Blood Group
Blood Group : రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండే బ్లడ్ గ్రూప్ ఏది అనే ప్రశ్న మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది. అయితే మానవ శరీరంలో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన బ్లడ్ గ్రూప్ ఉంటుంది. అంటే రక్తం వివిధ రకాల బ్లడ్ గ్రూపులకు చెందినది. A, B, AB , O అని నాలుగు ప్రధాన రక్త గ్రూప్ లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ బ్లడ్ గ్రూపులు రక్తంలోని ఎర్ర రక్త కణాల ఉపరితలంపై ఉండే యాంటిజెన్ల ఆధారంగా నిర్ణయిస్తారు. పూర్వం, ఒక వ్యక్తి బ్లడ్ గ్రూప్ ఆ వ్యక్తి ఆరోగ్యం, వ్యక్తిత్వం , అతను లేదా ఆమె ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలను నిర్ణయిస్తుందని నమ్మేవారు. ఈ నమ్మకాలను బట్టి వివిధ రకాల ఆహారాలు , జీవనశైలిని అనుసరిస్తుంటారు అని కూడా అంటారు.
రక్తవర్గం , రోగనిరోధక శక్తి మధ్య సంబంధం గురించి చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. రక్తవర్గం వ్యక్తి ఆరోగ్యాన్ని, ముఖ్యంగా రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రక్తవర్గం ప్రధానంగా ఎర్ర రక్తకణాల ఉపరితలంపై ఉండే యాంటిజెన్ల ఆధారంగా నిర్ణయిస్తారట. ఈ యాంటిజెన్లు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తాయని అంటున్నారు వైద్యులు. కొన్ని రక్తవర్గాలు ఇతర వ్యాధులకు ఎక్కువ ప్రతిఘటనను కలిగిస్తాయట. రక్తవర్గం జన్యుపరంగా నిర్ణయిస్తారు. ఈ బ్లడ్ గ్రూప్ తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వస్తుంది. జన్యుపరమైన కారకాలు మీ రోగనిరోధక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తాయి అంటున్నారు నిపుణులు.
అయితే O రక్తం గ్రూపు ఉన్న వ్యక్తులు కొన్ని రకాల వ్యాధులకు తక్కువ అవకాశం ఉంటుందని చెబుతున్నాయి అధ్యయనాలు. ముఖ్యంగా, మలేరియా వంటి వ్యాధులకు O బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులకు తక్కువ ప్రమాదం ఉంటుందట. ఈ గ్రూప్ ఉన్న వారు ప్లేగు వ్యాధి వచ్చే అవకాశం చాలా తక్కువ. A, B రక్తం గ్రూపు ఉన్న వ్యక్తులలో కొన్ని రకాల క్యాన్సర్‌లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఇక A బ్లడ్ గ్రూప్ ఉన్న వారు కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుందట. AB బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు కొన్ని రకాల హృదయ వ్యాధుల బారిన పడతారట. ఇదెలా ఉంటే ఈ అధ్యయనాలు ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయి. బ్లడ్ గ్రూప్, రోగనిరోధక శక్తి మధ్య సంబంధం గురించి మరింత పరిశోధన చేయాల్సి ఉంటుంది అంటున్నారు నిపుణులు.
మంచి ఆహారం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, గింజలు , మొలకలు వంటివి తినాలి. వీటిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ ఆహారాలను తీసుకోవడం మంచిది . రోజూ వ్యాయామం చేయాలి. దీని వల్ల మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. తగినంత నిద్ర అవసరం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ముఖ్యం నిద్ర. ఒత్తిడిని తగ్గించుకోవాలి. దీనికి రోగనిరోధక శక్తి చాలా సహాయపడుతుంది. తగినంత నీరు తాగాలి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు.