టీఆర్ఎస్ ప్ర‌స్థానానికి 20 ఏళ్లు!

‘‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై.. ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్.. ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధ్రుత్యున్నతోత్సాహులై.. ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్’’ దీని అర్థం.. ‘‘క‌ష్టాలకు భ‌య‌ప‌డే నీచులు.. అస‌లు ప‌నులే మొద‌లు పెట్ట‌రు. కొందరు ప్రారంభించినా.. ఇబ్బందులు వ‌స్తే.. వ‌దిలేసి పోతారు. ధీరులు మాత్రం ఎన్ని క‌ష్ట‌న‌ష్టాలు ఎదురైనా.. మొద‌లు పెట్టిన ప‌ని విజ‌యవంతంగా పూర్తిచేస్తారు’’ అని. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించిన కేసీఆర్.. దాదాపుగా ప్రతీ సభలోనూ చెప్పిన […]

Written By: NARESH, Updated On : April 27, 2021 11:19 am
Follow us on

‘‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై..
ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్..
ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధ్రుత్యున్నతోత్సాహులై..
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్’’

దీని అర్థం.. ‘‘క‌ష్టాలకు భ‌య‌ప‌డే నీచులు.. అస‌లు ప‌నులే మొద‌లు పెట్ట‌రు. కొందరు ప్రారంభించినా.. ఇబ్బందులు వ‌స్తే.. వ‌దిలేసి పోతారు. ధీరులు మాత్రం ఎన్ని క‌ష్ట‌న‌ష్టాలు ఎదురైనా.. మొద‌లు పెట్టిన ప‌ని విజ‌యవంతంగా పూర్తిచేస్తారు’’ అని. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించిన కేసీఆర్.. దాదాపుగా ప్రతీ సభలోనూ చెప్పిన పద్యం ఇది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించే వరకూ ఈ తాత్ప‌ర్యాన్ని పార్టీ శ్రేణుల‌కు వివ‌రించారు. వారిలో నూత‌నోత్తేజాన్ని నింపారు. చివ‌ర‌కు.. మొద‌లు పెట్టిన కార్యాన్ని దిగ్విజ‌యంగా పూర్తిచేశారు.

టీఆర్ ఎస్ ఆవిర్భ‌వించి ఇవాళ్టికి స‌రిగ్గా 20 సంవ‌త్స‌రాలు. తెలుగుదేశం పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు.. ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సిద్ధాంత‌క‌ర్త‌గా తెలంగాణ రాష్ట్ర‌స‌మితిని ప్రారంభించారు. హైద‌రాబాద్ లోని జ‌ల‌దృశ్యంలో ఇదే రోజున పార్టీని ప్ర‌క‌టించారు. అప్ప‌టికి ఉమ్మ‌డి రాష్ట్రంలో అత్యంత ప‌టిష్టంగా ఉన్న తెలుగుదేశం, కాంగ్రెస్ ను ఢీకొట్ట‌డానికి సిద్ధ‌మ‌య్యారు.

అయితే.. ఏ సామాజిక‌ పోరాట‌మైనా శాశ్వ‌త ల‌క్ష్యాన్ని చేరుకోవాలంటే రాజ‌కీయ నిర్ణ‌యం జ‌రిగి తీరాల్సిందే. అందుకే.. ఇటు ప్ర‌జా ఉద్య‌మాల‌ను కొన‌సాగిస్తూనే.. అటు ఎన్నిక‌ల్లోనూ పోటీచేస్తూ వ‌చ్చింది టీఆర్ఎస్‌. పార్టీ ఏర్ప‌డిన తొలినాళ్ల‌లో కేసీఆర్ వెంట పెద్ద‌గా ఎవ్వ‌రూ లేర‌న్న‌ది వాస్త‌వం. కానీ.. ప్ర‌జ‌ల్లో గూడుక‌ట్టుకున్న ప్ర‌త్యేక రాష్ట్ర‌ ఆకాంక్ష‌ను త‌ట్టిలేప‌గ‌లిగారు. దీంతో.. ఒక్కొక్క‌రుగా టీఆర్ఎస్ వైపు క‌దిలి రాసాగారు. రాజ‌కీయంగా గులాబీ జెండా ప‌క్క‌న నిల‌బ‌డ‌లేనివారు.. త‌మ జెండా కింద‌నే నిల‌బ‌డి జై తెలంగాణ అని నిన‌దించాల్సిన ప‌రిస్థితిని కేసీఆర్ తెచ్చార‌న‌డం అతిశ‌యోక్తి కాదు.

