దేశంలో విమాన ప్రయాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అనంతరం కరోనా వైరస్ విజృంభిస్తోంది. నాలుగురోజుల్లో దేశీయ విమానాల్లో ప్రయాణించిన 23 మంది ప్రయాణికులకు కరోనా వైరస్ సోకడం సంచలనం రేపింది. లాక్ డౌన్ వల్ల రెండునెలల అనంతరం దేశీయ విమాన సర్వీసులకు పౌరవిమానయాన శాఖ పచ్చజెండా ఊపింది. ఈ నెల 25 నుంచి 28వతేదీ వరకు కేవలం నాలుగురోజుల్లోనే పలు విమానాల్లో ప్రయాణించిన 23 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో కలవరం మొదలైంది. కరోనా వచ్చిన విమాన ప్రయాణికులను ఆసుపత్రుల్లోని క్వారంటైన్ కు తరలించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు ప్రయాణించిన విమానాల్లో ప్రయాణించిన ప్రయాణికులు, విమాన సిబ్బందిని గుర్తించి వారికి కరోనా పరీక్షలు చేయించారు. వారందరినీ ముందు జాగ్రత్తగా హోం క్వారంటైన్ చేశారు. విమానాల్లో కరోనా బాధితులు వెలుగుచూడటంతో పౌరవిమానయాన శాఖ అధికారులు మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భౌతిక దూరం పాటించడం, ఫేస్ మాస్క్ లు, ఫేస్ షీల్డులు ధరించడం, విమానాలను శానిటైజ్ చేసే పనులు చేపట్టారు.