
ఐక్యరాజ్య సమితి దేశ పేద ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో రికార్డు స్థాయిలో పేదరికం తగ్గిందని ఐరాస తన నివేదికలో తెలిపింది. 2005-06 నుంచి 2015-16 మధ్యన 27.3 కోట్ల మంది అనేకరకాలుగా పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొంది. ఈ విభాగం నుంచి భారీసంఖ్యలో జనభా బయటపడిందని వెల్లడించింది.
ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ), ఆక్స్‌ఫర్డ్ పేదరికం, మానవ అభివృద్ధి కార్యక్రమం (ఓపీహెచ్‌ఐ) ఈ నివేదికను విడుదల చేశాయి. 75 దేశాలను అధ్యయనం చేయగా 65 దేశాల్లో 2000-2019 మధ్య పేదరికం తగ్గిందని వెల్లడించాయి. ఆరోగ్యం, విద్య, జీవనం, మెరుగైన ఉపాధి ప్రమాణాలు కొరవడటం, హింస, వారు నివసిస్తున్న ప్రాంతాల్లో ప్రమాదకర వాతావరణం వంటి అంశాలను పేదరికం కొలిచేందుకు ప్రమాణాలుగా తీసుకున్నారు.
పదేళ్ల కాలంలో భారత్‌లో ఏకంగా 27.3 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని వెల్లడించింది. ఆర్మేనియా, భారత్, నికరగ్వా, ఉత్తర మాసిడోనియా దేశాలు అంతర్జాతీయంగా పేదరికం సూచీ విలువను ఐదు నుంచి పదేళ్ల కాలంలో తగ్గించుకున్నాయని తెలిపింది. ప్రపంచ జనాభాలో ఐదోవంతు ఈ నాలుగు దేశాల్లోనే ఉందని పేర్కొంది. బంగ్లాదేశ్, బొలీవియా, గాబన్, గాంబియా, గయానా, లైబీరియా, మాలి, మొజాంబిక్, నైగర్, నేపాల్, రువాండ దేశాల్లోనూ పేదరికం తగ్గిందని నివేదిక తెలిపింది.
అభివృద్ధి చెందుతున్న 107 దేశాల్లో 130 కోట్ల మంది అంటే 22% మంది ఇప్పటికీ పేదరికంలోనే ఉన్నారని వెల్లడించింది. పేదరికం ప్రభావం ఎక్కువగా చిన్నారుల పైనే ఉంటోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ 130 కోట్ల పేదల్లో సగం మందికి ఇంకా 18 ఏళ్లు నిండలేదు. 10.7 కోట్ల మంది వయసు 60 దాటింది. కొవిడ్ సమయంలో వీరంతా ప్రమాదంలో ఉన్నట్టే! ఇక పేదల్లో 84.3% సబ్ సహారన్ ఆఫ్రికా ప్రాంతంలోనే ఉన్నారు. పది దేశాల్లో 60% మంది చిన్నారులకు వ్యాక్సినేషన్ జరగలేదు. నైజీరియా, భారత్, పాకిస్థాన్, ఇండోనేసియాలో 40% మంది చిన్నారులకు డీటీపీ3 వ్యాక్సిన్ వేయలేదు.