Gannavaram Politics : గన్నవరంలో వైసీపీకి గట్టి షాక్

2019 ఎన్నికల్లో అమెరికాలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావుకు పిలిచి మరి జగన్ టికెట్ ఇచ్చారు. కానీ వంశీ 5000 ఓట్లతో గట్టెక్కగలిగారు. ఇప్పుడు అదే వంశీని వైసీపీలో చేర్చి టికెట్ కన్ఫర్మ్ చేశారు.

Written By: Dharma, Updated On : August 27, 2023 4:38 pm

Gannavaram

Follow us on

Gannavaram Politics : గన్నవరం నియోజకవర్గాన్ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందా? యార్లగడ్డ వెంకట్రావును చేజార్చుకున్నామని బాధపడుతోందా? వల్లభనేని వంశీకి టిక్కెట్ ఇచ్చినా గెలుపు అనుమానమేనని భావిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. తనకు పార్టీలో ప్రత్యర్థి గా నిలిచిన యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు చెంచాగాళ్ళు అంటూ వల్లభనేని వంశీ ఘాటు వ్యాఖ్యలు చేసేవారు. అయితే ఇప్పుడు అదే దుట్టా రామచంద్రరావు ఇంటికి వైసీపీ కీలక నేతలు వెళ్లి చర్చలు జరపడం విశేషం.

వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట దుట్టా రామచంద్రరావు నడిచారు. అందుకే 2014 ఎన్నికల్లో రామచంద్ర రావు కే గన్నవరం నియోజకవర్గ టికెట్ ను జగన్ కేటాయించారు. అయితే ఆ ఎన్నికల్లో పదివేల ఓట్లతో వంశీ గెలిచారు. 2019 ఎన్నికల్లో అమెరికాలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావుకు పిలిచి మరి జగన్ టికెట్ ఇచ్చారు. కానీ వంశీ 5000 ఓట్లతో గట్టెక్కగలిగారు. ఇప్పుడు అదే వంశీని వైసీపీలో చేర్చి టికెట్ కన్ఫర్మ్ చేశారు. దీంతో యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్ర రావు అసమ్మతి స్వరం వినిపించారు. ఈ క్రమంలో అసలు వారు నాకు పోటీయే కాదని.. వారంతా పకోడీ గాళ్లు, పిట్టలదొరలు అంటూ వంశీ ఎగతాళి చేసేవారు. అయితే ఇప్పుడు అదే పకోడీ గాళ్లు,పిట్టలదొరల అవసరం వంశీకి వచ్చిందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

యార్లగడ్డ వెంకట్రావు టిడిపి గూటికి చేరడంతో వంశీకి ఒక తలనొప్పి వదిలింది. అదే సమయంలో నిశ్శబ్దంగా ఉన్న టిడిపి క్యాడర్లో ఒక రకమైన జవసత్వం వచ్చింది. టిడిపికి సరైన నాయకత్వం లేకపోవడంతో చాలామంది వంశీ వెంట నడిచారు. ఇప్పుడు వారంతా టర్న్ అవుతున్నారు. వైసీపీ క్యాడర్ సైతం యార్లగడ్డ వెంకట్రావు తో వెళ్తోంది. దీనిని గుర్తించిన హై కమాండ్ దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. ఇటువంటి సమయంలో దుట్టా రామచంద్రరావు కీలకంగా మారారు. ఒక విధంగా చెప్పాలంటే గన్నవరం నియోజకవర్గంలో కింగ్ మేకర్ గా నిలిచారు. దీంతో వైసిపి నాయకత్వం మధ్య వర్తులను రంగంలోకి దించింది. వల్లభనేని వంశీకి దుట్టా సహకరించేలా ఆయన్ను ఒప్పిస్తున్నారు. అయితే గతంలో తన మద్దతు లేకుండానే గెలుస్తానని వంశీ చెప్పుకొచ్చారని.. తనను పిట్టలదొరతో పోల్చారని దుట్టా రామచంద్రరావు గుర్తు చేస్తున్నారు. ఇన్నాళ్ళు గన్నవరంలో నాపై పోటీ చేయాలని రాజకీయ ప్రత్యర్థులకు వంశీ సవాల్ చేసేవారు. ఇప్పుడు ఆ సవాలే వంశీకి ప్రతిబంధకంగా మారింది. దుట్టా రామచంద్రరావు నిర్ణయం పైనే వంశీ భవితవ్యం ఆధారపడి ఉంది. అందుకే ఇప్పుడు దుట్టా రామచంద్రరావు కోసం వైసీపీ నానా హైరానా పడుతోంది.