపించినట్టు తెలుస్తోంది. మిగిలిన సీనియర్ క్రికెటర్లు కూడా ఇదే విధమైన ఆలోచనతో ఉండడంతో బీసీసీఐ ఆసక్తి కలిగిన మాజీ ఆటగాళ్ల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ నెల 30 వరకు చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఈ పోస్టుకు సంబంధించి ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ పోస్టును ఇంటర్వ్యూ ద్వారా బిసిసిఐ ఎంపిక చేయనుంది.
నార్త్ జోన్ నుంచి ఈ పదవి పట్ల ఆసక్తి..
ప్రస్తుతం సెలక్షన్ కమిటీలో నలుగురు సభ్యులు ఉన్నారు. ఈ సెలక్షన్ కమిటీకి శివ సుందర్ దాస్ నేతృత్వం వహిస్తుండగా కమిటీలో సలీల్ అంకోలా, సుబ్రతో, ఎస్ శరత్ ఉన్నారు. నార్త్ జోన్ కు సంబంధించిన సీటు ఖాళీగా ఉంది. వీరిలో శివసుందర్దాసు ఒక్కడే భరత్ తరుపున 23 టెస్టులు ఆడాడు. మిగిలిన వారికి పెద్దగా అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేదు. నార్త్ జోన్ నుంచి టీమిండియా మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రా ఈ పదవి పట్ల ఆసక్తి కనబరుస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే గతంలో చేత న్ శర్మను రిఅపాయింట్ చేసే సమయంలో రాత్రాను బీసీసీఐ ఇంటర్వ్యూ చేసింది. కానీ ఆ తర్వాతి రౌండ్ కు రాత్రా ఎంపిక కాలేదు. రాత్రతో పాటు ప్రముఖ బీసీసీఐ పానెల్ కామెంట్ థియేటర్ వివేక్ రాజ్దాన్ పేరు కూడా చీఫ్ సెలెక్టర్ పోస్ట్ రేసులో వినిపిస్తోంది. అతను కూడా ఈ పదవి కోసం పోటీ పడుతున్నట్లు చెబుతున్నారు. ఈయన ఉద్యోగరీత్యా ఎన్నో దేశవాలి మ్యాచులు చూసిన అనుభవం ఉంది కొత్త టాలెంట్ ను సులభంగా గుర్తించడం ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి బీసీసీఐ ఎవరికి అవకాశం కల్పిస్తుందో.
అందుకే ఈ పోస్ట్ కు పెరిగిన ప్రాధాన్యత..
ఈ ఏడాది చివరలో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఇప్పుడు చీఫ్ సెలెక్టర్ గా ఎంపికయ్యే వ్యక్తి సారధ్యంలోనే వన్డే వరల్డ్ కప్ జట్టు కూడా ఎంపిక కానుంది. వన్డే వరల్డ్ కప్ ఆడే జట్టును ఎంపిక చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఒకవేళ గొప్ప జట్టును ఎంపిక చేసి విజయం సాధిస్తే ఆటగాళ్లతో పాటు సెలెక్టర్లు కూడా చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం చీఫ్ సెలెక్టర్ గా ఎవరు వస్తారు అన్న ఆసక్తి క్రికెట్ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ వ్యక్తం అవుతుంది. వీలైనంత వేగంగా ఎంపిక ప్రక్రియను ముగించి సెలక్షన్ కమిటీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. సీనియర్ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నప్పటికీ అందుకు అనుగుణంగా ఎవరు ముందుకు రాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను బీసీసీఐ అనుసరిస్తోంది. చూడాలి మరి చీఫ్ సెలెక్టర్ గా ఎవరికి అవకాశం దక్కుతుందో.