ఉమ్మ‌డి రాష్ట్రంలో ద‌శాబ్దాలుగా తెలంగాణ‌కు జ‌రిగిన న‌ష్టం ఇదీ అంటూ.. లెక్క‌ల‌తో స‌హా వివ‌రించ‌డం మొద‌లు పెట్టారు. ప్ర‌ధానంగా.. నీళ్లు, నిధులు, నియామ‌కాల విష‌యంలో తెలంగాణ వివ‌క్ష‌ను ఎదుర్కొంద‌నే విష‌యాన్ని జ‌నాల్లోకి తీసుకెళ్ల‌గ‌లిగారు. కేసీఆర్ చెప్పిన విష‌యాల‌ను జ‌నం విశ్వ‌సించారు. ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపారు. టీఆర్ఎస్ వెంట క‌దిలి వ‌చ్చారు.

అప్ప‌టి వ‌ర‌కూ స్థానిక ఎన్నిక‌ల్లో కొన్ని ప్రాంతాల్లో స‌త్తాచాటిన టీఆర్ఎస్‌.. 2004లో ఏకంగా కాంగ్రెస్ పొత్తుకు పిలిచే స్థాయికి చేరింది. ఆ ఎన్నిక‌ల్లో.. ఏకంగా 26 అసెంబ్లీ, 5 పార్ల‌మెంట్ స్థానాల‌ను గెలుచుకొని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రించింది. కానీ.. తెలంగాణ ఆకాంక్ష‌ల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని ఆ పార్టీ ప్ర‌తినిధులు రాజీనామాలు చేశారు. అయితే.. ఆ త‌ర్వాత ముఖ్య‌మంత్రిగా రాజ‌శేఖ‌ర రెడ్డి వేసిన ఎత్తుల‌కు టీఆర్ఎస్ చాలా న‌ష్ట‌పోయింది. అయితే.. వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను మార్పులు సంభ‌వించాయి.

త‌న‌దైన వ్యూహాల‌తో మ‌ళ్లీ ఉద్య‌మాన్ని ప‌రుగులు పెట్టించారు కేసీఆర్‌. 2009లో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు దిగి.. చారిత్రక ప్ర‌క‌ట‌న‌కు బాట‌లు వేశారు. తెలంగాణ ఏర్పాటు ప్ర‌క్రియ‌ను మొద‌లు పెడ‌తామ‌ని డిసెంబ‌ర్ 9న కేంద్రం ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఆంధ్ర‌ప్రాంతంలో రాజీనాలు.. నిర్ణ‌యం వెన‌క్కి వంటి కార‌ణాల‌తో.. తెలంగాణ ఉద్యమం మ‌రింత బ‌ల‌ప‌డింద‌ని చెప్పొచ్చు. స‌క‌ల జ‌నులు రోజుల త‌ర‌బ‌డి ఉద్య‌మం కొనసాగించి.. చారిత్ర నిర్ణ‌యాన్ని తీసుకోవాల్సిన అనివార్య‌త యూపీఏ స‌ర్కారుకు క‌ల్పించారు.

2014 జూన్ 2న తెలంగాణ ప్ర‌జ‌ల సుదీర్ఘ స్వప్నం నెర‌వేరింది. తెలంగాణ ప్ర‌జ‌ల పోరాటం, యువ‌కుల బ‌లిదానాలు, టీఆర్ఎస్ రాజ‌కీయ పోరాటం క‌ల‌గ‌ల‌సి రాష్ట్రాన్ని సాధించుకున్నాయి. ఇప్ప‌టికి రెండు సార్లు టీఆర్ఎస్ కే ప‌ట్టం క‌ట్టారు తెలంగాణ ప్ర‌జ‌లు. బంగారు తెలంగాణే త‌మ ల‌క్ష్యం అంటూ ముందుకు సాగుతోంది గులాబీద‌ళం. అయితే.. ఈ మ‌ధ్య‌ ప‌లు అటు పోట్లు ఎదుర్కొంటోంది టీఆర్ఎస్‌. ఈ నేప‌థ్యంలో.. భ‌విష్య‌త్ వ్యూహాల‌ను ఎలా ర‌చిస్తుంద‌న్న‌దే కీల‌కం.