Health effects of stopping coffee: కాఫీ.. మనలో చాలామందికి ఇష్టమైన హాట్ బేవరేజ్. తలనొప్పి, ఒత్తిడి, చికాకు, అలసట వీటినుంచి తక్షణమే ఉపశమనం పొందడానికి చాలామంది కాఫీ తాగుతుంటారు. కాఫీ అనేది పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అయిన బేవరేజ్. కాకపోతే విదేశీయుల కంటే మనమే ఎక్కువ కాఫీ తాగుతుంటాం. భారతీయులు విపరీతంగా కాఫీ తాగుతుంటారు. ఓ నివేదిక ప్రకారం భారతీయ కాఫీ మార్కెట్ విలువ 2025లో 9.53 మిలియన్ డాలర్లుగా నమోదయింది. 2034 నాటికి ఇది 17.31 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. దీనినిబట్టి భారతీయులు కాఫీ ఏ స్థాయిలో తాగుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇండియన్ కాఫీ ఇండస్ట్రీలో పెద్దపెద్ద కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇందులో నెస్కేపీ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత బ్రూ, కాంటినెంటల్ వంటి కంపెనీలు ఉన్నాయి. కాఫీ కేవలం హాట్ డ్రింక్ మాత్రమే కాదు.. కోల్డ్ వేరియంట్లో కూడా దొరుకుతుంది.. ఇంకా ఇందులో రకరకాల ఫ్లేవర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అందువల్లే చాలామంది కాఫీని ఇష్టంగా తాగుతుంటారు.
కాఫీ కొంతమంది ఉదయం సాయంత్రం తాగితే.. ఇంకొంతమంది మంచినీళ్లు తాగినట్టు తాగుతుంటారు. ఇటువంటి వారికి కాఫీ అనేది ఒక వ్యసనం లాగా ఉంటుంది. వాస్తవానికి కాఫీ అదే పనిగా తాగితే శరీరంలో రకరకాల మార్పులు చోటు చేసుకుంటావని ప్రముఖ న్యూరాలజిస్ట్ ప్రవీణ్ గుప్తా, డైటీషియన్ మీనాక్షి పేర్కొన్నారు. వీరు కొంతకాలంగా కాఫీ తాగే వారి మీద పరిశోధనలు చేశారు. వారి పరిశోధనలో కీలకమైన అంశాలను బయటపెట్టారు. కాఫీ మానేసిన 12 నుంచి 24 గంటల్లో అలసట, తలనొప్పి, చిరాకు వంటివి ఉంటాయట. దోపమైన్ తగ్గడం, ఆడే నోసిన్ ప్రభావం వల్ల ఇలాంటి ఇబ్బంది ఉంటుందట. మెదడు రక్తనాళాల విస్తరణ వల్ల కూడా ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుందట. కొందరికి వాంతులు, కండరాలను నొప్పులు కూడా వస్తుంటాయట. అయితే మొదటి మూడు రోజుల వరకు ఇలానే పరిస్థితి ఉంటుందట. ఆ తర్వాత క్రమంగా సాధారణ స్థితికి వస్తుందట. వారం నుంచి పది రోజుల్లో ఎక్కువమంది సాధారణ స్థితికి వస్తుంటారట.
కాఫీ వల్ల క్షణకాలంలోనే మెదడు ఉత్తేజితమవుతుంది. రకరకాల హార్మోన్ల విడుదలకు కాఫీ కారణమవుతుంది. కాఫీలో కేఫిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో తాత్కాలిక ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అందువల్లే చాలామంది కాఫీని తాగుతుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కెఫిన్ అనేది ఒక వ్యసనం లాగా మారిపోతే.. అది లభించకపోతే శరీరం రకరకాల సంకేతాలను ఇస్తూ ఉంటుంది. దానివల్ల కెఫిన్ తీసుకోవాలని మెదడు సంకేతాలు ఇస్తూ ఉంటుంది. దానివల్ల పదేపదే కాఫీ తాగాలి అనిపిస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అదేపనిగా కాఫీ తాగితే రకరకాల సమస్యలు వస్తాయి. ఎసిడిటీ.. ఆకలి మందగించడం.. స్వల్ప కాలం మాత్రమే ఒక పని మీద దృష్టి కేంద్రీకరించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందువల్లే కాఫీని మితంగా తాగాలని.. మధుమేహం.. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు సాధ్యమైనంతవరకు కాఫీని వైద్యుల సలహాల మేరకు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.