Jammu And Kashmir : ఆర్టికల్ 370 రద్దుతోపాటు జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది కేంద్రం. దీంతో ఆ రాష్ట్రంలో పదేళ్లుగా ఎన్నికలు నిర్వహించలేదు. సుప్రీం కోర్టు జోక్యంతో ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించింది. ఇందులో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. ఈ కూటమి అధికారంలోకి వచ్చింది. 90 స్థానాల్లో 48 స్థానాలు నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచింది. దీంతో ఆ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా బుధవారం(అక్టోబర్ 16న) శ్రీనగర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా సురీందర్‌చౌదరి ప్రమాణం చేశారు. ఇక నేషనల్ కాన్ఫరెన్స్ మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్‌లోని కొత్త ప్రభుత్వంలో భాగం కాకూడదని నిర్ణయించుకుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఒమర్ అబ్దుల్లా కేంద్రపాలిత ప్రాంతానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. 2019లోనే కేంద్రం రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే.
తాత సమాధి వద్ధ ప్రార్థనలు..
ఒమర్ అబ్దుల్లా తన ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందు శ్రీనగర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు, తన తాత షేక్ మొహమ్మద్ అబ్దుల్లా సమాధి అయిన మజార్ – ఎ – అన్వర్ వద్ద ప్రార్థనలు చేశారు. పూల మాలలు వేసి నివాళులర్పించారు. ‘నాకు కొన్ని విచిత్రమైన తేడాలు ఉన్నాయి. పూర్తిగా ఆరేళ్లపాటు పనిచేసిన చివరి ముఖ్యమంత్రిని నేనే. ఇప్పుడు నేను కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌కు మొదటి ముఖ్యమంత్రిని అవుతాను. ఆరేళ్లపాటు సేవలందించడంలో ఇదే చివరి గుర్తింపు’ అని ఒమర్ ఈ సందర్భంగా అన్నారు.
రెండోసారి ముఖ్యమంత్రిగా..
ఇదిలా ఉంటే ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఇది రెండోసారి. మొదటి టర్మ్‌లో అతను 2009, జనవరి 5 నుంచి 2015, జనవరి 8 వరకు పనిచేశారు. ప్రస్తుతం రెండోసారి శ్రీనగర్‌లోని షేర్–ఐ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో అబ్దుల్లా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. దీనికి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా హాజరయ్యారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఉదయం 11.30 గంటలకు అబ్దుల్లా ఎంపిక చేసిన ఎనిమిది మంది మంత్రులతో ప్రమాణం చేయించారు.