https://oktelugu.com/

CoviShield : ఏంటి ఈ టీటీఎస్.. కోవిషీల్డ్ టీకా వేసుకున్నవారు ఎందుకు భయపడుతున్నారు?

ఆలోచన విధానం పూర్తిగా మారుతుంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇటువంటి సమస్యలు ఎవరైనా ఎదుర్కొంటే.. సొంత వైద్యం మానుకుని, వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 30, 2024 / 10:13 PM IST

    Covishield vaccine side effects

    Follow us on

    CoviShield : కరోనా ప్రబలిన సమయంలో యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్, సీరం ఇన్స్టిట్యూట్ తో కలిసి ఆస్ట్రా జనేకా అనే కంపెనీ కోవి షీల్డ్ వ్యాక్సిన్ ను తయారు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పలు రకాల పేర్లతో సరఫరా చేసింది. మనదేశంలో పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఈ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసింది.. కరోనా సమయంలో అత్యవసరంగా వాడేందుకు మన దేశం మొట్టమొదటిసారిగా ఆమోదించింది ఈ టీకానే.. అయితే ఈ వ్యాక్సిన్ ను తయారుచేసిన ఆస్ట్రా జనేకా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.. ఈ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల తమ శరీరంలో రక్తం గడ్డకడుతోందని, తీవ్రమైన దుష్పరిణామాలు ఎదుర్కొంటున్నామని కొంతమంది ఇంగ్లాండ్ కోర్టులో కేసు వేశారు. దీంతో ఈ సంస్థపై క్లాస్ యాక్షన్ వాజ్యం దాఖలయింది.

    ఈ నేపథ్యంలో కోర్టు ఎదుట ఆస్ట్రా జనేకా ప్రతినిధులు హాజరయ్యారు. “ఈ టీకా వల్ల దుష్ప్రభావాలు ఎదురవుతున్నాయని ఆస్ట్రా జనేకా అంగీకరించిందని” బ్రిటన్ దేశానికి చెందిన టెలిగ్రాఫ్ పత్రిక ఒక్క కథనాన్ని ప్రచురించింది. ” ప్లేట్ లెట్ కౌంట్ తగ్గిపోవడం.. అరుదైన పరిస్థితుల్లో రక్తం గడ్డ కట్టడం వంటి పరిణామాలకు కారణమవుతోంది. దీనిని త్రాంబోసిస్ విత్ త్రోంబో సైటోపెనియా సిండ్రోమ్ గా వ్యవహరిస్తున్నారని” టెలిగ్రాఫ్ తన కథనంలో పేర్కొంది.

    త్రాంబోసిస్ విత్ త్రోంబో సైటోపెనియా సిండ్రోమ్ అంటే ఏంటి..

    త్రాంబోసిస్ విత్ త్రోంబో సైటోపెనియా సిండ్రోమ్.. వైద్య పరిభాషలో దీనిని టీటీఎస్ అని పిలుస్తుంటారు. శరీరంలో అకస్మాత్తుగా లేదా అసాధారణంగా కీలకమైన ప్రదేశాలలో రక్తం గడ్డ కట్టడం, రక్తంలో ప్లేట్లెట్లు పడిపోవడం వంటి పరిస్థితి తలెత్తుతుంది. ప్లేట్లెట్లు అనేవి రక్తం గడ్డ కట్టడానికి ఉపకరించే చిన్న చిన్న కణాలు. కాబట్టి అవి తక్కువగా ఉంటే శరీరానికి చాలా ప్రమాదకరం. కోవిడ్ సమయంలో వాక్స్ జేవ్రియా, కోవిషీల్డ్ (ఆస్ట్రా జనేకా), జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందించిన అడెనో వైరల్ వెక్టర్ వంటి వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్ లో ఉన్న కొన్ని రకాల ఔషధాలు రక్తం గడ్డ కట్టడానికి కారణమయ్యే ప్రోటీన్ పై దాడి చేసే ప్రతి రోధకాలను తయారు చేస్తున్నాయని వెలుగులోకి వచ్చింది. వీటివల్ల శరీర రోగ నిరోధక శక్తి తీవ్రంగా ప్రతిస్పందించడం వల్ల టీటీఎస్ సంభవిస్తోందని సమాచారం.

    మొదటి దశ

    టీటీఎస్ మొదటి దశలో చిన్న పేగులు కొన్నిసార్లు కాళ్లు లేదా ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కడుతుంది. మెదడులో కూడా రక్తం చిన్నచిన్న గడ్డలు కడుతుంది. ఇతర అవయవాలలో కూడా అరుదుగా రక్తం గడ్డ కడుతుంది. రక్తంలో ప్లేట్లెట్ సంఖ్య పడిపోతుంది. మైక్రో లీటర్ కు 1,50,000 కంటే తక్కువకు ప్లేట్లెట్స్ పడిపోతాయి. టీటీఎస్ ను యాంటీ పీఎఫ్ – 4 ఎలీసా పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. అయితే అన్ని సందర్భాల్లో ఈ పరీక్ష అవసరం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మొదటి దశ కేసులు అత్యంత ప్రమాదకరమైనవి. ఇటీవల యువతలో ఈ తరహా కేసులు వెలుగు చూస్తున్నాయి.

    రెండవ దశ

    ఈ దశలో కాళ్లు లేదా ఊపిరితిత్తుల్లో సాధారణ స్థాయిలో రక్తం గడ్డకడుతుంది. ప్లేటేట్ల సంఖ్య మైక్రో లీటర్ కు 1,50,000 కంటే తక్కువకు పడిపోతుంది. యాంటి పీఎఫ్ 4 ఎలీసా టెస్ట్ ద్వారా దీన్ని నిర్ధారించవచ్చు.

    టీటీఎస్ వస్తే ఏమవుతుంది..

    ఇది సోకితే తీవ్రమైన తలనొప్పి ఏర్పడుతుంది. కడుపునొప్పి బాధిస్తుంది. కాళ్లల్లో వాపులు ఉంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. మెదడు పనితీరు ప్రభావితమవుతుంది. ఆలోచన విధానం పూర్తిగా మారుతుంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇటువంటి సమస్యలు ఎవరైనా ఎదుర్కొంటే.. సొంత వైద్యం మానుకుని, వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.