liquor bottles : రోజంతా ఒత్తిడితో గడిపేవారు కాస్త మద్యం చుక్కలతో రిలాక్స్ అవుదామని అనుకుంటారు. అందులోనూ ఆదివారం వచ్చిందంటే మద్యం బాబులకు పండుగే. అయితే మద్యం కొనుగోలు చేసే వారిలో చాలామందికి ఒక సందేహం ఎప్పటికీ వస్తుంటుంది. వైన్, విస్కీ, రమ్, బ్రాందీ, వోడ్కా వంటి లిక్కర్ ఫుల్ బాటిల్స్‌లో సాధారణంగా 750 మిల్లీలీటర్లు (ML) మాత్రమే ఎందుకు ఉంటాయి? ఒక లీటర్ బాటిల్‌గా ఎందుకు విక్రయించరు? దీనిపై ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు లేకపోయినా, చరిత్రకారులు మరియు పరిశ్రమ నిపుణులు కొన్ని ఆసక్తికరమైన సిద్ధాంతాలను చెబుతున్నారు. అవేంటంటే?
పూర్వకాలంలో యూరప్‌లో గాజు బాటిళ్లను పూర్తిగా చేతితో తయారు చేసేవారు. కరిగించిన గాజును పొడవైన గొట్టం ద్వారా నోటితో గాలి ఊది బాటిల్ ఆకారంలోకి మార్చేవారు. సాధారణంగా ఒక వ్యక్తి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని బట్టి ఒకేసారి సుమారు 700 నుంచి 800 మిల్లీలీటర్ల వరకు మాత్రమే గాజును విస్తరింపజేయగలిగేవారని చెబుతారు. దీంతో సగటుగా 750ML సామర్థ్యం గల బాటిళ్లు తయారయ్యేవి. కాలక్రమేణా ఇదే పరిమాణం పరిశ్రమలో ప్రామాణికంగా మారిందనే అభిప్రాయం ఉంది.
మరో ప్రసిద్ధ సిద్ధాంతం ప్రకారం, బ్రిటన్‌లో ఉపయోగించే పాత కొలతల వ్యవస్థలో 750ML దాదాపు ఐదు లేదా ఆరవ వంతు క్వార్ట్ కు సమానంగా ఉండేది. అంతర్జాతీయ వాణిజ్యం పెరిగిన సమయంలో ఈ పరిమాణాన్ని అనుసరించడం సులభంగా ఉండటంతో, అదే ప్రపంచవ్యాప్తంగా కొనసాగిందని చెబుతారు. ఫ్రాన్స్ వంటి దేశాలు అమెరికాకు పెద్దఎత్తున వైన్ ఎగుమతి చేసే సమయంలో కూడా 750ML బాటిళ్లు అనుకూలంగా ఉండేవి. ఎందుకంటే అమెరికాలో గ్యాలన్, క్వార్ట్ వంటి ఇంపీరియల్ కొలతలు వాడేవారు. ఒక గ్యాలన్‌లో సుమారు ఐదు 750ML బాటిళ్లు సరిపోవడంతో ప్యాకింగ్, రవాణా, పన్నుల లెక్కలు సులభంగా ఉండేవి. దీంతో ఈ పరిమాణం అంతర్జాతీయంగా మరింత ప్రాచుర్యం పొందింది.
1970వ దశకంలో అమెరికా సహా అనేక దేశాలు వైన్, స్పిరిట్స్ విక్రయాలకు మెట్రిక్ విధానాన్ని స్వీకరించాయి. ఆ సమయంలో 750MLను అధికారిక ప్రామాణిక బాటిల్ సైజ్‌గా గుర్తించారు. అప్పటి నుంచి ప్రపంచంలోని చాలా దేశాల్లో ఫుల్ బాటిల్ అంటే 750ML అనే భావన స్థిరపడిపోయింది.
750ML బాటిళ్లు ఎక్కువగా కనిపించినప్పటికీ, 1 లీటర్, 375ML, 180ML, 90ML వంటి పరిమాణాల్లో కూడా మద్యం బాటిళ్లు అందుబాటులో ఉంటాయి. అయితే ప్రీమియం వైన్, విస్కీ, ఇతర స్పిరిట్స్‌లో 750MLనే ప్రధాన ప్రామాణిక పరిమాణంగా ఉపయోగిస్తున్నారు. 750ML పరిమాణం వెనుక ఒకే ఒక్క అధికారిక కారణం ఉందని చెప్పడానికి చారిత్రక ఆధారాలు లేవు. గాజు బాటిళ్ల తయారీ విధానం, బ్రిటిష్ కొలతల వ్యవస్థ, అంతర్జాతీయ వాణిజ్యం, ఎగుమతి సౌలభ్యం వంటి అనేక అంశాల కలయిక వల్లే ఈ పరిమాణం ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా మారిందని నిపుణులు భావిస్తున్నారు.
