కార్గిల్ దివ‌స్ః భార‌త సేన‌ల విజ‌య‌బావుటా!

ఇప్పటి వ‌ర‌కు భార‌త్ – పాకిస్తాన్ మ‌ధ్య నాలుగుసార్లు యుద్ధం జ‌రిగింది. ఇందులో అత్యంత ప్ర‌ముఖంగా చెప్పుకునేది 1999లో జ‌రిగిన కార్గిల్ పోరు గురించి! స‌రిహ‌ద్దులు దాటి భార‌త భూభాగంలోకి వ‌చ్చిన పాకిస్తాన్ సైన్యంపై వీరోచిత పోరాటం సాగించి, శ‌త్రుమూక‌ల‌ను త‌రిమికొట్టిన సంద‌ర్భం అది. దాదాపు రెండున్న‌ర నెల‌ల‌పాటు సాగిన ఈ పోరాటంలో ఇరువైపులా క‌లిపి వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ శ‌త్రువుకు అవ‌కాశం ఇవ్వ‌కుండా పోరాటం చేసిన భార‌త సైన్యం.. విజ‌య‌గ‌ర్వంతో […]

Written By: Bhaskar, Updated On : July 26, 2021 3:54 pm
Follow us on

ఇప్పటి వ‌ర‌కు భార‌త్ – పాకిస్తాన్ మ‌ధ్య నాలుగుసార్లు యుద్ధం జ‌రిగింది. ఇందులో అత్యంత ప్ర‌ముఖంగా చెప్పుకునేది 1999లో జ‌రిగిన కార్గిల్ పోరు గురించి! స‌రిహ‌ద్దులు దాటి భార‌త భూభాగంలోకి వ‌చ్చిన పాకిస్తాన్ సైన్యంపై వీరోచిత పోరాటం సాగించి, శ‌త్రుమూక‌ల‌ను త‌రిమికొట్టిన సంద‌ర్భం అది. దాదాపు రెండున్న‌ర నెల‌ల‌పాటు సాగిన ఈ పోరాటంలో ఇరువైపులా క‌లిపి వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ శ‌త్రువుకు అవ‌కాశం ఇవ్వ‌కుండా పోరాటం చేసిన భార‌త సైన్యం.. విజ‌య‌గ‌ర్వంతో త్రివ‌ర్ణ ప‌తాకాన్ని రెప‌రెప‌లాడించింది. 1999 జూలై 26న కార్గిల్ యుద్ధంలో భార‌త్ గెలిచింద‌ని కేంద్రం అధికారికంగా ప్ర‌క‌టించింది. అప్ప‌టి నుంచి ప్ర‌తీ సంవ‌త్స‌రం కార్గిల్ వీరుల పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘కార్గిల్ విజ‌య దివ‌స్‌’ను నిర్వహిస్తుంటాం.

దేశ విభ‌జ‌న స‌మ‌యంలో జ‌రిగిన దారుణ ర‌క్త‌పాతానికి కొన‌సాగింపు అన్న‌ట్టుగా.. క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతూనే ఉంది పాకిస్తాన్‌. చొర‌బాట్లు, విధ్వంసాల‌కు కుట్ర‌ప‌న్న‌డం వంటివి ఎన్నో చేసిన పాకిస్తాన్‌.. ముఖాముఖి త‌ల‌ప‌డేందుకు సిద్ధ‌ప‌డింది. ఈ క్ర‌మంలో 1999లో మ‌రింత ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ప‌లుమార్లు కాల్పుల ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డ‌డం.. ఒక‌రిద్ద‌రు సైనికులు చ‌నిపోవ‌డం జ‌రుగుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే ఉద్రిక్తత‌లు తార‌స్థాయికి చేర‌డంతో ఫిబ్ర‌వ‌రిలో శాంతిచ‌ర్చ‌లు సాగాయి. పాకిస్తాన్ లోని లాహోర్ లో ఈ మేర‌కు శాంతి ఒప్పందం కూడా చేసుకున్నాయి రెండు దేశాలు.

ఈ ఒప్పందం ప్ర‌కారం.. జమ్మూక‌శ్మీర్ స‌మ‌స్య‌ను రెండు దేశాలూ దౌత్య‌ప‌రంగానే ప‌రిష్క‌రించుకోవాలి. శాంతియుతంగా ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌నుగొనాల‌ని నిర్ణ‌యించాయి. కానీ.. వెన‌క నుంచి చేయాల్సిన ప‌నులు చేస్తూ పోయింది పాక్‌. ‘ఆప‌రేష‌న్ బ‌ద‌ర్‌’ పేరుతో భారత భూభాగంలో అడుగు పెట్టి, ఆక్ర‌మించుకునే కుట్ర ప‌న్నింది. రెండు దేశాల స‌రిహ‌ద్దు వెంట భార‌త‌ సైనికులు త‌క్కువ‌గా ఉండే సియాచిన్ ప్రాంతాన్ని చొర‌బాటుకు వేదిక‌గా ఎంచుకుంది. సియాచిన్ మొత్తం మంచు ప్రాంతం. అక్క‌డ నిత్యం మైన‌స్ డిగ్రీల్లో ఉష్ణోగ్ర‌త ఉంటుంది. దీంతో.. రెండు దేశాలూ అక్క‌డ త‌క్కువ సైన్యాన్ని ఉంచుతాయి. దీంతో.. ఈ మార్గం ద్వారా భార‌త్ లోకి చొర‌బ‌డాల‌ని పాక్ ఎత్తువేసింది.

ఆ రోజు రానే వ‌చ్చింది. పాక్ మూక‌లు భార‌త్ లోకి చొర‌బ‌డేందుకు వ‌చ్చేశాయి. దీన్ని గుర్తించిన భార‌త సైనికులు.. శ‌త్రువును నిలువ‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యాయి. ర‌క్తం గ‌డ్డ క‌ట్టే చ‌లిలో పాక్ సైనికుల‌తో యుద్ధం కొన‌సాగించాయి. మే 3వ తేదీన మొద‌లైన ఈ యుద్ధం జూలై 26వ తేదీ వ‌ర‌కు కొన‌సాగింది. ‘ఆప‌రేష‌న్ విజ‌య్‌’ పేరుతో భారత్ సైన్యం శత్రువును వెన్నుచూపే వరకూ పోరాటం సాగించింది. ఈ పోరాటంలో భార‌త సైనికులు 527 మంది ప్రాణాలు కోల్పోగా.. పాక్ సైనికులు ఏకంగా 4 వేల మంది మ‌ర‌ణించారు. చివ‌ర‌కు పాకిస్తాన్ వెన్ను చూపి పారిపోక త‌ప్ప‌లేదు. ఆ విధంగా.. కార్గిల్ యుద్ధంలో జూలై 26న భార‌త్ గెలిచిన‌ట్టు కేంద్రం ప్ర‌క‌టించింది. అప్ప‌టి నుంచి ప్ర‌తీ సంవ‌త్స‌రం కార్గిల్ అమ‌రుల త్యాగాల‌ను గుర్తు చేసుకుంటూ కార్గిల్ విజ‌య దివ‌స్ ను నిర్వ‌హిస్తుంటారు.