West Nile In Kerala: కేరళలో కొత్త జ్వరం ‘వెస్ట్ నైల్’ కలవర పెడుతోంది. ఈ జ్వరం వల్ల తీవ్ర అస్వస్థతకు గురి కావడమే కాకుండా ప్రాణాపాయం కూడా ఉందని వైద్య అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఈ రాష్ట్రంలోని మల్లప్పురం, కోజికోడ్, త్రిసూర్ వెస్ట్ నైల్ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు. వెస్ట్ నైల్ అనే దోమ వల్ల ఈ వ్యాధి ప్రబలుతుందని, ఈ వ్యాధికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి మందులు లేవని, వ్యాక్సిన్ సైతం ఇంకా గుర్తించలేదని అంటున్నారు. అయతే ఈ జ్వరం లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో చూద్దాం..
‘వెస్ట్ నైల్’ అనే జ్వరాన్ని 1937లో ఉగాండాలో కనుగొన్నారు. మనదేశంలో దీని ద్వారా 2019లో ఓ బాలుడు చనిపోవడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ప్రతీ మాన్ సూన్ కు ముందుగా ఈ వ్యాధి ప్రబలుతుందని వైద్యులు చెబుతున్నారు. వెస్ట్ నైల్ ఫీవర్ ద్వారా ప్రాణాపాయం ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలని అంటున్నారు.
క్యూలెక్స్ జాతికి చెందిన వెస్ట్ నైల్ అనే దోమ కాటు వల్ల ఈ జ్వరం వస్తుంది. ఇది ఉన్న వారు తలనొప్పితో పాటు జ్వరం, తల తిరగడం, కండరాల నొప్పుల వంటి వాటితో అస్వస్థతకు గురవుతారు. అయితే వెస్ట్ నైల్ సోకిన వెంటనే కాకుండా కొన్ని రోజుల తరువాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఎక్కువగా మెదడుపై ప్రభావం చూపుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు చనిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.
వెస్ట్ నైల్ కు ఎలాంటి ఔషధాలు లేవని వైద్యులు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ కూడా కనుగొనలేదని పేర్కొంటున్నారు. అందువల్ల ముందు జాగ్రత్తగా దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలని అంటున్నారు. అయితే ఈ జ్వరం సోకిన వారికి లక్షణాల ఆధారంగా చికిత్స చేస్తారని అంటున్నారు. లేటేస్టుగా మూడు జిల్లాల్లో వెస్ట్ నైల్ కేసులు నమోదయ్యాయని, ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.