CM Revanth Reddy: రేవంత్‌రెడ్డి అనే నేను.. ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం.. మంత్రులు వీరే!

ముఖ్యమంత్రితోపాటుమరో పది మంది మంత్రులు మొదట ప్రమాణ స్వీకారం చేయాలని.. తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించాలనే ప్రతిపాదన ఏఐసీసీ నాయకులు, రేవంత్‌రెడ్డి మధ్య జరిగిన చర్చల్లో వచ్చినట్లు తెలిసింది.

Written By: Raj Shekar, Updated On : December 7, 2023 11:05 am

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి మరికొన్ని గంటల్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈమేరకు హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియం ముస్తాబైంది. మధ్యాహ్నం 1: 04 గంటలకు రేవంత్‌తో ముఖ్యమంత్రిగా గవర్నర్‌ తమిళిసై ప్రమాణం చేయించనున్నారు. ఇక పొన్నం ప్రమాణ స్వీకారోత్సవానికి అతిరథ మహారథలు తరలివస్తున్నారు. ఏఐసీసీ నుంచి మల్లికార్జున ఖర్గే. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతోపాటు పలువురు ఎంపీలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరందరికీ హోటల్‌ తాజ్‌కృష్ణలో వసతి ఏర్పాటు చేశారు. ఇక రేవంత్‌తోపాటు ఉప ముఖ్యమంత్రిగా మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కతోపాటు, మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈమేరకు ఇప్పటికే వారికి సమాచారం అందించారు. మంత్రుల జాబితాను కూడా గవర్నర్‌ కార్యాలయానికి పంపించారు.

పది మంది మంత్రులు..
ముఖ్యమంత్రితోపాటుమరో పది మంది మంత్రులు మొదట ప్రమాణ స్వీకారం చేయాలని.. తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించాలనే ప్రతిపాదన ఏఐసీసీ నాయకులు, రేవంత్‌రెడ్డి మధ్య జరిగిన చర్చల్లో వచ్చినట్లు తెలిసింది. కానీ అధిష్ఠానం మాత్రం పూర్తిస్థాయి మంత్రివర్గంతోనే వెళ్లమని సూచించినట్లు తెలిసింది. ఒకటి లేదా రెండు ఖాళీలు ఉంచి మిగిలినవి భర్తీ చేస్తే మంచిదనే అభిప్రాయాన్ని ఏఐసీసీ అగ్రనాయకులు వ్యక్తం చేసినట్లు సమాచారం. బుధవారం రాత్రి వరకు ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరు మినహా మంత్రుల జాబితా గవర్నర్‌ కార్యాలయానికి చేరలేదు.

కేబినెట్‌లో ఖమ్మంకు పెద్దపీట!
రాష్ట్ర క్యాబినెట్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పెద్దపీట వేశారు. ఈ జిల్లా నుంచి భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా, తుమల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. తర్వాత వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు ప్రాధాన్యం ఇచ్చారు. మహబూబ్‌నగర్‌ నుంచి రేవంత్‌రెడ్డి సీఎంగా, జూపల్లి కృష్ణారావు మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. వరంగల్‌ జిల్లా నుంచి సీతక్క, కొండా సురేఖ, కరీంనగర్‌ జిల్లా నుంచి శ్రీధర్‌బాబు, పొన్న ప్రభాకర్‌ ప్రమాణం చేయనున్నారు. నల్లగొండ జిల్లా నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణం చేస్తారు. మెదక్‌ నుంచి దామోదర రాజనర్సింహకు అవకాశం కల్పించారు. ఈమేరకు రాజ్‌భవన్‌కు జాబితాను పంపించారు.

ఎవరికి ఏ శాఖ..?
ఎవరెవరికి ఏ శాఖ అనే విషయంలో కూడా ఇప్పటికే కొంత స్పష్టత వచ్చినట్లు చెబుతున్నారు. శ్రీధరాబాబుకు ఆర్థికశాఖ కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. స్పీకర్‌ పదవి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినా శ్రీధర్‌బాబు తిరస్కరించినట్లు తెలిసింది. భట్టి విక్రమార్కకు రెవెన్యూ శాఖ కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతున్నా స్పష్టత రావాల్సి ఉంది. కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి నీటిపారుదల శాఖ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉంచి మిగిలినవి భర్తీ చేయవచ్చనే అభిప్రాయాన్ని కూడా పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మొదటిసారిగా ఎన్నికైన వారికి, ఓడిపోయిన వారికి అవకాశం ఇవ్వొద్దని ఏఐసీసీ నాయకులు రేవంత్‌రెడ్డికి సూచించినట్లు తెలిసింది.

మూడు జిల్లాలకు దక్కని ఛాన్స్‌..
మంత్రివర్గంలో ఈసారి ఉమ్మడి ఆదిలాబాద్, నిజాబాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చోటు దక్కలేదు. రంగారెడ్డిలో ఎమ్మెల్యేలు లేకపోవడంతో స్థానం కల్పించలేదు. కానీ నిజామాబాద్, ఆదిలాబాద్‌లో ఆ పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నా పోటీ ఎక్కువగా ఉంది. దీంతో మంత్రివర్గ విస్తరణలో ఆ జిల్లాలకు స్థానం కల్పిస్తారని తెలిసింది.