
Pure air in Hyderabad : కనిపించకుండా ఆరోగ్యాన్ని కబళించే వాటిల్లో.. కాలుష్యం ముందు వరసలో ఉంటుంది. దానితీవ్రత ఎంతన్నది ఢిల్లీ వాసులను అడిగితే చెబుతారు. దేశరాజధానిలో ప్రమాదకరమైన రీతిలో కాలుష్యం పెరిగిపోయింది. ఇటు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనూ వాయు కాలుష్యం తీవ్రత తక్కువేమీ లేదు. రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్యతో భాగ్యనగరంలో గాలి కలుషితం ఎక్కువే జరుగుతోంది. అయితే.. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ కాలుష్యం నమోదవుతుండగా.. కొన్ని చోట్ల తక్కువ కలుషితమవుతోంది. మరి, హైదరాబాద్ లో ఏయే ప్రాంతాలు సేఫ్ జోన్లో ఉన్నాయి? ఎక్కడ స్వచ్ఛమైన గాలి లభిస్తుంది అన్నది చూద్దాం.
పెరుగుతున్న వాహనాలతోపాటు పరిశ్రమలు వెలువరించే ఉద్గారాల కారణంగా కాలుష్యం తీవ్రత పెరుగుతోంది. ఈ పరిస్థితి దేశంలో అంతటా ఉన్నప్పటికీ.. మెట్రో నగరాలు, కాస్మోపాలిటన్ సిటీల్లో పరిస్థితి మరింత అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కాలుష్య తీవ్రత ఎలా ఉంది? అనే అంశంపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ను విడుల చేసింది.
ఈ నివేదిక ప్రకారం.. గాలిలో కాలుష్య తీవ్రత 50 శాతం లోపు నమోదైతే మంచి ఆక్సీజన్ లభిస్తున్నట్టు లెక్క. 50 నుంచి 100 వరకు నమోదైతే.. స్వచ్ఛత సంతప్త స్థాయిలో ఉన్నట్టు లెక్క. 101 నుంచి 200 మధ్య నమోదైతే.. ఓ మాదిరిగా ఉన్నట్టు. 201 నుంచి 300 మధ్య నమోదైతే పూర్ గా ఉన్నట్టు లెక్క. 301 నుంచి 400 మధ్య నమోదైతే వెరీ పూర్. ఇక, 400 దాటిందంటే పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు భావిస్తారు.
ఈ గణాంకాలను బట్టి చూస్తే.. హైదరాబాద్ లో రెండు చోట్ల మాత్రమే స్వచ్ఛమైన గాలి లభిస్తోంది. అందులో ఒకటి ఖరీదైన ప్రాంతం జూబ్లిహిల్స్ కాగా.. రెండోది ఉప్పల్. ఈ ప్రాంతాల్లో ఆక్సీజన్ కాలుష్యం చాలా వరకు లేదు. ఇక్కడ గాలిలో కాలుష్య తీవ్రత 30 నుంచి 50 మధ్య నమోదైనట్టు కాలుష్య నియంత్రణ మండలి నివేదిక చెబుతోంది.
ఇంకా.. నగరంలోని ప్యారడైస్, బాలానగర్, చార్మినార్ ప్రాంతాల్లో.. కాలుష్య తీవ్రత సంతృప్తికరంగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. ఇవి కాకుండా.. మిగిలిన చోట్ల కాలుష్య తీవ్రత ఎక్కువగానే ఉందని నివేదిక ప్రకటించింది. కాంక్రీట్‌జంగల్ గా మారిపోయిన హైదరాబాద్ లో చెట్ల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుండగా.. భవనాలు మాత్రం నిలువునా మొలుస్తున్నాయి. దీంతో.. కాలుష్యం పెరిగిపోతోంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఏం చేయాలో తెలుస కదా..? కనీసం.. మనిషికి ఒక చెట్టు నాటాల్సిందే. దాన్ని సంరక్షించాల్సిందే.