Kidney Stones: కాలం మారుతున్న కొద్దీ మనుషుల శరీరాల్లో శక్తి తగ్గిపోతుంది. తినే ఆహారం బలవర్ధకంగా లేకపోవడంతో అదనంగా కొన్ని మెడిసిన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి వ్యక్తి ఎముకలు బలంగా ఉండడానికి కాల్షియం తప్పనిసరిగా ఉంటుంది. అయితే మనం తినే ఆహారంలో కాల్షియం తక్కువగా ఉండడంతో చాలామంది ఎముకలు బలహీనంగా మారిపోయాయి. కొన్ని రకాల అనారోగ్యాలు ఏర్పడినప్పుడు వైద్యులు గుర్తించి వీరికి కాల్షియం మాత్రలు ప్రత్యేకంగా ప్రిఫరెన్స్ ఇస్తారు. అయితే కొంతమంది తెలుపుతున్న ప్రకారం కాల్షియం మాత్రలు వాడితే మూత్రంలో సమస్యలు ఏర్పడతాయని అంటున్నారు. అసలు నిజంగానే కాల్షియం మాత్రలు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయా?
కొంతమంది వైద్య నిపుణులు తెలుపుతున్న ప్రకారం.. వాస్తవానికి కాల్షియం మాత్రలు అవసరం ఉన్నవారు తప్పనిసరిగా వాడాల్సిందే. ముఖ్యంగా ఎముకలు బలహీన పడినవారు.. వృద్ధులు వైద్యులు సూచించిన మేరకు అవసరమైన మెడిసిన్ తీసుకోవాలి. అయితే కాల్షియం మాత్రలు వాడడం వల్ల నేరుగా కిడ్నీలో రాళ్లు ఏర్పడవు. కానీ కొందరిలో రాళ్లు ఏర్పడే గుణం ఉంటుంది. ఇలాంటివారు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాల్షియం మాత్రలు వేసుకున్నప్పుడు శరీరంలో రక్తంలో కొంత భాగం కలిసిపోయి మిగతా భాగం మూత్రం ద్వారా బయటకు వెళ్తుంది. ఇలా బయటకు వెళ్లే క్రమంలో అప్పటికే కిడ్నీలో పోగుపడిన రాళ్లు ఉంటే వాటి ద్వారా మరింత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉన్నవారు ఈ మాత్రల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ మాత్రల కంటే కాల్షియం ఎక్కువగా ఇచ్చే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. అయితే తప్పనిసరిగా కాల్షియం మాత్రలు వాడాల్సి వస్తే నీరు ఎక్కువగా తీసుకోవాలి.
అయితే ఇటువంటి సమస్య లేనివారు కాల్షియం మాత్రలు వాడితే కిడ్నీలో రాళ్లు ఏర్పడడం అనేది అపోహనే అని వైద్యులు అంటున్నారు. కాల్షియం సమృద్ధిగా ఉంటేనే ఎముకలు బలంగా ఉంటాయి. కాల్షియం మాత్రలు వాడాల్సిన పరిస్థితి రాకముందే కాల్షియం లభించే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఆకుపచ్చని కూరగాయలు, బాదం, విత్తనాలు, పెరుగు, అత్తి పండ్లు, పాలు, బ్రోకలీ వంటి ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఎక్కువగా శారీరక శ్రమ లేనివారు వ్యాయామం చేస్తూ ఉండాలి. ఎముకలకు రక్తప్రసరణ ఎక్కువగా ఉండడంతో అవి దృఢంగా మారుతాయి. రక్త ప్రసరణ అయ్యేందుకు సరైన వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది.
ఇదే సమయంలో కిడ్నీలో కూడా సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోకుండా ఉండాలి. ఒకవేళ రాళ్లు ఏర్పడే ఆహార పదార్థాలు తీసుకోవాల్సి వస్తే ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి. సాధ్యమైనంతవరకు ప్రతిరోజు ఎక్కువగా నీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉండదు. కాల్షియం సమృద్ధిగా ఉండాలంటే విటమిన్ డి లభించే ఆహార పదార్థాలను కూడా తీసుకోవడం మంచిది.