Chinnaswamy Stadium: కొద్దిరోజులుగా బెంగళూరు నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం.. ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్న నేపథ్యంలో బెంగళూరు నగర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది. ముందు జాగ్రత్త చర్యగా కర్ణాటక విద్యాశాఖ బెంగళూరులోని పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది. బుధవారం ఉదయం భారీగా వర్షం కురవడం.. మధ్యాహ్నం చినుకులు పడుతుండడంతో.. మైదానాన్ని సిద్ధం చేయడానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే మనదేశంలో వరద నీటిని బయటికి పంపించే అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉన్న మైదానాలలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఒకటి. ఇక్కడ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి.. ఎంత భారీ వర్షం కురిసినా మ్యాచ్ నిర్వహించేందుకు మైదానాన్ని సిద్ధం చేస్తారు.
నిమిషానికి పదివేల నీటిని పీల్చి వేసే సామర్థ్యం
బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో నిమిషానికి పదివేల లీటర్ల నీటిని ఫీల్చేయగల సామర్థ్యం కలిగిన సబ్ ఎయిర్ సిస్టం ఉంది. ఇక్కడ వర్షం కురవడం ఆగిన కాసేపటికే పిచ్, మైదానాన్ని చిత్తడిగా లేకుండా చేయవచ్చు. అయితే గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షం.. యధావిధిగా కొనసాగితే.. తొలి రోజు ఆట చూసేందుకు ప్రేక్షకులకు అవకాశం లభించకపోవచ్చు.
ఎలా పనిచేస్తాయంటే..
సబ్ ఎయిర్ సిస్టాన్ని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ గత పది సంవత్సరాలుగా ఉపయోగిస్తుంది. 2015లో తొలిసారి భారత్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ కోసం ఈ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది. పిచ్ తో పాటు, మైదానంలోని పచ్చిక కింద వివిధ లేయర్లలో ఇసుకను ఉపయోగించారు. దేశంలో ఉన్న మిగతా మైదానాలలో ఎక్కువగా మట్టిని ఉపయోగించారు. బెంగళూరు మైదానంలో ఇసుక అధికంగా ఉండడం వల్ల నీరు నిల్వ ఉండకుండా మెషిన్ ను ప్రారంభించగానే అది వెంటనే బయటికి వస్తుంది. దీనికోసం 200 హార్స్ పవర్ యంత్రాలతో సబ్ ఎయిర్ సిస్టం నడుస్తుంది. ఆ నీటిని డ్రైనేజీల ద్వారా బయటికి పంపిస్తారు. అనంతరం డ్రయర్లు, రోప్స్ సహాయంతో మైదానాన్ని సిద్ధం చేస్తారు.
గతంలో కీలకమైన మ్యాచులు జరిగినప్పుడు బెంగళూరులో ఇలాగే వర్షం కురిసింది. అప్పుడు మైదాన సిబ్బంది వెంటనే స్పందించి… అధునాతన టెక్నాలజీ ఉపయోగించి.. మైదానంలో ఉన్న వరద నీటిని బయటికి పంపించారు. గంట సమయంలోనే మైదానాన్ని సిద్ధం చేసి.. ఆట కొనసాగేలా చేశారు. అయితే మన దేశంలో కొన్ని పురాతన క్రికెట్ మైదానాలలో ఇలాంటి టెక్నాలజీ లేదు.. అయితే ఈ టెక్నాలజీని మిగతా అన్ని మైదానాలకు వర్తింపజేసేలాగా బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది.