Homeఆంధ్రప్రదేశ్‌MPDO Missing Case: వీడని ఎంపీడీవో మిస్సింగ్ మిస్టరీ.. డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం.. రంగంలోకి...

MPDO Missing Case: వీడని ఎంపీడీవో మిస్సింగ్ మిస్టరీ.. డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం.. రంగంలోకి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు

MPDO Missing Case: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో మండవ వెంకటరమణారావు మిస్సింగ్ మిస్టరీగా మారింది.’ఈరోజు నా పుట్టినరోజు. నేను చనిపోయే రోజు కూడా’.. అంటూ ఆయన కుటుంబ సభ్యులకు మెసేజ్ పంపి ఎంపీడీవో అదృశ్యమయ్యారు. గత కొద్ది రోజులుగా వెంకటరమణారావు నరసాపురం ఎంపీడీవో గా పని చేస్తున్నారు. విజయవాడ సమీపంలోని కానూరు మహాదేవపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయన సెలవు రోజుల్లో మాత్రమే విజయవాడలో ఇంటికి వస్తుంటారు. వెంకటరమణారావు ఈనెల 10 నుంచి 20 వరకు సెలవు పెట్టారు. నరసాపురం నుంచి కానూరుకు వచ్చారు. ఈనెల 15న మచిలీపట్నంలో పని ఉందంటూ కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లారు. అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను మచిలీపట్నంలో ఉన్నానని.. ఇంటికి రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పారు. అటు తరువాత ఆయన ఆచూకీ లేకుండా పోయింది. మొబైల్ కూడా పనిచేయలేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత భార్యకు ఆ మెసేజ్ పంపారు. నా పుట్టినరోజు అయిన 16వ తేదీ నేను చనిపోయిన రోజు కూడా. అందరూ జాగ్రత్త అంటూ ఆ మెసేజ్ లో ఉంది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు రంగంలోకి దిగారు. సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ఆయన వాహనాన్ని మచిలీపట్నం రైల్వే స్టేషన్ దగ్గర గుర్తించారు. ఆయన మొబైల్ సిగ్నల్స్ చివరిగా ఏలూరు దగ్గర కాలువ సమీపంలో ఆగిపోయినట్లు గుర్తించారు. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలు పెరిగాయి. ఆయన మిస్సింగ్ మిస్టరీగా మారింది. ముఖ్యంగా రేవు పాటల విషయంలోనే కొద్దిరోజులుగా ఒత్తిడి పెరగడంతోనే ఆయన ఇలా చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఏలూరు కాలువలో ఆయన ఆచూకీ కోసం వెతుకుతున్నాయి.

ఎంపీడీవో అదృశ్యానికి సంబంధించి మాజీ విప్ ప్రసాద్ రాజు పేరు బయటకు వచ్చింది. ఆయనతో పాటు అనుచరులు బెదిరింపులు వల్లే ఎంపీడీవో మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. బోటింగ్ కాంట్రాక్టర్ 55 లక్షల రూపాయల బకాయి కట్టమంటే బెదిరిస్తున్నాడని.. అందుకే సూసైడ్ చేసుకున్నట్లు ఎంపీడీవో లేఖ రాసినట్లు తెలుస్తోంది. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ మధురానగర్ రైల్వే స్టేషన్ వైపు సిగ్నల్ చివరిగా కట్ అయినట్లు గుర్తించారు. ఏలూరు కాల్వలోకి దూకి ఎంపీడీవో సూసైడ్ చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తిస్థాయిలో ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఎంపీడీవో అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ఎంపీడీవో కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై ఆరా తీశారు. నరసాపురం చెర్రీ బకాయిలు అందించాలని అధికారులకు పవన్ ఆదేశించారు. ఫెర్రీ బకాయిల వివరాలు, మొండి బకాయి దారుల వివరాలను తక్షణమే అందించాలని కోరారు.ఒక అధికారి అదృశ్యమయ్యే పరిస్థితికి కారుకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించాలని పవన్ ఆదేశించారు. కాగా ఈ ఘటన అధికార వర్గాల్లో ఒక రకమైన ఆందోళన నింపుతోంది. పాలనాపరమైన అంశాల్లో రాజకీయ జోక్యాన్ని నియంత్రించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

అయితే ఈ ఘటన వెనుక వైసిపి నేతల హస్తం ఉందని తేలడంతో ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా ప్రభుత్వ మాజీ విప్ ప్రసాదరాజు పేరు వినిపిస్తుండడంతో.. ఈ కేసు మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular