Grand Statue Of Netaji: కొమ్మ చెక్కితే బొమ్మ అవుతుంది. కొలిచి మొక్కితే అమ్మ అవుతుంది. భూ పొరల్లో దాగి ఉన్న రాయిని తవ్వి తీస్తే కృష్ణ శిల అవుతుంది. ఒడుపుగా చెక్కితే ప్రతిమ అవుతుంది. అలాంటి రాయే శిల్పుల చేతిలో అనేక ఉలి దెబ్బలు తిని నేతాజీ ప్రతిమ అయింది. ఢిల్లీలోని కర్తవ్య్ పథ్ లో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం అయింది. ఢిల్లీలో కర్తవ్య్ పథ్ లో ఏర్పాటు చేసిన 28 అడుగుల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహా తయారీకి ఉపయోగించిన బ్లాక్ గ్రానైట్ రాయి ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లి క్వారీ నుంచి టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర ఉచితంగా అందజేశారు. 280 మెట్రిక్ టన్నుల బరువు, 32 అడుగుల పొడవు, 11 అడుగుల ఎత్తు, 8.5 అడుగుల వెడల్పు ఉన్న రాయిని, 100 అడుగుల పొడవైన ట్రక్కు ద్వారా తరలించారు. గత ఏడాది ఢిల్లీలోని జాతీయ పోలీస్ అకాడమీలో నెలకొల్పిన అమర జవాన్ల స్మారక స్తూపానికి బ్లాక్ గ్రానైట్ ఏకశిలను వద్ది రాజు రవిచంద్ర ఉచితంగా అందించారు. దానిని నేలకొండపల్లి మండలం చెర్వుమాదారం క్వారీ నుంచి తరలించారు. ఆ స్థూపాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదే ఆవిష్కరించారు. ఖమ్మం జిల్లా నుంచి రవాణా అవుతున్న బ్లాక్ గ్రానైట్ ను దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం ప్రముఖుల విగ్రహాలకు, స్తూపాల తయారీకి వినియోగిస్తున్నారు.

చాలా జాగ్రత్తలు తీసుకున్నారు
ఢిల్లీలో కర్తవ్య్ పథ్ లో ఏర్పాటు చేసిన నేతాజీ విగ్రహ తయారీకి కావలసిన కృష్ణ శిల గ్రానైట్ ను మేడిదపల్లి క్వారీ నుంచి తరలించేందుకు చాలా జాగ్రత్తలే తీసుకున్నారు. దీని కోసమే ప్రత్యేకంగా భారీ ట్రక్కు తయారు చేశారు. వాహనం నడిచేందుకు వీలుగా పలు చోట్ల రహదారిని వెడల్పు చేశారు. హైవే ల మీద ఉన్న టోల్ ప్లాజా లను తాత్కాలికంగా తొలగించారు. అంతేకాకుండా క్వారీ నుంచి గ్రానైట్ శిలను తీసుకొచ్చేందుకు హైవే వరకు రోడ్డు నిర్మించారు.
Also Read: Vijay Sai Reddy: విజయసాయి ట్విట్లు బంద్… లిక్కర్ స్కామ్ పై టెన్షన్ టెన్షన్
ట్రక్కు మలుపులు తిరిగేందుకు పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు. అనుభవం ఉన్న నలుగురు డ్రైవర్లు విడతల వారీగా ఈ ట్రక్కు నడిపారు. ఖమ్మం నుంచి మే 22న బయలు దేరిన ట్రక్కు జూన్ 2 న ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ కు చేరుకుంది. రాయిని రవాణా చేసేందుకు మొత్తం 12 రోజులు పట్టింది. ట్రక్కు 5 రాష్ట్రాల మీదుగా మొత్తం 1,665 కిలోమీటర్లు దూరం ప్రయాణించింది. ఎండాకాలం కావడంతో, పైగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల గురించి నమోదు కావడంతో 42 సార్లు ట్రక్కు టైర్లు పేలిపోయాయి. ఢిల్లీలోనే ఎన్జీఎంఏ గేట్లు చిన్నవి కావడంతో ట్రక్కును పలు భాగాలుగా విడదీసి గ్రానైట్ రాయిని లోపలికి దింపారు.

26 వేల గంటలు శ్రమించారు
కర్తవ్య్ పథ్ లో అమర్చిన కృష్ణ శిలను నేతాజీ విగ్రహంగా తీర్చి దిద్దేందుకు అరుణ్ యోగీ రాజ్ ఆధ్వర్యంలో శిల్పుల బృందం 26 వేల గంటల పాటు శ్రమించింది. ఆధునిక యంత్రాలతో సంప్రదాయ భారతీయ పద్ధతిలో నేతాజీ విగ్రహాన్ని చెక్కారు. శిల్పుల బృందం లో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ కు చెందిన వెంకట్ కూడా ఉన్నారు. కాగా నేతాజీ విగ్రహానికి టీఆర్ఎస్ నాయకుడు కృష్ణ శిలను ఉచితంగా ఇవ్వడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది.
[…] […]