AP Liquor Policy Guidelines :  ఏపీ లిక్కర్ షాపుల సమయం వేళలు.. మద్యం ధరలు ఇవీ.. *మార్గదర్శకాలు జారీ*

ప్రభుత్వ మద్యం దుకాణాలకు తెర పడింది. గత ఐదేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు నడిచాయి. అయితే గత ఐదేళ్లుగా మద్యం పాలసీ పై అనేక విమర్శలు వచ్చాయి. వాటన్నింటినీ సరిచేస్తూ కూటమి ప్రభుత్వం ప్రైవేటు మద్యం దుకాణాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Written By: Dharma, Updated On : October 16, 2024 12:22 pm

AP Liquor Policy Guidelines

Follow us on

AP Liquor Policy Guidelines : ఏపీవ్యాప్తంగా ఈరోజు కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 3396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీ ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో లాటరీలో షాపులు దక్కించుకున్న వారు.. దుకాణాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.కొన్ని ప్రాంతాల్లో అప్పుడే మద్యం దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి. కొత్త షాపులకు సంబంధించి నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. అన్ని ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో.. ధరల విషయంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. క్వార్టర్ మద్యం కనిష్ట ధరను 99 రూపాయలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ధరలతో పాటు దుకాణాల సమయాలను సైతం ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. నూతన మద్యం పాలసీ అమల్లోకి రావడంతో.. వైసిపి ప్రవేశపెట్టిన ప్రభుత్వ మద్యం దుకాణాలు మూతపడ్డాయి. కొత్త మద్యం పాలసీలో భాగంగా ప్రైవేటు మద్యం దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి. రెండేళ్ల కాల పరిమితితో ఈ షాపులు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసిన మద్యం వ్యాపారులు షాపులను ప్రారంభించారు. మిగతావారు ఒకటి రెండు రోజుల్లో ప్రారంభించేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు నిర్వహించుకోవచ్చు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ధరల విషయంలో ప్రభుత్వం ట్విస్ట్ ఇచ్చింది. తాజాగా మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం అమ్మకాలపై రెండు శాతం సెస్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇలా వచ్చిన మొత్తంతో డ్రగ్స్ నిరోధానికి ఉపయోగించాలని డిసైడ్ అయ్యింది.

* ప్రివిలేజ్ ఫీజు వసూలు
బాటిల్ ఎమ్మార్పీ ధర రూ. 150.50 గా ఉంటే.. దానిని 160 రూపాయలకు వసూలు చేయాలని నిర్ణయించింది. దీనినే ప్రివిలేజ్ ఫీజు అంటారు.క్వార్టర్ బాటిల్ ధర రూ. 90.50గా ఉంటే దాని ధర 100 రూపాయలు కానుంది. ఇప్పటికే క్వార్టర్ కనిష్ట ధర 99 రూపాయలుగా నిర్ణయించడంతో.. వంద రూపాయల ధర ఉన్న బాటిల్ ను రూపాయి తగ్గించి అందించనున్నారు. అయితే ఐదేళ్ల తరువాత అన్ని రకాల ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి రానుండడంతో మందుబాబులు ఖుషి అవుతున్నారు.

* రోజుకు 12 గంటల పాటు విక్రయాలు
ఉదయం 10 గంటల నుంచి షాపులు అందుబాటులోకి రానున్నాయి. రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు సాగనున్నాయి. అంటే రోజులో 12 గంటల పాటు మద్యం అమ్మకాలు చేయనున్నారు అన్నమాట. గతంలో వైసిపి ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచేటప్పుడు రకరకాల సమయాలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు ప్రైవేటు మద్యం దుకాణాలు కావడంతో వీలైనంత విక్రయాలు పెంచేలా ఈ సమయం కేటాయించారు. అయితే దుకాణాల నిర్వహణకు సంబంధించి ప్రజల నుంచి అభ్యంతరాలు కూడా స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు అభ్యంతరాలు ఉంటే ఆ షాపును వేరే ప్రాంతాలకు తరలించేందుకు ఉన్న మార్గాన్ని సైతం ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.