AP Govt : 50 పదాల ప్రెస్ నోట్లో.. పదుల సంఖ్యలో తప్పులు.. ఇదే నా జగనన్న బ్రాండ్ తెలుగు

చిన్న ప్రెస్ నోట్ సైతం తప్పులు లేకుండా విడుదల చేయలేకపోవడం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. విజయ్ బాబు తీరు వైసీపీ సర్కార్ కు అపవాదుగా మారింది.

Written By: Dharma, Updated On : August 27, 2023 4:29 pm

Gidugu rammurthi

Follow us on

AP Govt : తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులుగారు. గ్రాంధిక భాషను వాడుక భాషలో తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి ఆయన. ఆంధ్రదేశంలో వ్యవహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. అటువంటి మహానీయుడ్ని అవమానపరిచే విధంగా ఏపీ సర్కారు వ్యవహరించింది. ఆయన జయంతి సందర్భంగా తెలుగు భాషా వారోత్సవాలను నిర్వహించాలని భావించింది. అయితే ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రిక విమర్శలకు కారణమవుతోంది. పట్టుమని 50 పదాలు ఉండే ఈ ఆహ్వాన ప్రకటనలో 10 తప్పులు ఉన్నాయి. ఇక అన్వయ దోషాల గురించి చెప్పనక్కర్లేదు.

వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు భాషకు ప్రాధాన్యత తగ్గింది. మాతృభాషపై ఒక పద్ధతి ప్రకారం అణచివేత జరుగుతోంది. దానికి రకరకాలుగా జగన్ సర్కార్ వక్ర భాష్యం చెబుతూ వచ్చింది. దీనిపై ముప్పేట దాడిని ఎదుర్కొంది. ఈ విమర్శలను అధిగమించేందుకు తెలుగు భాషా వారోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. దీనికి అధికార భాషా సంఘం ద్వారా ఆహ్వానాలు పంపారు. స్వయంగా అధికార బాషా సంఘం అధ్యక్షుడు విజయ్ బాబు సంతకం పెట్టి మరి ఆహ్వాన ప్రకటనను జారీ చేశారు.

అయితే ఈ ఆహ్వాన ప్రకటనలో ప్రతి పదమూ తప్పే. ఓ మాదిరిగా తెలుగు చదువుకున్న వారు సైతం తెలుగుకు ఇంత తెగులు పుట్టిందా అని ఆశ్చర్యపోతారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉండి విజయ్ బాబు ఆహ్వాన ప్రకటన చదవకుండా సంతకం చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విజయ్ బాబు సుదీర్ఘకాలం జర్నలిస్టుగా పనిచేశారు. అధికార పార్టీ పక్షాన చేరారు. దీంతో అధికార భాష సంఘం అధ్యక్షుడిగా నామినేట్ అయ్యారు. అధికార పార్టీకి వకాల్తా గా టీవీ డిబేట్లో సైతం పాల్గొంటున్నారు. అయితే వృత్తిరీత్యా ఒక జర్నలిస్ట్ అయి ఉండి.. అధికార భాషా సంఘం అధ్యక్షుడు హోదాలో తెలుగునకు అగౌరవం కలిగేలా ప్రవర్తించడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. చిన్న ప్రెస్ నోట్ సైతం తప్పులు లేకుండా విడుదల చేయలేకపోవడం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. విజయ్ బాబు తీరు వైసీపీ సర్కార్ కు అపవాదుగా మారింది.