Bihar: కాంచన సినిమా చూశారా..ఓ ట్రాన్స్ జెండర్ పెంచుకున్న కుమార్తె (ఆమె కూడా ఓ ట్రాన్స్ జెండర్) కష్టపడి చదివి డాక్టర్ అవుతుంది. తోటి వాళ్ళు ఎలాంటి మాటలన్నా, ఎలా ఈసడించుకున్నా లెక్కచేయకుండా ధైర్యంగా ముందుకు వెళుతుంది. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుంది. కానీ నిజ జీవితంలో ఇలా జరుగుతుందా? ఈ ప్రశ్నకు జరుగుతుంది అని సమాధానం చెప్పారు ఈ ట్రాన్స్ జెండర్లు.
ఆడకు, మగకు ఈ సమాజం ఇచ్చే విలువ.. వారికి ఇవ్వదు. జన్యుపరమైన లోపం, ఇతర కారణాలవల్ల కొంతమంది ట్రాన్స్ జెండర్ లు మారతారు. అయితే వారిని చాలామంది చులకనగా చూస్తారు. వారు కనిపిస్తే చాలు వెకిలి చేష్టలకు పాల్పడతారు. సూటి పోటీ మాటలు అంటారు. అలాంటి పరిస్థితులను ఎదిరించి.. ఓ ముగ్గురు ట్రాన్స్ జెండర్ లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.. చీత్కరించుకున్న సమాజంతోనే సెల్యూట్ కొట్టించుకోబోతున్నారు..
బీహార్ పోలీస్ సర్వీస్ కమిషన్ ఇటీవల పోలీస్ సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష, శరీర దారుఢ్య పరీక్షల నిర్వహించిన తర్వాత.. అందులో వచ్చిన ఫలితాల ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలను ప్రకటించింది. ఈ రిక్రూట్మెంట్లో 1,275 మంది పోలీసు ఉద్యోగాలకు అర్హత సాధించారు. అయితే ఇందులో ముగ్గురు ట్రాన్స్ జెండర్ లు ఎస్సైలుగా ఎంపిక చరిత్ర సృష్టించారు. వీరిలో ఇద్దరు ట్రాన్స్ మెన్ పుట్టుకలో ఆడ కాగా, ఒకరు ట్రాన్స్ ఉమెన్, మరొకరు పుట్టుకలో మగ.. వీరు ముగ్గురు కష్టపడి చదివారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విధించిన పరీక్షలను విజయవంతంగా పాస్ అయ్యారు. టాప్ మార్కులు సాధించడంతో ఎస్సై పోస్టులకు ఎంపికయ్యారు. ట్రాన్స్ జెండర్లు అయినప్పటికీ వీరిని సాధారణ పోలీసులు లాగానే తాము గౌరవిస్తామని నియామక బోర్డు ప్రకటించింది.
ఈ ముగ్గురు ట్రాన్స్ జెండర్ లు పోలీసు ఉద్యోగుల కోసం శిక్షణ తీసుకుంటున్నప్పుడు తోటి ఉద్యోగార్థులు హేళనగా మాట్లాడే వారట. చులకనగా చూసేవారట. సూటి పోటి మాటలు అనేవారట. కన్నీళ్లను దిగమింగుకుంటూ.. కష్టాలను ఎదుర్కొంటూ తాము చదివామని.. అనేక పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొన్నామని.. చివరికి ఉద్యోగాలు సాధించామని ఆ ముగ్గురు ట్రాన్స్ జెండర్ లు చెబుతున్నారు.