https://oktelugu.com/

Farmer Protests: యూరప్ రైతుల ఆందోళన మన నేతలకు, మీడియాకు పట్టదా?

వాస్తవానికి యూరప్ రైతులు చేస్తున్న నిరసనలకు చాలా కారణాలు ఉన్నాయి.. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ దేశాన్ని కాపాడేందుకు.. ఆ దేశం నుంచి ఆహార ఉత్పత్తులను యూరప్ దేశాలు ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 5, 2024 / 11:57 AM IST
    Follow us on

    Farmer Protests: అప్పట్లో సాగు చట్టాలను కేంద్రం తీసుకొస్తే ఎటువంటి ఆందోళనలు ఢిల్లీలో జరిగాయి చూశాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ మీడియా, విదేశి మీడియా ఎలాంటి వార్తలు రాసిందో, కథనాలు ప్రసారం చేసిందో చూసాం.. ఆ తర్వాత మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రైతులకు క్షమాపణలు చెప్పి చట్టాలు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో విదేశీ మీడియా మన దేశం మీద ఎంత బురద చల్లాలో అంత చల్లింది. ఇక టిఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీల నాయకులు చేసిన యాగి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా రాకేష్ టికాయత్ తో ఆందోళనలు చేశారు. సరే ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో ముఖ్యంగా యూరప్ లో రైతులు ఆందోళన బాట పట్టారు. కొద్దిరోజులుగా అక్కడ ధర్నాలు చేస్తున్నారు. రోడ్ల మీదకు వచ్చి ట్రక్కులతో నిరసనలు చేపడుతున్నారు. గడ్డిమోపులను తెచ్చి కాల్చి వేస్తున్నారు. యూరోపియన్ పార్లమెంటు భవనం పైకి కోడిగుడ్లు, టమాటలు విసురుతూ తమ నిరసన తెలుపుతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ మన దేశం మీడియా దాని గురించి పట్టించుకోవడం లేదు. విదేశీ మీడియా ఎలాగూ రాయడం లేదు. సోషల్ మీడియా బలంగా ఉంది కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తోంది. సోషల్ మీడియానే లేకుంటే అసలు అక్కడ ఏం జరిగినా తెలిసేదే కాదు. అప్పట్లో మన దేశంలో ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ధర్నాలు చేసినప్పుడు మియా ఖలిఫా లాంటి పో** స్టార్ స్పందించింది. భారత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడింది. కానీ అదే యూరప్ లో జరుగుతుంటే మాత్రం నోరు మూసుకుంది.

    వాస్తవానికి యూరప్ రైతులు చేస్తున్న నిరసనలకు చాలా కారణాలు ఉన్నాయి.. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ దేశాన్ని కాపాడేందుకు.. ఆ దేశం నుంచి ఆహార ఉత్పత్తులను యూరప్ దేశాలు ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. అమెరికా దేశాల నుంచి మాంసం ఉత్పత్తులను, ఇతర ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నాయి. ఇవి స్థానికంగా ఉన్న యూరప్ దేశాల రైతుల పుట్టి ముంచుతున్నాయి. దిగుమతులు పెరగడంతో స్థానికంగా ఉన్న ఉత్పత్తులకు ఆదరణ లభించడం లేదు. దీంతోపాటు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు వ్యవసాయ భూమిలో నాలుగో వంతు ఖాళీగా ఉంచాలని, రసాయన ఎరువుల వినియోగం 20 శాతం తగ్గించాలని అక్కడి ప్రభుత్వాలు నిర్ణయించడం రైతుల పాలిట శరాఘాతంగా మారింది. అంతేకాదు పంట ఉత్పత్తులకు సరైన ధరలు చెల్లించకపోవడంతో అక్కడి రైతులు ఆందోళన బాట పట్టారు.. ఇతర దేశాల నుంచి దిగుమతులను తగ్గించాలని ప్రభుత్వాలను కోరుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ఇది అక్కడి రైతుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది.

    గత కొద్ది సంవత్సరాల నుంచి యూరోపియన్ దేశాలలో వాతావరణ పరిస్థితులు అంతగా అనుకూలంగా ఉండటం లేదు. వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో అక్కడ వ్యవసాయం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.. దీనికి తోడు పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం అమాంతం పెంచడం, వ్యవసాయంలో వినియోగించే పెట్రోల్, డీజిల్ పై సబ్సిడీ ఎత్తేయడం వంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవడంతో రైతులకు తీవ్ర ఇబ్బందిగా మారుతుంది. ఈ నిర్ణయాలు పూర్తిగా మార్చుకోవాలని.. వ్యవసాయాన్ని కాపాడాలని రైతులు కోరుతున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అక్కడి రైతులు విసిగి వేసారి నిరసనబాట పట్టారు. ఫ్యాషన్ రాజధాని పారీస్ లో వేలాది ట్రక్కులతో నిరసన చేపట్టారు. రహదారిపై గడ్డిమోపులను కాల్చి నినాదాలు చేశారు. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ భవనం పై కోడిగుడ్లు రువ్వారు. ప్రభుత్వ అధినేతలు దిగిరాకపోతే యూరోపియన్ యూనియన్ మొత్తాన్ని స్తంభింప చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే అక్కడ పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ విదేశీ మీడియా ఏమాత్రం వార్తలు రాయడం లేదు. ఇక మొన్నటి దాకా మనదేశంలో ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ధర్నా చేస్తే గొంతు చించుకొని అరిచిన ఇక్కడ మీడియా, సామాజిక కార్యకర్తలు యూరోపియన్ యూనియన్ లో రైతులు చేస్తున్న ధర్నాలపై నోరు మెదపకపోవడం విశేషం.