Rahul Gandhi West Bengal: ప్రాంతీయ పార్టీకి చెందిన నాయకుడు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమవుతాడు. అదే జాతీయ స్థాయి నాయకుడైతే.. దేశానికి మొత్తం పరిమితమవుతాడు. కాకపోతే జాతీయ స్థాయి నాయకుడు చేసే రాజకీయాలు దేశస్థాయిలో ఉండాలి. అలాకాకుండా.. అవసరాలకు తగ్గట్టుగా మాట్లాడి.. రాజకీయాలను తనకు నచ్చినట్టుగా చేసుకుంటూ పోతే అతడు జాతీయ నాయకుడు కాలేడు. ఎంచుకున్న లక్ష్యాలను ఏనాటికి కూడా చేరుకోలేడు. ఇప్పుడు ఈ పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ అనుభవిస్తున్నారు.
రాహుల్ గాంధీ స్థిరంగా ప్రతిపక్ష నాయకుడిగా పని చేస్తే బిజెపి ఒత్తిడి ఎదుర్కొంటుంది. నరేంద్ర మోడీకి ఇబ్బందికరమైన పరిణామం ఎదురవుతుంది. కానీ ఏనాడు కూడా రాహుల్ గాంధీ బలమైన ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించలేదు.. కనీసం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా వ్యవహరించలేదు. దీంతో 2014 నుంచి ఇప్పటివరకు బిజెపికి కేంద్రంలో ప్రతి ఎన్నిక కూడా అనుకూలంగానే మారిపోయింది. 2024 లో కాంగ్రెస్ పార్టీ కాస్త బెటర్ పెర్ఫార్మన్స్ చేసినప్పటికీ.. అది బిజెపిని అధికారంలోకి రాకుండా అడ్డుకోలేకపోయింది.
ఇక మనదేశంలో అతిపెద్ద రాష్ట్రాలలో ఒకటైన వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్.. బిజెపి పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. స్వయంగా రంగంలోకి నరేంద్ర మోడీ దిగారు. అటు మమతా బెనర్జీ తగ్గేదే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ బిజెపికి ఎంత స్కోప్ అయితే ఉందో.. కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే స్కోప్ ఉంది. ఎందుకంటే బిజెపి ప్రధాన జాతీయ పార్టీ అయినప్పుడు.. కాంగ్రెస్ పార్టీ కూడా అదే కదా. బిజెపి శక్తి వంచన లేకుండా ఇక్కడ ప్రచారం చేసుకుంటూ పోతుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం సైలెంట్ అయిపోయింది.
కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరు రకరకాల చర్చలకు దారి తీస్తోంది. ఇతర రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు రాహుల్ గాంధీ ప్రచారానికి వస్తుంటారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతారు. కానీ వెస్ట్ బెంగాల్ లో మాత్రం రాహుల్ గాంధీ ఒకసారి మాత్రమే ప్రచారం చేశారు. గతంలో ఇండియా కూటమిలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీహార్లో పొత్తు ఉన్నప్పటికీ.. పలు ప్రాంతాలలో ఆర్ జె డి కి వ్యతిరేకంగా ప్రసంగాలు చేశారు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని సుతి మెత్తగా విమర్శించారు రాహుల్ గాంధీ. కానీ ఆయన లోపల మాత్రం మమత బెనర్జీకి సహకరిస్తున్నారని బిజెపి నేతలు విమర్శిస్తున్నారు. వాస్తవానికి రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో బిజెపి మాదిరిగా గట్టిగా ప్రచారం చేస్తే కొన్ని సీట్లు లభించే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో కార్యవర్గానికి భరోసా లభించేది. కానీ అవేవీ రాహుల్ గాంధీ చేయడం లేదు. అందువల్లే వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నిరాశలో మునిగిపోయారు.