మనలో చాలామందిని సాధారణంగా వేధించే సమస్యలలో తలనొప్పి కూడా ఒకటి. చాలామంది తలనొప్పి కోసం ట్యాబ్లెట్లను వినియోగిస్తూ ఉంటారు. అయితే ట్యాబ్లెట్ల వల్ల తలనొప్పి తాత్కాలికంగా తగ్గినా ఆ సమస్య మళ్లీమళ్లీ వేధిస్తూ ఉంటుంది. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మనం సులభంగా తలనొప్పి సమస్యకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. తలనొప్పి సమస్యకు తరచుగా మందులు వాడినా ప్రమాదమేనని వైద్యులు చెబుతున్నారు.
వైద్యులు 200 రకాల తలనొప్పులు ఉన్నాయని.. ఈ తలనొప్పుల్లో మెజారిటీ తలనొప్పులు నిద్రలేమి, ఆకలి, ఒత్తిడి వల్ల కలిగేవని తెలుపుతున్నారు. అయితే కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా తలనొప్పి సమస్యకు సులువుగా చెక్ పెట్టవచ్చు. చాలామంది ఉద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల, ఎక్కువగా ఆలోచించడం వల్ల తలనొప్పి బారిన పడుతూ ఉంటారు. తలనొప్పి మొదలవగానే నిదానంగా శ్వాస తీసుకుంటే మంచిది.
తగినంత నీళ్లు తీసుకోకపోయినా కొన్ని సందర్భాల్లో తలనొప్పి వేధించే అవకాశాలు ఉంటాయి. అందువల్ల రోజులో ఎంత బిజీగా ఉన్నా తగినంత నీళ్లు తీసుకోవాలి. అయితే చల్లటి నీళ్ల కంటే సాధారణ నీటిని తీసుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో చల్లని నీళ్లు సైతం రోగాల బారిన పడటానికి కారణమవుతూ ఉంటాయి. మంచుగడ్డలను గుడ్డలో చుట్టి తలపై పెట్టుకున్నా తలనొప్పి తగ్గుముఖం పడుతుంది.
అల్లం, పుదీనా ఆకులతో తయారు చేసిన టీ సులువుగా తలనొప్పిని దూరం చేస్తుంది. నిమ్మరసం తాగినా, దాల్చిన చెక్క పొడిని కణతులకు రాసినా తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎక్కువసార్లు కాఫీ తాగినా, అతిగా చాక్లెట్లు తిన్నా, తలనొప్పి మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు.