https://oktelugu.com/

బ్యాంకులకు పెను శాపంలా ఉద్దీపనల ప్యాకేజీ

కరోనా లాక్ డౌన్ కారణంగా కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనల ప్యాకేజీ బ్యాంకులకు పెను శాపంలా పరిణమించే అవకాశంఉన్నట్లు బ్యాంకింగ్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపు రూ.21 లక్షల కోట్లతో కూడిన ఈ ప్యాకేజీలో బ్యాంకుల నుంచి వివిధ రంగాలకు బలవంతంగా ఇప్పించే రుణాలు అధికంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. ఇలాంటి బలవంతపు రుణాల వల్ల బ్యాంకుల ఆస్తుల నాణ్యత మరింత క్షీణించడం ఖాయమని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 29, 2020 / 10:50 AM IST
    Follow us on


    కరోనా లాక్ డౌన్ కారణంగా కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనల ప్యాకేజీ బ్యాంకులకు పెను శాపంలా పరిణమించే అవకాశంఉన్నట్లు బ్యాంకింగ్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపు రూ.21 లక్షల కోట్లతో కూడిన ఈ ప్యాకేజీలో బ్యాంకుల నుంచి వివిధ రంగాలకు బలవంతంగా ఇప్పించే రుణాలు అధికంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంటున్నారు.

    ఇలాంటి బలవంతపు రుణాల వల్ల బ్యాంకుల ఆస్తుల నాణ్యత మరింత క్షీణించడం ఖాయమని అంతర్జాతీయ రేటింగ్స్‌ సంస్థ ‘ఫిచ్‌’ వారించింది. దీని ఫలితంగా రానున్న రెండేండ్లలో బ్యాంకుల మొండి బకాయిలు లేదా నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 200 నుంచి 600 బేసిస్‌ పాయింట్ల (6 శాతం) మేరకు పెరుగవచ్చని తాజా నివేదికలో ‘ఫిచ్‌’ హెచ్చరించింది.

    కేంద్ర ప్రభుత్వం తన ఉద్దీపన చర్యల్లో భాగంగా బ్యాంకులకు రుణ పరిమితుల విషయంలో అనేక సడలింపులు ఇవ్వడంతోపాటు సమస్యాత్మక రుణాల గుర్తింపునకు ఇంతకుముందు 90 రోజులుగా ఉన్న మారటోరియంను 180 రోజులకు పొడిగించిన విషయం తెలిసిందే. ఇలాంటి చర్యలతో బ్యాంకులపై తీవ్రమైన భారం పడుతుందని, ప్రధానంగా ఇప్పటికే బ్యాలెన్స్‌ షీట్లు బలహీనంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులకు అధిక నష్టం వాటిల్లుతుందని ‘ఫిచ్‌’ పేర్కొన్నది.

    మోదీ సర్కార్‌ ప్రకటించిన ఉద్దీపన చర్యల వల్ల సమస్యాత్మక రుణాల గుర్తింపు ప్రక్రియ జాప్యమవుతుందని, బ్యాంకుల నుంచి బలవంతంగా రుణాలను ఇప్పించడమంటే వాటి బ్యాలెన్స్‌ షీట్లను కుంగదీయడమే అవుతుందని తెలిపింది. ముఖ్యంగా మొండి బకాయిలు గణనీయంగా పేరుకుపోయిన ఐడీబీఐ లాంటి బ్యాంకులు కుదేలవుతాయని ‘ఫిచ్‌’ స్పష్టం చేసింది.

    దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కొవిడ్‌-19 కేసుల సంఖ్య అదుపులోకి వచ్చేవరకు వస్తు వినిమయ డిమాండ్‌, ఉత్పత్తి పెరుగకపోవచ్చని, దీని వల్ల అనేక రంగాలు నష్టపోయే అవకాశమున్నదని ‘ఫిచ్‌’ తెలిపింది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎక్కువ నష్టం జరుగుతుందని, నిరుద్యోగ సమస్య గణనీయంగా పెరుగుతుందని ‘ఫిచ్‌’ అభిప్రాయపడింది.

    ప్రభుత్వరంగ బ్యాంకులకు త్వరలో కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులను సమకూర్చనున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఈ బ్యాంకుల మొండి బకాయిలు రెట్టింపు అవుతాయన్న భయాందోళనలే ఇందుకు కారణమని ప్రభుత్వ, బ్యాంకింగ్‌ రంగానికి చెందిన అధికారులు వెల్లడించారు.