Health Care: ఆరోగ్యంపై చాలా మంది శ్రద్ధ చూపించడం లేదు. ఫలితంగా ఆస్పత్రుల్లో చేరుతున్నారు. లేనిపోని రోగాలు కొనితెచ్చుకుని వ్యథ అనుభవిస్తున్నారు. నూరేళ్లు హాయిగా జీవించే అవకాశం ఉన్న శరీరాన్ని పాతికేళ్లకు వ్యాధులు పట్టేలా చేసుకుని నిరంతరం భయపడుతున్నారు. మన దేహంలో ఉన్న ఆరోగ్య వ్యస్థ అలా తయారు చేయబడినా స్వయంకృతాపరాధంతో మనకు పడని వాటిని తింటూ కడుపును కీకారణ్యం చేస్తున్నారు. దీంతో కొత్త కొత్త రోగాలు చుట్టుముట్టి వేధిస్తున్నాయి. మన వంటింట్లోనే ఎన్నో ఔషధాలు దాగున్నా వాటిని కాదని ఫిజా, బర్గర్లు, కూల్ డ్రింక్స్, మద్యం తీసుకుంటూ ఆరోగ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నాం.

ఆరోగ్య సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిర్లక్ష్యం చేస్తున్నాం. సమయానుకూలంగా భోజనం చేయకుండా అర్థరాత్రి వరకు తింటూనే ఉన్నాం. దీంతో అది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతోంది. తెల్లవార్లు కాలేయం మనం తిన్న దాన్ని అరిగించడానికే పని చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో మన శరీరంలోని ఇతర అవయవాలు కూడా పనిచేయకుండా పోతున్నాయి. కాలేయం దెబ్బతింటే అన్నింటికి ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ ఇవేమీ పట్టించుకోవడం లేదు.
మనం తీసుకునే ఆహారంలో ఒక పూట ఉడకని ఆహారం తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుందని తెలిసినా లెక్కచేయడం లేదు. ఆహారం తీసుకోవడంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అర్ధరాత్రి వరకు తింటూ సరిగా నిద్ర లేక ఇబ్బందులు పడుతున్నా మనుషుల్లో మార్పు రావడం లేదు. సాయంకాలం డిన్నర్ త్వరగా ముగించుకుంటే త్వరగా జీర్ణం అయి మంచి నిద్ర పడుతుంది. దీంతో మానసిక ఒత్తిడి, ఆందోళనలు దూరమవుతాయి. నిద్ర బాగా పట్టాలంటే మంచి సంగీతం వినాలి. పుస్తక పఠనం చేస్తే కూడా ఫలితం ఉంటుంది.
సమయానికి తింటూ రోజుకు సుమారు ఆరు గంటలైనా నిద్ర పోయేలా చూసుకుంటే ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయాలి. వ్యాయామం చేస్తే ఇంకా మంచిదే. ఆరోగ్య సూత్రాలు పాటిస్తేనే మన జీవితం సాఫీగా సాగుతుంది. భోజనంలో మసాలాలు, కారం, పులుపు వంటివి తగ్గించాలి. వేపుళ్లు మానేయాలి. కూరగాయలతో సలాడ్లు చేసుకుని తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందని తెలుసుకోవాలి. ఆరోగ్య సంరక్షణలో అప్రమత్తంగా ఉండకపోతే దుష్ఫలితాలు ఏర్పడతాయని గుర్తుంచుకోవాలి.