Revanth Reddy: రేవంత్ రెడ్డి.. నిజమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడైనా.. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం సైతం తమ వాడిగా చెబుతుండడం విశేషం. అయితే కాంగ్రెస్ గెలుపుతో పాటు రేవంత్ ఈ స్థితికి ఆ రెండు సామాజిక వర్గాలు ఇతోధికంగా సాయపడ్డాయి. అందుకు తగ్గ ఫలితం రావడంతో ఆ క్రెడిట్ కోసం రెండు సామాజిక వర్గాల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుండడం విశేషం. మా రేవంత్ అంటే మా రేవంత్ అంటూ కొట్టుకోవడం కనిపిస్తోంది.
రేవంత్ రెడ్డి తమవాడు.మా చంద్రబాబు శిష్యుడు. అన్నింటికీ మించి జగన్ కు మిత్రుడైన కేసీఆర్ కు శత్రువు. అందుకే రేవంత్ ను గెలిపించుకున్నాం. ముమ్మాటికి రేవంత్ విజయం వెనుక మేము ఉన్నాం. అంటూ కమ్మ సామాజిక వర్గం చెప్పుకొస్తోంది. దశాబ్ద కాలం నుంచి తెలంగాణలో అధికారానికి దూరంగా ఉన్నాం. రేవంత్ ద్వారా ఆ అవకాశం దక్కింది. అందుకే రేవంత్ తో పాటు కాంగ్రెస్కు ఏకపక్షంగా మద్దతు తెలిపాం. ఈ విజయం ముమ్మాటికీ మాదే.. అంటూ రెడ్డి సామాజిక వర్గం మరోవైపు రెచ్చిపోతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసలు సిసలైన అభిమానుల కంటే కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల గోల అధికమవుతోంది.
చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన కెసిఆర్ కు సరైన తిరుగు బహుమతి ఇచ్చామంటూ టిడిపి అభిమానులు, కమ్మ సామాజిక వర్గం వారు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. దీనికి రెడ్డి సామాజిక వర్గం వారు దీటైన కౌంటర్ ఇస్తున్నారు. మీరు రేవంత్ ఎలా అవుతాడు? మా రేవంత్ అవుతాడు కానీ అంటూ ట్విట్లు, పోస్టులు పెడుతున్నారు. అక్కడితో ఆగకుండా జగన్, వైయస్తోపాటు రేవంత్ ఫోటోలను కూడా చేర్చుతూ సోషల్ మీడియాలో తెగ గోల పెడుతున్నారు. అయితే దీనిపై కమ్మ సామాజిక వర్గం వారు స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తున్నారు రేవంత్ కు కేసిఆర్ ఇబ్బంది పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు. చివరకు కుమార్తె వివాహానికి సైతం రేవంత్ హాజరు కాకుండా కేసీఆర్ ఇబ్బంది పెట్టారని.. అటువంటి సమయంలో చంద్రబాబు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పుడే కెసిఆర్ కు జగన్ ఎందుకు నియంత్రించలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై అదే స్థాయిలో రెడ్డి సామాజిక వర్గం వారు రిప్లై ఇస్తున్నారు. మొత్తానికైతే రేవంత్ భౌతికంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడైనా.. తమ వాడంటే తమ వాడు అని ఆ రెండు సామాజిక వర్గాలు కొట్లాడుతుండడం విశేషం.