AP Elections 2024: సిక్కోలులో బాబాయ్, అబ్బాయి పై జగన్ టార్గెట్.. వర్కౌట్ అవుతుందా?

టెక్కలి నియోజకవర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కృపారాణి కాళింగ సామాజిక వర్గానికి చెందినవారే. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కృపారాణిని జగన్ వైసీపీలోకి ఆహ్వానించారు.

Written By: Dharma, Updated On : May 8, 2024 4:34 pm

AP Elections 2024

Follow us on

AP Elections 2024: శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబానిది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. దివంగత నేత ఎర్రం నాయుడు ఆ కుటుంబం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే అంతకంటే ముందే ఎర్రం నాయుడు పెదనాన్న కృష్ణమూర్తి హరిశ్చంద్ర పురం ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టారు. టిడిపి ఆవిర్భావంతో ఎర్రం నాయుడు ఆ పార్టీలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రి స్థాయికి చేరారు. తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 గా ఎదిగారు. ఎర్రం నాయుడు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో.. ఆయన సోదరుడు అచ్చెనాయుడు ఆయన ఖాళీ చేసిన ఎమ్మెల్యే సీటుకు పోటీ చేసి గెలుపొందారు. ఎర్రన్న అకాల మరణంతో కుమారుడు రామ్మోహన్ నాయుడుపొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.2014లో తొలిసారిగా ఎంపీ అయ్యారు. 2019లో జగన్ ప్రభంజనాన్ని తట్టుకొని బాబాయ్ టెక్కలి నుంచి అసెంబ్లీకి, అబ్బాయి శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మరోసారి ఇద్దరు బరిలోకి దిగారు.

అయితే వీరిద్దరిని ఓడించాలని జగన్ కృత నిశ్చయంతో ఉన్నారు. గట్టి అభ్యర్థులను బరిలోదించారు. సామాజిక సమీకరణలకు పెద్దపీటవేశారు. అచ్చన్నపై దువ్వాడ శ్రీనివాసును, రామ్మోహన్ నాయుడు పై పేరాడ తిలక్ ను ప్రయోగించారు. పక్కాగా వర్కౌట్ అవుతుందని భావించారు. దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో.. కాళింగ సామాజిక వర్గం పోలరైజ్ అవుతుందని భావించారు. దీంతో టెక్కలి నుంచి పోటీ చేస్తున్న అచ్చన్న ఓటమి ఖాయమని ఒక నిర్ణయానికి వచ్చారు. కాళింగ సామాజిక వర్గమంతా ఏకమై వైసీపీకి మద్దతు తెలిపితే రామ్మోహన్ నాయుడు ఓడిపోతారని కూడా భావించారు. కానీ కాళింగులలో బలమైన చీలిక కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ వైపు 50% కాలింగులు మొగ్గు చూపడంతో జగన్ ప్రయత్నానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి.

టెక్కలి నియోజకవర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కృపారాణి కాళింగ సామాజిక వర్గానికి చెందినవారే. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కృపారాణిని జగన్ వైసీపీలోకి ఆహ్వానించారు. సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత ఐదేళ్లలో ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవుల ప్రకటన సమయంలో కృపారాణి పేరు పరిగణలోకి తీసుకోవడం, తరువాత మరిచిపోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి తనకు అవకాశం దక్కుతుందని కృపారాణి భావించారు. లేకుంటే టెక్కలి అసెంబ్లీ స్థానాన్ని అయినా కేటాయిస్తారని భావించారు. కానీపేరు పరిగణలోకి తీసుకోలేదు. తీవ్ర మనస్థాపానికి గురైన కృపారాణి టిడిపిలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరి.. కాళింగ సామాజిక వర్గ ఓట్లు చీల్చాలని ఆమె బలంగా నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతం శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు గాను.. అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులకు ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యేలు అసంతృప్తి స్వరం వినిపించారు. కానీకొద్ది రోజులకే మెత్తబడ్డారు.అక్కడ పరిస్థితి చల్లబడింది. టిడిపి క్యాడర్ సైతం బలంగా పనిచేస్తోంది. దీంతో ఎంపీ రామ్మోహన్ నాయుడుకే ఎడ్జ్ కనిపిస్తోంది. టెక్కలిలో సైతం అచ్చన్న బలమైన స్థితిలో ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ కు సొంత పార్టీ నుంచే ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదు. ఆయన భార్య సైతం దువ్వాడ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. అయితే ఈసారి కూడా బాబాయి,అబ్బాయి గెలుపు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అటు సర్వేలు కూడా గెలుపు ఖాయమని స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రజల మదిలో ఏముందో జూన్ 4న తెలియనుంది.