సుకుమా ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు కూడా మృతి!

ఛత్తీస్ ఘర్ లోని సుకుమా జిల్లా దండకారణ్యంలో గత శనివారం మావోయిస్టు లతో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 17 మంది పోలీస్ దళాలతో పాటు, ముగ్గురు మావోయిస్టులు కూడా మృతి చెందిన్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాము పోలీసుల నుండి స్వాధీనం చేసుకున్న ఆయుధాల ఫొటోలతో పాటు మావోయిస్టులు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ విషయమై వెల్లడైనది. ఈ పోరులో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన్నట్లు దక్షిణ సబ్ జోనల్ దండకారణ్య విభాగం పేరుతో […]

Written By: Neelambaram, Updated On : March 26, 2020 1:03 pm
Follow us on

ఛత్తీస్ ఘర్ లోని సుకుమా జిల్లా దండకారణ్యంలో గత శనివారం మావోయిస్టు లతో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 17 మంది పోలీస్ దళాలతో పాటు, ముగ్గురు మావోయిస్టులు కూడా మృతి చెందిన్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాము పోలీసుల నుండి స్వాధీనం చేసుకున్న ఆయుధాల ఫొటోలతో పాటు మావోయిస్టులు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ విషయమై వెల్లడైనది.

ఈ పోరులో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన్నట్లు దక్షిణ సబ్ జోనల్ దండకారణ్య విభాగం పేరుతో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. వారి పేర్లు కోవసి సక్రు, కొట్టం రాజేష్, కరాటం సుక్కు గా తెలుపుతూ, వారికి తామే అంత్యక్రియలు జరిపినట్లు వెల్లడించారు.

ఇలా ఉండగా, ఈ ప్రకటనలో తాము 19 మంది పోలీసులను చంపమని, మరో 20 మంది గాయపడ్డారని తెలిపారు. కానీ ఈ ప్రకటనతో పాటు విడుదల చేసిన ఆడియా క్లిప్ లో మావోయిస్టు అధికార ప్రతినిధి వికల్ప్ మాత్రం 17 మంది పోలీసులు చనిపోయారని, 15 మంది గాయపడ్డారని మాత్రమే పేర్కొన్నారు.

పోలీసుల కధనం ప్రకారం 17 మంది మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. ఈ రెండు ప్రకటనలు భిన్నంగా ఉండడం విస్మయం కలిగిస్తున్నది.

కాగా, మృతి చెందిన 17 మంది పోలీసులతో 13 మంది స్థానిక గిరిజనులు, సుక్మా జిల్లావారు కావడమే కాకుండా, వారంతా మాజీ మావోయిస్టులే కావడం గమనార్హం. గతంలో పోలీసులకు లొంగిపోవడంతో ప్రభుత్వం వారికి పునరావాస కార్యక్రమం క్రింద పోలీస్ దళాలతో చేర్చుకున్నవారే.

మరోవంక ఈ ఎన్‌కౌంటర్‌లో ఇంతటి భారీ నష్టం జరగడం వ్యూహాత్మక లోపమా, సమానవ్యయ లోపమా అని సీనియర్ పోలీస్ అధికారులు తలలు పెట్టుకొంటున్నారు. ప్రతీకారంగా పెద్ద ఎత్తున మావోయిస్టులపై తెగబడడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. భద్రతా బలగాల్లో విశ్వాసం పెంచడానికి, మావోయిస్టులను గట్టి దెబ్బ తియ్యడానికీ కేంద్రంతో సహా సరిహద్దు రాష్ట్రాల ఉన్నతాధికార్లు వ్యూహం పన్నుతున్నట్లు చెబుతున్నారు.

ఎల్మాగుండలో మావోయిస్టులు సంచరిస్తున్నారని, అదేవిధంగా చత్తీస్‌గఢ్‌-తెలంగాణా రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టు అగ్ర నేతల మధ్య సమావేశాలు జరుగుతున్నాయని నిఘా వర్గాల సమాచారం మేరకు దళాలను పంపించారు. అయితే అక్కడెవరూ కనిపించక పోవడంతో తిరిగి వస్తున్న వారు తమను వారు దిగ్బంధనం కావించే అవకాశం గురించి అనుమానించి, తగు జాగ్రత్త పడలేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పైగా, తిరిగి వచ్చే సమయంలో రెండు బృందాలుగా విడిపోయారు. వారి మధ్య తగు సమాచారం లోపించడంతోనే ఈ అనర్ధం జరిగిన్నట్లు స్పష్టం అవుతున్నది. మంచి సామర్ధ్యం గల సుమారు వందమందితోగల డిఆర్‌జి బృందానికి మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకొని భద్రతా దళ భటులు ప్రాణాలు కోల్పోతున్నా మరో దారిలో వెళ్తున్న పెద్ద బృందం (సుమారు 400 మంది) నుండి డిఆర్‌జి వారికి మద్దతు లభించిన దాఖలాల్లేవు.

నిజానికి స్థానిక (డిఆర్‌జి) దళాలతో పోల్చితే ఎస్‌టిఎఫ్‌, కోబ్రా దళాలు శక్తివంతమైనవి. వారి ఆయుధ సంపత్తి, శిక్షణ, సామర్ధ్యమూ ఎక్కువే. అయినా వారందరూ బేస్‌ క్యాంప్‌నకు చేరిపోయారేతప్ప తమ సహచర దళం సమాచారం తెలుసుకోలేకపోవడం వ్యూహాత్మక వైఫల్యాన్ని వెల్లడి చేస్తున్నది.