https://oktelugu.com/

Prisoners: యూపీ జైలులో కలకలం.. 47 మంది ఖైదీలకు ఎయిడ్స్

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏడు సంవత్సరాల నుంచి ఉత్తరప్రదేశ్ కారాగారాలల్లో ఖైదీలు పెరిగిపోతున్నారు.. వ్యవస్థీకృత నేరాలపై అక్కడి ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో నేరగాళ్లు జైలుకు వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 5, 2024 / 11:51 AM IST
    Follow us on

    Prisoners: బయట సమాజంలో ఉన్నన్ని రోజులు అనేక నేరాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించారు. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టారు. అప్పట్లో అధికారంలో ఉంది వాళ్ల అనుకూల పార్టీలు కాబట్టి చెల్లుబాటు అయిపోయింది. వాళ్ల అనుకూల పార్టీల శకం ముగిసిన తర్వాత బిజెపి ఆధ్వర్యంలో యోగి ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్ లో కొలువుదిరింది.. ఇంకేముంది అసలు సినిమా మొదలైంది. ఇన్ని రోజులపాటు రాష్ట్రం మీద పడి అకృత్యాలకు పాల్పడ్డ వారు ఒక్కసారిగా వణికిపోయారు. పోలీసు మార్క్ న్యాయంతో బెదిరిపోయారు.. యోగి ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో జైలు పాలయ్యారు. బతుకు జీవుడా అనుకుంటూ జైళ్లల్లో కాలం వెల్లదీస్తున్నప్పటికీ మాయదారి రోగం సోకడంతో బిక్కుబిక్కుమంటున్నారు..

    గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏడు సంవత్సరాల నుంచి ఉత్తరప్రదేశ్ కారాగారాలల్లో ఖైదీలు పెరిగిపోతున్నారు.. వ్యవస్థీకృత నేరాలపై అక్కడి ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో నేరగాళ్లు జైలుకు వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు. అయితే అక్కడ జైలులో కొంతమంది ఖైదీలకు ఎయిడ్స్ సోకింది.. అయితే మొన్నటిదాకా ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తపడిన పోలీసులు.. కోర్టు కేసులు వస్తాయని భయపడి తర్వాత వెల్లడించడం మొదలుపెట్టారు. మొదట్లో 36 మంది ఖైదీలకు మాత్రమే ఎయిడ్స్ సోకిందని పోలీస్ అధికారులు చెప్పగా.. ఇప్పుడు ఆ సంఖ్య 47 కు పెరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.. ఎయిడ్స్ సోకిన రోగులకు చికిత్సతో పాటు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

    లక్నో జైలులో గత ఏడాది డిసెంబర్లో ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఖైదీలనుంచి వైద్యులు రక్తనమునాలు స్వీకరించి పరీక్ష నిర్వహించగా 11 మంది ఖైదీలలో హెచ్ఐవి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జైలులోని ఖైదీలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో మరో 36 మంది ఖైదీల నుంచి రక్త నమునాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా వారిలోనూ పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని నిర్ధారణ అయింది.. దీంతో మొత్తం 47 మంది ఎయిడ్స్ బారిన పడ్డారని లక్నో జైలు అధికారులు చెబుతున్నారు. మొత్తం 47 మంది ఎయిడ్స్ ఖైదీలను లక్నో జైలు అధికారులు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేయించి చికిత్స అందిస్తున్నారు. వైద్యాధికారులతో వారికి కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. ఎయిడ్స్ సోకిన నేపథ్యంలో ఖైదీలకు బలమైన ఆహారం అందించడానికి వారి మెనూలో చాలా మార్పులు చేశారు. జైలులో ఉండే ఖైదీల్లో ఎయిడ్స్ లక్షణాలు వెలుగు చూడటం పట్ల అధికారులు అప్రమత్తమయ్యారు.. అంతేకాదు నిఘాను కూడా మరింత పెంచారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీయడంతో జైలు ఉన్నతాధికారులు విచారణ నిర్వహించి నివేదిక అందించనున్నారు.