
భారత్ లో చాప కింద నీరులా కరోనా మహామ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా అంచనాలను మించి కరోనా కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి. చాలామంది అప్పుడే పుట్టిన శిశువులకు కరోనా వైరస్ సోకితే ప్రమాదమని భావిస్తున్నారు. అయితే లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి కీలక విషయాలను వెల్లడించారు. నవజాత శిశువులకు కరోనా సోకే అవకాశాలు తక్కువని శాస్త్రవేత్తలు చెప్పారు.
నవజాత శిశువులు కరోనా బారిన పడినా వేగంగా కోలుకుంటారని.. వారిపై వైరస్ ప్రభావంచూపే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వెల్లడించారు. అప్పుడే పుట్టిన చిన్నారులు వైరస్ బారిన పడినా వైరస్ వల్ల వాళ్లకు ఎలాంటి హాని కలగదని గుర్తించామని శాస్త్రవేత్తలు చెప్పారు. లాన్సెట్ జర్నల్ లో ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి. మార్చి నుంచి ఏప్రిల్ వరకు నెల రోజుల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులపై అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు.
నవజాత శిశువులకు కరోనా సోకితే తీవ్ర జ్వరం, వాంతులు, నీరసం , ఇతర లక్షణాలు కనిపిస్తాయని కరోనా సోకిన నవజాత శిశువుల్లో కేవలం 0.06 శాతం మందికి మాత్రమే ఆస్పత్రిలో చికిత్స అందించాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే కరోనా సోకిన నవజాత శిశువుల్లో ఎవరూ చనిపోలేదని తెలిపారు. నెలలు నిండకుండా పుట్టిన పసిపిల్లలు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నాయని పేర్కొన్నారు.
కరోనా సోకిన తల్లి నుంచి శిశువును వేరు చేసినా కొందరు చిన్నారులకు కరోనా సోకిందని అందువల్ల కరోనా సోకిన తల్లి నుంచి శిశువును దూరం చేయడం తప్పనిసరి కాదని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లొ కరోనా కట్టడి చర్యలు గతంతో పోలిస్తే గణనీయంగా అభివృద్ధి చెందాయని ఫలితంగానే సులువుగా కరోనాను కట్టడి చేయడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.